Vicky Kaushal: 'ఛావా' విజయాన్ని మరువలేకున్న రశ్మిక
ABN, Publish Date - Apr 21 , 2025 | 02:37 PM
విక్కీ కౌశల్, రశ్మిక జంటగా నటించిన చారిత్రక చిత్రం 'ఛావా' రూ. 600 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమా కలెక్షన్స్ పోస్టర్ ను రశ్మిక పోస్ట్ చేసింది.
కొన్ని సినిమాలు అందించే విజయాన్ని కొందరు నటీనటులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు ఆ పాత్ర ద్వారా తమకు సమాజంలో పెరిగే గౌరవం కారణంగా వారికి అలాంటి చిత్రాలు, పాత్రలు చాలా కాలం గుర్తుండిపోతాయి. వాటి తాలుకు విజయాలను వారు పదే పదే తలుచుకోవడానికి ఇష్టపడుతున్నారు. స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రశ్మికా మందణ్ణ (Rashmika Mandanna) కు 'ఛావా' (Chhaava) అలాంటి సినిమానే! దీనికి ముందు పలు చిత్రాల ద్వారా రశ్మిక విజయాలను అందుకుంది. జాతీయ స్థాయిలో గుర్తింపునూ తెచ్చుకుంది. కానీ 'ఛావా' ద్వారా లభించిన గౌరవం వాటికి అతీతమైంది. 'యానిమల్, పుష్ప -2' చిత్రాల తర్వాత రశ్మిక నటించిన 'ఛావా' మూవీ విడుదలై ఆమెకు హ్యాట్రిక్ ను అందించింది. నిజానికి ఈ మూడు చిత్రాలలోనూ నటిగా రశ్మిక ఆ యా పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చింది.
రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన 'యానిమల్' (Animal) మూవీలో రశ్మిక చాలా క్లిష్టతరమైన పాత్రను పోషించింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోవడంతో పాటు అతని అభిప్రాయాలను గౌరవిస్తూ ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోయే గృహిణి పాత్ర ఆమెది. ఆ తర్వాత తిరిగి స్వదేశానికి భర్తతో పాటు వచ్చినప్పుడు... భర్తలోని ఆవేశకావేశాలను సరిగా అర్థం చేసుకోలేక సతమతమయ్యే పరిస్థితి! ఒకానొక సమయంలో ఎంతో ప్రేమించిన భర్త తనను మోసం చేశాడని తెలిసి కుమిలిపోతుంది. ఇన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రను రశ్మిక అవలీలగా పోషించింది. అలానే 'పుష్ప'కు సీక్వెల్ అయినా... 'పుష్ప-2'లోని పాత్ర మొదటి సినిమాతో పోల్చితే కాస్తంత భిన్నమైంది. ఈ పాత్రను ఆమె హాయిగా చేసేసింది. ఈ రెండు సినిమాల విజయం రశ్మికకు ఆనందాన్ని కలిగించినా... సమాజంలో ఆ యా పాత్రల ద్వారా ఆమెకు గౌరవం లభించలేదు. ఆ లోటును 'ఛావా' లోని యశోబాయి పాత్ర తీర్చింది. చారిత్రక చిత్రం 'ఛావా'లో శంభాజీ మహరాజ్ భార్యగా, ఆయనకు బాసటగా నిలిచే పాత్రను రశ్మిక పోషించింది. ఆమె పోషించిన ఉదాత్తమైన పాత్ర పేరు తెచ్చిపెట్టడంతో పాటు, సినిమా కమర్షియల్ గానూ సక్సెస్ అయ్యింది.
ఇటీవల వచ్చిన సల్మాన్ ఖాన్ 'సికందర్' రశ్మికను నిరాశకు గురిచేసింది. అయితే... ఆ చేదు అనుభవాన్ని మర్చిపోతూ, రశ్మిక ఇప్పటికీ 'ఛావా' విజయాన్ని ఆస్వాదిస్తోంది. తాజాగా రశ్మిక 'ఛావా' రూ. 600 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన పోస్టర్ ను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'మీ ప్రేమ ఎల్లప్పుడూ మాకు ఆనందాన్ని కలిగిస్తుంది' అని పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ యేడాది రశ్మిక నుండి మూడో సినిమా కూడా రావడానికి సిద్థంగా ఉంది. ఆమె లేటెస్ట్ మూవీ 'కుబేర' జూన్ 20న జనం ముందుకు వస్తోంది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'కుబేర' రశ్మికను తిరిగి సక్సెస్ ట్రాక్ పైకి తీసుకొస్తుందేమో చూడాలి.
Also Read: Singer Pravashti: పాడుతా తీయగా పై ఫైర్ అయిన సింగర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి