Madhavan: కొంపముంచిన ఏఐ.. మాధవన్‌కు అనుష్క కాల్
ABN, Publish Date - Feb 05 , 2025 | 01:10 PM
"అనుష్క శర్మ నుండి నాకు మెసేజ్ వచ్చింది. అది రియల్ వీడియో కాదని.. ఫేక్ అని.. ఏఐతో దానిని సృష్టించారని ఆమె తెలిపింది. ఆ నిమిషం నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది."
ఏఐ(AI) వాడకం విరివిగా పెరిగిన క్రమంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే పలువురు నేరగాళ్ల తమ కార్యక్రమాలను చకచకా చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు సినీ, క్రికెట్ తారల అభిమానులు కూడా తమకు నచ్చిన విధంగా వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. దీంతో సాధారణ ప్రజలే కాదు, బడా సెలబ్రిటీలు కూడా ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతున్నారు. తాజాగా నటుడు మాధవన్ తనకు ఎదురైనా అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు.
మాధవన్ మాట్లాడుతూ.. 'ఏఐ వల్ల నేను కూడా మోసపోయాను. గతంలో సోషల్‌మీడియాలో నేనొక వీడియో చూశాను. ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో... మన క్రికెటర్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తున్న వీడియో అది. కోహ్లీ అంటే తనకెంత ఇష్టమో.. ఆయన నాయకత్వ లక్షణాలను పొగుడుతూ రొనాల్డో మాట్లాడారు. అది నాకెంతో నచ్చింది. వెంటనే దానిని షేర్ చేయాలనిపించి ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నా. కొంతసేపటికి అనుష్క శర్మ నుండి నాకు మెసేజ్ వచ్చింది. అది రియల్ వీడియో కాదని.. ఫేక్ అని.. ఏఐతో దానిని సృష్టించారని ఆమె తెలిపింది. ఆ నిమిషం నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. టెక్నాలజీ గురించి అవగాహన ఉన్న నేను కూడా ఏఐ వీడియోను గుర్తించలేకపోయాను. కాబట్టి టెక్నాలజీ వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని అర్థమైంది. సోషల్‌మీడియాలో వచ్చే ఏదైనా సందేశాన్ని షేర్ చేయాలంటే అది నిజమేనా? కాదా? అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.
అలాగే ఆయన తన సినిమా అనుభవాల గురించి మాట్లాడుతూ.. ‘‘మరికొన్ని గంటల్లో నా సినిమా ప్రేక్షకుల ముందుకురానుందంటే భయాందోళనకు గురవుతాను. నిజం చెప్పాలంటే నా కెరీర్‌లో రెండే క్షణాలు తెగేంత ఉత్కంఠ కలిగిస్తాయి. సినిమా షూట్‌లో మొదటి రోజు భయం వేస్తుంది. అలాగే సినిమా విడుదల మొదటి రోజు అలాంటి ఆందోళనే ఉంటుంది. రిలీజ్ రోజు ప్రజల అభిప్రాయాలు బయటకు వస్త్తాయి. ఆశించిన స్థాయిలో లేకపోతే ‘నీ గేమ్ ఓవర్’ అని అంటారేమోనని భయపడతాను. ఇలాంటి పరిశ్రమలో 25 ఏళ్లుగా కొనసాగతం సులభం కాదు. కొందరు హీరోలు 25 నెలల్లోనే అవకాశాలు కోల్పోతారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిని. నన్ను ఎంతో మంది ప్రేక్షకులు ఇప్పటికీ ఆదరిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. ఆ అభిమానమే నన్ను ఇంకా పరిశ్రమలో కొనసాగేలా చేశాయి. అది లేకపోతే నేను ఎప్పుడో కనుమరుగయ్యేవాడిని’’ అని చెప్పారు.