NTR, ANR: చరణదాసి కాపీ లాపతా లేడీస్ కు అవార్డుల పంట
ABN, Publish Date - Mar 11 , 2025 | 05:15 PM
'లాపతా లేడీస్' పేరుతో కిరణ్ రావ్ నిర్మించిన చిత్రం తెలుగు మూవీ 'చరణదాసి'కి కాపీ కాకపోతే నేటి కాలానికి అనుగుణంగా కాస్తంత మార్పులు చేర్పులు చేశారు. దీనికి ఇప్పుడు అవార్డుల పంట పండుతోంది.
ఆమిర్ ఖాన్ (Aamir Khan) మాజీ సతీమణి కిరణ్ రావ్ (Kiron Rao) దర్శకత్వంలో ఆయన భాగస్వామిగా నిర్మించిన 'లాపతా లేడీస్' (Laapataa Ladies) ఈ యేడాది 'ఐఫా' అవార్డుల్లో భలేగా సందడి చేసింది. ఈ చిత్రం ఐఫా అవార్డుల్లో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ డెబ్యూ ఆర్టిస్ట్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్ వంటి ప్రధాన విభాగాల్లో సత్తా చాటింది. ఇంతలా ఐఫా వేదికపై వెలిగిపోయిన 'లాపతా లేడీస్' చిత్రమే గతసంవత్సరం మన దేశం నుండి ఆస్కార్ ఎంట్రీగా ఎంపికైన సినిమా. ఆస్కార్ లో కనీసం నామినేషన్ సంపాదించని 'లాపతా లేడీస్' ఐఫా అవార్డుల్లో మాత్రం టాప్ అవార్డ్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా కథలో కొత్తదనం కనిపించదు. ఎందుకంటే ఈ చిత్రం 1956లో రూపొందిన తెలుగు సినిమా 'చరణదాసి'ని పోలి ఉంటుంది. పైగా 1906లో విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ రాసిన 'నౌకడుబి' నవల ఆధారంగా 'చరణదాసి' తెరకెక్కింది.
యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా రూపొందిన 'చరణదాసి'లో అంజలీదేవి, సావిత్రి నాయికలు. తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోనే యన్టీఆర్ తొలిసారి తెరపై శ్రీరామునిగా కనిపించారు. ఆయన జోడీగా సీతాదేవి పాత్రలో అంజలీదేవి తళుక్కుమన్నారు. ఈ చిత్రాన్ని నిర్మించిన ఏ.శంకర్ రెడ్డి తరువాత 1963లో యన్టీఆర్, అంజలీదేవితోనే 'లవకుశ' తీసి తరిగిపోని చెరిగిపోని చరిత్రను సొంతం చేసుకున్నారు. అలా తెలుగువారి తొలి రంగుల చిత్రంగా రూపొందిన 'లవకుశ' రూపకల్పనకు మూలంగా నిలచింది 'చరణదాసి'. దాదాపు ఏడుపదుల కాలం నాటి కథతోనే ఇప్పుడు 'లాపతా లేడీస్' సినిమా తెరకెక్కి విజయం సాధించడంతో పాటు ఐఫా అవార్డుల్లో సత్తా చాటుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: Devotional Thriller: షణ్ముఖ అందరికీ నచ్చుతుంది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
'చరణదాసి'లో యన్టీఆర్, అంజలీదేవి - ఏయన్నార్ మరో అమ్మాయిని పెళ్ళి చేసుకొని రైలులో వస్తూంటారు. ఆ ట్రెయిన్ యాక్సిడెంట్ కు గురవుతుంది. దాంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. ఏయన్నార్ పెళ్ళాడిన ఆమె కూడా మరణించి ఉంటుంది. ఆ విషయం తెలియని కొత్త పెళ్ళికూతురు అంజలీదేవిని తన వెంట తీసుకు వెడతాడు ఏయన్నార్. ఆ తరువాత ఆమె చెప్పిన వివరాలను బట్టి, ఆమె తన భార్య కాదని తేలుతుంది. అలాగే యన్టీఆర్ కూడా తన భార్య కోసం వెదుకులాడుతూ ఉంటాడు. చివరకు ఆయన చరణదాసి అతణ్ణి చేరుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. అంతకు ముందు తాను ప్రేమించిన అమ్మాయి సావిత్రినే చివరలో ఏయన్నార్ పెళ్ళాడతాడు. ఇదీ కథ. 'లాపతా లేడీస్'లోనూ కొత్తగా పెళ్ళయిన రెండు జంటల్లో ఓ వ్యక్తి ఎర్రటి ముసుగులో ఉన్న అమ్మాయే తన భార్య అని తీసుకుపోవడం, ఆమె వివరాలు తెలిశాక అసలు భర్త వద్దకు చేర్చాలని తపించడం కథగా ఉంటుంది. ఈ రెండు కథల్లోనూ రైలు ప్రయాణం, కొత్త పెళ్ళికూతుళ్ళు తప్పిపోవడం కామన్. అయితే 'చరణదాసి'లో అయినా రైలు ప్రమాదంలో తప్పి జంటలు విడిపోతాయి. కానీ, 'లాపతా లేడీస్'లో మరీ ఘోరంగా నవవధువులు ముసుగు తీయరాదు అనే నియమంతో తారు మారు కావడం విడ్డూరం! ఏది ఏమైనా రవీంద్రనాథ్ కలం నుండి జాలువారిన కథ స్ఫూర్తితోనే ఈ రెండు సినిమాలు రూపొందాయన్నది నిర్వివాదాంశం!
'చరణదాసి' తీసిన వారు నిజాయితీగా రవీంద్రుని నవల ఆధారంగా సినిమా తీశామని చాటుకున్నారు. 'లాపతా లేడీస్'లో మాత్రం బిప్లాబ్ గోస్వామి రాసిన 'టూ బ్రైడ్స్' ఒరిజినల్ కథ ఆధారమైనట్టు, దానికి స్నేహ దేశాయ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసినట్టు ప్రకటించుకున్నారు. ఈ కాలానికి చెందిన బిప్లాబ్ గోస్వామి షేక్స్ పియర్ 'కామెడీ ఆఫ్ ఎర్రర్స్' ఇన్ స్పిరేషన్ తో ఈ కథ రూపొందించినట్టు చెబుతున్నాడు. అంటే ఈయనగారు రవీంద్రనాథ్ టాగూర్ కథను కాపీ కొట్టలేదని చాటుకుంటున్నాడన్న మాట! వీరందరికంటే 460 ఏళ్ళ ముందున్న షేక్స్ పియర్ పేరు చెబుతున్నారంటే అందులోని మతలబు ఏంటో అర్థం చేసుకోవచ్చు!
Also Read: Re Release: మార్చిలో ప్రతివారం ఓ రీ-రిలీజ్!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి