Dipika Chikhlia: అదే ఇమేజ్‌ను కొనసాగించాలనుకుంటున్నా..

ABN, Publish Date - Mar 04 , 2025 | 05:48 PM

రామానంద్‌ సాగర్‌ (Ramanand Sagar) రూపొందించిన ‘రామాయణ్‌’ (Ramayan) సీరియల్‌లో సీతగా నటించి, ప్రేక్షకులను  ఆకట్టుకున్నారు అలనాటి నటి దీపికా చిఖాలియా(Dipika Chikhlia). రామాయణానికి సంబంధించి ఏ సినిమా, సీరియల్‌ వచ్చినా పాత పాత్రధారులు తప్పక గుర్తొస్తారు


రామానంద్‌ సాగర్‌ (Ramanand Sagar) రూపొందించిన ‘రామాయణ్‌’ (Ramayan) సీరియల్‌లో సీతగా నటించి, ప్రేక్షకులను  ఆకట్టుకున్నారు అలనాటి నటి దీపికా చిఖాలియా(Dipika Chikhlia). రామాయణానికి సంబంధించి ఏ సినిమా, సీరియల్‌ వచ్చినా పాత పాత్రధారులు తప్పక గుర్తొస్తారు. పోలికలు వస్తుంటాయి. త్వరలోనే బాలీవుడ్‌లో భారీ స్థాయిలో ‘రామాయణ’ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాత్ర అవకాశంపై తాజాగా దీపికా మాట్లాడుతూ తనకు ఆసక్తి లేదని చెప్పారు. అందుకు గల కారణాన్ని చెప్పుకొచ్చారు.


‘‘రామాయణ్‌’ తర్వాత అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కొన్ని సీరియల్స్‌లో కౌసల్య పాత్ర కోసం మేకర్స్‌ నన్ను సంప్రదించారు. అంగీకరించాలో, లేదో తెలియక గందరగోళానికి గురయ్యాను. అప్పుడు నా సోదరుడు ఓ మాట చెప్పారు. ‘నిన్ను అందరూ సీతగా గుర్తుంచుకున్నారు. నువ్వు సీతగానే మిగిలిపోవాలి’ అన్నాడు. ఆ మాటలు నా మనసును హత్తుకున్నాయి. ‘రామాయణ్‌’ సీరియల్‌ తర్వాత వచ్చినవి ఏవీ ఆ స్థాయిలో గుర్తింపు పొందలేదు. నేను కూడా నా ఇమేజ్‌ను అలాగే కొనసాగించాలనుకున్నా’’ అని అన్నారు.  ‘‘దేవతలకు సంబంధించిన పాత్రలు పోషించినప్పుడు ప్రేక్షకులు మనల్ని కూడా దేవతలుగా గుర్తుంచుకుంటారు. అందుకే వారి మనసుల్లో నేను ఇప్పటికీ సీతగానే నిలిచిపోయాను. అలాంటప్పుడు ఆ గుర్తింపును కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. 35 ఏళ్లుగా అవకాశాల విషయంలో జాగ్రత్తగా ఉంటున్నా. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం వస్తే మరో గుర్తింపు కోసం ఎందుకు ప్రయత్నిస్తాను?. ఇటీవల పెద్ద ఆఫర్లు తిరస్కరించాను. ఎప్పటికీ ‘రామాయణ్‌’ సీతగానే ఉంటాను. ఆ సీతగానే మిగిలిపోవాలి’’ అని చెప్పారు.

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్‌ అగ్ర నిర్మాతలతో కలిసి అల్ల్లు అరవింద్‌ ప్రతిష్ఠాత్మకంగా ‘రామాయణ’ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయిపల్లవి, కనిపించనున్నారు. రావణాసురుడిగా  యశ్‌ నటించనున్నారు. హనుమంతుడిగా సన్నీ దేవోల్‌, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు సమాచారం.

Updated Date - Mar 04 , 2025 | 05:48 PM