Bollywood: కోర్టు బోనెక్కబోతున్న బాలీవుడ్ స్టార్స్

ABN, Publish Date - Mar 10 , 2025 | 05:45 PM

పాన్ మసాలా యాడ్స్ లో నటించి, ప్రజలను తప్పుదోవ పట్టించారనే అంశంపై కోర్టు బాలీవుడ్ అగ్ర కథానాయకులను తప్పుపట్టింది. దానికి వీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

రోల్ మోడల్స్ గా ఉండాల్సిన సినీ తారలు... రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. దేశంలో యథేచ్ఛగా సాగుతున్న పాన్‌ గుట్కా మసాలా వినియోగంపై అవగాహన కల్పించాల్సింది పోయి.... అమాయక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కేవలం డబ్బుల కోసం బాధ్యతను మరిచిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పైగా కాన్సర్ కారకాలకు దూరంగా ఉండాలని చెప్పాల్సిన బడా స్టార్లు.... ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకోవడంపై ఆవేదన చెందిన జైపూర్ నివాసి యోగేంద్ర సింగ్ బడియాల్ కోర్టులో పిటిషన్‌ వేశాడు. దీంతో బాలీవుడ్​ హీరోలకు బిగ్ షాక్ తగిలింది.


పాన్​ మసాల యాడ్స్​లో నటించిన బీ టౌన్ స్టార్స్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff), అజయ్ దేవగన్​(Ajay Devgn) లకు న్యాయస్థానం లీగల్ నోటీసులు జారీ చేసింది. నిషేధిత, అనారోగ్యం కలిగించే పాన్‌ మసాలాకు మద్దతుగా ప్రచారం చేసిన ఈ ముగ్గురు హీరోలు విచారణకు హాజరు కావాలని స్పష్టమైన అదేశాలు జారీ చేసింది. లేకపోతే కఠిన చర్యలు తప్పవని కోర్టు వార్నింగ్ ఇవ్వడం బీ టౌన్ లో కలకలం రేపుతోంది. మార్చి 19వ తేదీన జరిగే కోర్టు విచారణకు హాజరు కావాలని సూచించింది.

గుట్కా లో కుంకుమపువ్వు వినియోగిస్తున్నట్లు ముగ్గురు హీరోలు అడ్వర్టైజ్‌మెంట్‌ లో చెప్పడంతో బడియాల్ కోర్టు ను ఆశ్రయించాడు. కుంకుమ పువ్వు ధర కిలో దాదాపు నాలుగు లక్షల దాకా ఉంటుందని... అలాంటిది ఐదు రూపాయాలకు లభించే మసాలా యాడ్ లో ఎలా ఇస్తున్నారని ఫిర్యాదులో ప్రశ్నించాడు. ఇలా ప్రజలను మభ్య పెట్టేలా యాడ్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొగాకు ఉత్పత్తులకు స్టార్ హీరోలు ఇలా ప్రచారం చేయడం వల్ల అమాయ ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని సూచించాడు. విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం చైర్మన్‌ గైర్సిలాల్‌ మీనా, సభ్యురాలు హేమలత అగర్వాల్‌ పాన్‌ మసాలా ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్న హీరోలకు నోటీసులు జారీ చేశారు. మరి కోర్టు నోటీసులకు హీరోలు స్పందిస్తారో లేదో చూడాలి.

Updated Date - Mar 10 , 2025 | 05:46 PM