Emergency: కంగనాపై కోర్టు కెక్కిన రచయిత్రి
ABN, Publish Date - Apr 23 , 2025 | 02:24 PM
ప్రముఖ నటి, దర్శక నిర్మాత కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' చిత్రం వివాదంలో ఇరుక్కుంది. తన పుస్తకం ఆధారంగా సినిమా తీసినట్టు ప్రకటించిన కంగనా... భారీగా మార్పులు చేర్పులు చేసిందని రచయిత్రి కూమీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
వివాదాలలో ఇరుక్కోవడం బాలీవుడ్ (Bollywood) ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) కు కొత్తేమీ కాదు. ఆమె నోటి దురుసు కారణంగానూ, కొన్ని విషయాలలో అతిగా స్పందించడం వల్లనూ పలు మార్లు ట్రోలింగ్ కూ గురైంది. ఒకానొక సమయంలో రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తన సొంతపార్టీ బీజేపీ (BJP)ని ఇరకాటంలో పడేసింది. ఇప్పుడు మండి లోక్ సభ నియోజకవర్గం ప్రజాప్రతినిధిగా ఉన్న కంగనా రనౌత్ పై సీనియర్ జర్నలిస్ట్, రచయిత్రి కూమీ కపూర్ ఫైర్ అయ్యింది. ఎంపీగా విజయం సాధించక ముందే కంగనా రనౌత్ అత్యయిక పరిస్థితి నేపథ్యంలో 'ఎమర్జెన్సీ' (Emergency) చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించింది. చాలా కాలం వివిధ కారణాలతో విడుదల కాకుండా ఆగిపోయిన ఈ సినిమా ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరిలో జనం ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుండి ఆదరణ లభించలేదు. ఇందిరాగాంధీ పాత్రకు కంగనా బాగానే సూట్ అయ్యిందని ప్రశంసలు దక్కినా... మూవీ కమర్షియల్ గా హిట్ కాలేదు. కాకపోతే... మార్చి నుండి నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఇది అందుబాటులోకి రావడంతో వీక్షకులు ఆదరించడం మొదలెట్టారు. ఇప్పుడు అదే కంగనాకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది.
ప్రముఖ రచయిత్రి, జర్నలిస్ట్ కూమీ కపూర్ (Coomi Kapoor) రాసిన 'ది ఎమర్జెన్సీ: ఏ పర్సనల్ హిస్టరీ' అనే పుస్తకం ఆధారంగా 'ఎమర్జెన్సీ' మూవీని రూపొందించింది కంగనా రనౌత్. ఈ విషయాన్ని మూవీ టైటిల్స్ కార్డ్ లో కూడా పొందుపరిచారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఈ మూవీ విడుదలైన తర్వాత కూడా దీనిపై స్పందించని రచయిత్రి కూమీ కపూర్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో 'ఎమర్జెన్సీ' సినిమాను చూసి షాక్ కు గురయ్యానని వాపోయింది. ఎంతో పరిశోధన చేసి తాను ఈ పుస్తకాన్ని రాస్తే... ఇందులోని పలు సంఘటనలను తమకు ఇష్టమైన రీతిలో కంగనా బృందం మార్చేసిందని, చాలా సన్నివేశాలను తమకు అనుగుణంగా రాసుకున్నారని తెలిపింది. సినిమా విడుదలకు ముందుకు స్క్రిప్ట్ ను చూపించాలనే నిబంధన తమ ఎగ్రిమెంట్ లో ఉందని, అలానే తన పేరు ఉపయోగించే విషయంలోనూ ఫైనల్ గా పర్మిషన్ తీసుకోవాలని ముందే చెప్పానని కూమీ కపూర్ అంటోంది. అయితే... సినిమా విడుదలకు ముందు చిత్ర బృందానికి ఫోన్ చేసినా స్పందించలేదని చెప్పింది. నెట్ ఫ్లిక్స్ లో సినిమా స్ట్రీమింగ్ అవుతుండటంతో దానిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యానని తెలిపింది. ఈ విషయమై కంగనా సోదరుడికి కాల్ చేసినా అతను స్పందించలేదని చెప్పింది. తన పేరును టైటిల్స్ కార్డ్ నుండి తొలగించమని నెట్ ఫ్లిక్స్ కు, కంగనా టీమ్ కు తెలుపుతూ రెండు సార్లు లీగల్ నోటీసులు ఇచ్చినా వారి నుండి స్పందన కరువైందని దాంతో కోర్టు తలుపు తట్టక తప్పలేదని కూమీ కపూర్ తెలిపింది. కేవలం 'ఎమర్జెన్సీ' మేకర్ గానే కాకుండా ఈ రోజు మండి నియోజకవర్గ పార్లమెంట్ మెంబర్ గానూ ఉన్న కంగనా ఈ విషయమై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: Super Star: సితారతో మహేశ్... ఆ గ్రేసే వేరు....
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి