Khushi Kapoor: అబ్బాయిల్లో ఏం నచ్చుతుందంటే...
ABN, Publish Date - Feb 02 , 2025 | 08:14 AM
అక్క జాహ్నవి కపూర్ నాకు ఒకరకంగా తల్లిలాంటిది. ఆమె నా పట్ల అనుక్షణం ప్రేమతోనే ఉంటుంది. చిన్నదాన్ని కాబట్టి నేను కాస్త అల్లరి చేసినా అదే ప్రేమను కనబరుస్తుంది. నా ఆలోచనలు, ఆనందాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది - Khushi Kapoor
అలనాటి అందాలతార శ్రీదేవి (Sridevi) పెద్ద కూతురు జాహ్నవి కపూర్ (Janhvi Kapoor) మాత్రమే కాదు.. ఇప్పుడు ఆమె రెండో కూతురు ఖుషీకపూర్ (Khushi Kapoor) కూడా హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఆమె తొలి చిత్రం ‘ది ఆర్చీస్’ (2023) విడుదల కాగా, తాజాగా ‘లవ్‌యప’ (loveYapa) విడుదలకు సిద్ధమయ్యింది. ఇది తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘లవ్ టుడే’కు రీమేక్. ఈ సందర్భంగా కపూర్ బ్యూటీ చెబుతున్న కబుర్లివి... (Chitchat with Khushi kapoor)
ప్రేమను పంచుతుంది... (Janhvi Kapoor)
అక్క జాహ్నవి కపూర్ నాకు ఒకరకంగా తల్లిలాంటిది. ఆమె నా పట్ల అనుక్షణం ప్రేమతోనే ఉంటుంది. చిన్నదాన్ని కాబట్టి నేను కాస్త అల్లరి చేసినా అదే ప్రేమను కనబరుస్తుంది. నా ఆలోచనలు, ఆనందాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. బోలెడు సలహాలిస్తుంది. మా నాన్న (బోనీ కపూర్) కూడా ఎల్లవేళలా మమ్మల్ని సురక్షితంగా, సంతోషంగా ఉండేలా చూస్తాడు. అసాధ్యాలను సుసాధ్యాలుగా ఎలా మార్చుకోవచ్చో నేను ఆయన నుంచే నేర్చుకున్నా.
సమయపాలన ముఖ్యం
సమయపాలన అనేది నా దృష్టిలో చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు మా కుటుంబంలో నేనొక్కదాన్నే సమయపాలన పాటిస్తాను. ఫలానా చోటుకు వస్తున్నానని మాట ఇస్తే కనీసం పావుగంట ముందే అక్కడ ఉండేందుకు ప్రయత్నిస్తా. ఎదుటివారి సమయాన్ని వృథా చేసే సంస్కృతి మంచిది కాదు. నా తొలి చిత్రం ‘ఆర్చీస్’ కోసం వర్క్‌షాప్ పెడితే, నేను అందరి కన్నా ముందే అక్కడ ఉండి, అందరి కోసం వేచి చూసేదాన్ని. మేకప్ ఆర్టిస్ట్ నుంచి, హెయిర్ స్టయిలిస్ట్ దాకా అందరి సమయం ముఖ్యమే. సమయపాలన పాటిస్తూ, వృత్తిని ఎవరైనా సరే గౌరవించాల్సిందే.
సోషల్ మీడియాను పట్టించుకోను
కర్రలు, రాళ్లతో దాడి చేస్తే శరీరంలోని ఎముకలు మాత్రమే విరుగుతాయి. కానీ సోషల్ మీడియాలో పలువురు పదాలతో మానసికంగా చేసే గాయాలు ఎప్పటికీ మానవు. నేను చాలా చిన్నప్పటి నుంచే ఎన్నో మాటలు వింటూ పెరిగాను కాబట్టి... ప్రస్తుతం వాటి గురించి అసలు పట్టించు కోను. నా గురించి ఎవరేమనుకున్నా... నా పని విధానాన్ని మార్చుకోను. నా గొంతు బాగుండదని కొందరు కామెంట్ చేస్తారు. దాన్ని మరింత బాగు చేసుకునేందుకు ప్రయత్నిస్తా కానీ నిరాశ మాత్రం చెందను. చర్మాన్ని మందం చేసుకుని ముందుకు సాగడమే.
ఎవరి స్టయిల్ వారిదే...
సినిమాల్లో నా దారి నాదే... అక్క దారి అక్కదే. అలాగే ఫ్యాషన్, స్టయిలింగ్ కూడా వ్యక్తిగతంగానే ఉంటుంది. కాకపోతే ఒకరి నుంచి మరొకరం స్ఫూర్తి పొందుతుంటాం. మేము తరచూ ఒకరి వార్డ్‌రోబ్ మరొకరం చూస్తుంటాం. బ్యూటీ విషయానికొస్తే నా బ్యాగులో ఎప్పుడూ లిప్‌స్టిక్, మస్కారా ఉండాల్సిందే. పగలైనా, రాత్రయినా పెదవులకు లిప్‌స్టిక్ అద్దుతూనే ఉంటా. చెంపలు మెరిసేందుకు క్రీమ్ బ్లష్ చేస్తుంటా.
కమ్యూనికేషన్ బాగుండాలి
అబ్బాయిలు రూడ్‌గా ఉంటే నాకు అస్సలు నచ్చదు. నువ్వు ఎదుటివారిని ఎలా చూస్తున్నావన్నది చాలా ముఖ్యం. అబ్బాయిల ప్రవర్తన గౌరవప్రదంగా లేకుంటే నేను వారివైపు కన్నెత్తి కూడా చూడను. దయాగుణంతో ఉండేవారే నాకు బాగా నచ్చుతారు. మరో విషయం ఏమిటంటే... కమ్యూనికేషన్ స్పష్టంగా బాగుండాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది సంబంధాలను కలుపుతుంది... బ్రేక్ కూడా చేస్తుంది. పార్ట్‌నర్‌తో సరిగా కమ్యూనికేట్ చేయగలిగితే అదే పెద్ద విజయం.