Brahmastra 2: సినిమా ఆగిపోలేదు... ఆలస్యమౌతోందంతే....

ABN, Publish Date - Mar 14 , 2025 | 04:21 PM

అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన 'బ్రహ్మాస్త్ర' అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. దాంతో దాని సీక్వెల్ వస్తుందో రాదో అనే సందేహాలు మొదలయ్యాయి. 'బహ్మాస్త్ర-2' రూపుదిద్దుకోవడంతో ఆలస్యమైంది తప్పితే... ఆ ప్రాజెక్ట్ ఆగిపోలేదని రణబీర్ కపూర్ స్పష్టం చేశారు.

రణబీర్ కపూర్ (Ranbeer Kapoor), అలియా భట్ (Alia Bhatt), అమితాబ్ బచ్చన్ (Amitabh bachchan), అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమా 'బ్రహ్మాస్త్ర' (Brahmasthra). కరణ్‌ జోహార్ నిర్మించిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. తెలుగులోనూ ఈ సినిమా డబ్ అయ్యింది. అయితే... భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. అప్పుడే 'బ్రహ్మాస్త్ర-2' కూడా ఉంటుందని మేకర్స్ చెప్పారు. కానీ తొలిభాగానికి ఆశించిన స్థాయిలో విజయం దక్కకపోవడంతో... రెండో భాగం ఉంటుందా ఉండదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఇటు ఆ చిత్ర కథానాయకుడు, దర్శకుడు ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోవడంతో ఇక 'బ్రహ్మాస్త్ర -2'ను అటకెక్కించినట్టే అనే వార్తలు బాలీవుడ్ లో బలంగా వినిపించాయి. దానిపై తాజాగా హీరో రణబీర్ కపూర్ పెదవి విప్పాడు. అందరూ అనుకుంటున్నట్టుగా 'బ్రహ్మాస్త్ర-2' సినిమా ఆగిపోలేదని స్పష్టం చేశాడు. అయితే... దర్శకుడు అయాన్ ముఖర్జీ... హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్న 'వార్ -2' సినిమాతో బిజీ ఉన్నారని, ఒక్కసారి ఆ సినిమా విడుదలై పోయిన తర్వాత 'బ్రహ్మాస్త్ర-2' పైనే ఆయన ఫోకస్ పెడతాడని అన్నారు. తమ చిత్రం ఆలస్యమౌతోంది తప్పితే ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చాడు.


అయాన్ ముఖర్జీకి పితృవియోగం

'వార్ -2' దర్శకుడు అయాన్ తండ్రి దేబ్ ముఖర్జీ (Deb Mukherjee) పలు హిందీ చిత్రాలలో నటించారు. ఆయన తండ్రి హిందీ చిత్ర నిర్మాత. చిత్రసీమతో బాల్యం నుండే అనుబంధం ఉన్న దేబ్ ముఖర్జీ 'జో జీతా వహీ సికిందర్, అధికారి, ఆన్సూ బన్ గయే ఫూల్, అభినేత్రి, దో ఆంఖే, బాతోం బాతోం మే, కమీనే, గుడ్ గుడీ' తదితర చిత్రాలలో నటించారు. 83 సంవత్సరాల దేబ్ ముఖర్జీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వృద్థాప్య సమస్యలతో ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. దేబ్ ముఖర్జీ అంత్యక్రియలు జూహూ శ్మశాన వాటికలో జరిగాయి. దేబ్ ముఖర్జీ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Also Read: Mohan Lal: ఎంపురాన్ విడుదలపై నీలినీడలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 14 , 2025 | 04:25 PM