Anuja: ఆస్కార్ నామినేషన్‌లో ఉన్న అనూజా స్టోరీ ఏంటంటే..
ABN, Publish Date - Jan 25 , 2025 | 10:17 AM
‘అనుజా’ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రేక్షకులు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
‘అనుజా’ (Anuja) షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రేక్షకులు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. సామాజిక సమస్య ఇతివృత్తంగా రూపొందించిన లఘు చిత్రమిది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka chopra) దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. .‘బెస్ట్ లైవ్ యాక్షన్’ (Best live action) కేటగిరీలో 97వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్‌లో (97 Oscar Nominations) చోటుదక్కించుకోవడంతో ఈ స్టోరీ, అందులో నటించిన చిన్నార్చు గురించి అంతా సెర్చ్ చేస్తున్నారు. ఆస్కార్‌ను దక్కించుకోవడానికి ఐదు చిత్రాలతో పోటీపడుతోన్న అనుజా.. అంతర్జాతీయ వేదికపై భారత్ ఆశలను నిలబెట్టడానికి బరిలో ఉంది. మార్చి 2న అకాడమీ అవార్డులను ప్రకటించనున్నారు.
ఇదే సజ్దా రియల్ స్టోరీ..
సినిమాలో మాదిరిగానే రియల్ లైఫ్‌లోనూ సజ్దా జీవితం కష్టాల్లబాటే. ఢిల్లీలో బాలకార్మికురాలిగా పనిచేస్తోన్న ఈ చిన్నారిని సలామ్ బాలక్ ట్రస్ట్ చేరదీసింది. 1988లో సామాజిక సమస్య ఆధారంగా తెరకెక్కిన చిత్రం సలామ్ బాంబేకు వచ్చిన ఆదాయంతో ఈ బాలక్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. దాంతోనే సజ్దా లైఫ్ టర్న్ అయింది. ఆ ట్రస్ట్ ఆమెకు చాకిరీ నుంచి విముక్తి కల్పించడమే గాకుండా ఆశ్రయం కూడా కల్పించింది. దాని సహకారంతోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ది బ్రెయిడ్ చిత్రంలో నటించగా.. అనుజా ఆమెకు రెండో సినిమా. ఈ లఘుచిత్రం నిర్మాణం వెనక ఈ ట్రస్ట్ కూడా ఉంది.
రీల్ స్టోరీ
ఢిల్లీకి చెందిన అనుజా అనే తొమ్మిదేళ్ల బాలికది నిరుపేద కుటుంబం. చదువుకొనే స్థోమత లేక తన అక్కతో కలిసి అక్కడ ఓ దుస్తుల కర్మాగారంలో పనిచేస్తుంటుంది. అయినా చదువుకోవాలన్న పట్టుదలతో ఉంటుంది. ఈ క్రమంలోనే పాఠశాల చదువుకు సంబంధించిన పలు ప్రశ్నలు తన సోదరిని అడుగుతుంది. ఈ విషయాలు తెలుసుకున్నాక స్కూలుకి వెళ్లాలన్న ఆసక్తి మరింత పెరుగుతుంది. అయితే తన కుటుంబ స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంగాక ఆలోచనలో పడుతుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా అనుజాకు చదువుకునే అవకాశం వస్తుంది. తదనంతర పరిస్థితులు, అక్కచెల్లెళ్ల మధ్య సరదాగా సాగే సన్నివేశాలను ఆసక్తిగా మలుస్తూ ఈ షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించారు దర్శకుడు ఆడమ్ జె గ్రేవ్స్(Adam J Graves). ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి ఎంతోమంది బాలికల సమస్యల్ని, బాలకార్మిక వ్యవస్థను కళ్లకు కట్టినట్లు చెబుతుందీ సినిమా. గునీత్ మోంగా(Guneet Monga), మిండీ కాలింగ్, సుచిత్రా మిత్తల్ నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో భాగమైనందుకు ప్రియాంక సంతోషం వ్యక్తం చేశారు.