Saif Ali Khan: సైఫ్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు.. ఆ రివార్డు ఏమిటంటే..
ABN, Publish Date - Jan 20 , 2025 | 10:11 PM
సైఫ్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు రివార్డు లభించింది. అర్ధరాత్రి తీవ్ర గాయాలతో ఉన్న సైఫ్‌ని సకాలంలో హాస్పిటల్‌కి తీసుకెళ్లి.. ఆటో ఛార్జి కూడా తీసుకోని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను రివార్డుతో సత్కరించిందో సంస్థ. ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదని ఆ ఆటో డ్రైవర్ అన్న మాటలు ఎంతో గొప్పవని సదరు సంస్థ.. డ్రైవర్‌ని రివార్డుతో గౌరవించినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ రివార్డు ఏమిటంటే..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల ఓ అగంతకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో సైఫ్ అలీఖాన్ చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే దాడికి పాల్పడ్డ ప్రధాన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. త్వరలోనే అన్ని విషయాలు బయటికి వస్తాయి. అయితే అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడటం, గాయపడిన సైఫ్‌ని కారులో హాస్పిటల్‌గా తీసుకెళ్లాలని చూడగా.. కారు స్టార్ట్ కాకపోవడంతో వెంటనే ఆటో మాట్లాడుకుని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆ సమయంలో సైఫ్‌ని సకాలంలో హాస్పిటల్‌కి తరలించిన డ్రైవర్ భజన్ సింగ్ ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తన ఆటో ఎక్కింది సైఫ్ అని తెలిసి సదరు ఆటో డ్రైవర్ ఎటువంటి ఛార్జీ తీసుకోకుండా సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇలా కష్టకాలంలో ఎంతో సహకరించిన ఆటో డ్రైవర్‌కు ఇప్పుడొక సంస్థ రివార్డు అందించింది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం
సైఫ్ అలీఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ పేరు భజన్ సింగ్ రానా. కొన్నాళ్లుగా ముంబైలో ఆటో నడుపుతున్న భజన్ ఉత్తరాఖండ్ నివాసి. సైఫ్ ఘటనతో భజన్ సింగ్ రానా బాగా వైరల్ అయింది. అతని సహకారం ఒక ప్రాణాన్ని నిలబెట్టడంతో.. సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సంస్థ భజన్ సింగ్‌కు శాలువా కప్పి, రూ.11 వేల నగదు బహుమతి అందించి సత్కరించింది. ముంబై పోలీసులు డ్రైవర్‌ను విచారణ కోసం పిలిచి ఈ విషయంపై పూర్తి సమాచారం తీసుకున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి.
దాడి జరిగిన రోజు రాత్రి భజన్ సింగ్ రానా ఏం చేశాడో అతని మాటల్లోనే.. ‘‘నేను రాత్రిపూట ఆటో నడుపుతాను. సైఫ్‌పై దాడి జరగగానే ఓ మహిళ బిగ్గరగా అరిచి నా ఆటోను ఆపింది. ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ ధరించిన తెల్లటి కుర్తా పూర్తిగా రక్తంతో తడిసి ఉంది. అతడు సైఫ్ అలీఖాన్ అని నేను అనుకోలేదు. సైఫ్‌తో పాటు అతడి ఇద్దరు కుమారులు తైమూర్, జేహ్ కూడా ఆటో ఎక్కారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత సైఫ్ వెంటనే సిబ్బందికి కాల్ చేయండి. నేను సైఫ్ అలీ ఖాన్ అని చెప్పడంతో.. నేను ఎక్కించుకొచ్చింది నటుడు సైఫ్ అలీఖాన్‌ని అని అప్పుడే తెలిసింది. తర్వాత సైఫ్ ఆటో దిగి ఆస్పత్రి లోపలికి వెళ్లారు. వారి నుంచి ఛార్జీలు కూడా తీసుకోలేదు. ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదని నా అభిప్రాయం’’ అని భజన్ సింగ్ తెలిపారు. ఆయన ఈ ఘటనపై స్పందించిన విధానం అందరినీ ఎంతగానో కదిలించింది. అందుకే, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లని కాపాడుకోవాలనేలా సదరు సంస్థ రివార్డుతో సత్కరించింది.