Yearender 2024: అందరి దృష్టిని ఆకర్షించిన ఐదుగురు భామలు వీరే..

ABN, Publish Date - Dec 29 , 2024 | 08:35 AM

2024 సంవత్సరం ఇంకొన్ని గంటలలో ముగియబోతోంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే 2024లో కొన్ని మెమరీస్ గురించి చెప్పుకునే టైమ్ ఇది. ఈ క్రమంలో 2024లో అందరి దృష్టిని ఆకర్షించిన టాప్ 5 భామలు విషయానికి వస్తే..

Tripti Dimri and Samantha

తారాలోకంలో ఎందరు తారలున్నా కొందరికే కాలం కలిసొస్తుంది. ఈ ఏడాది చాలామందికి విజయాలు దక్కవచ్చు... కానీ వార్తల్లో నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకున్నవారు కొందరే. వారిలో రష్మిక మందన్నా, త్రిప్తి డిమ్రీ, సమంత, నయనతార, అలియాభట్‌ ముందు వరుసలో ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

నిలిచి గెలిచింది...

సిల్వర్‌ స్ర్కీన్‌ మీద స్పీడు తగ్గించినా, డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో సత్తా చాటుకుంది సమంత. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన స్పై యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ బన్నీ’తో మెరిసింది. ప్రపంచంలోనే అత్యధికమంది చూసిన వెబ్‌ సిరీస్‌గా సిటాడెల్‌ రికార్డు సాధించింది. ఈ సిరీస్‌ ఏకంగా 200 దేశాల్లో స్ట్రీమింగ్‌ అయితే, 150 దేశాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రమోషన్స్‌లో సామ్‌ తన మాజీ భర్తపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు, విడాకుల సమయంలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌ గురించి ధైర్యంగా మాట్లాడింది. అలాగే ఈ ఏడాది ‘ఐఫా’ అవార్డుల వేడుకలో సామ్‌ను ప్రతిష్ఠాత్మక ‘వుమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు’తో సత్కరించారు.


ప్రభావశీలి

జాతీయ ఉత్తమనటి అలియా భట్‌.. ప్రసిద్ధ ‘టైమ్స్‌’ మ్యాగజైన్‌ 2024లో ‘ప్రపంచ అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల’ జాబితాలో చోటు దక్కించుకుంది. వెండితెరపై నటనతో పాటు దాతృత్వ కార్యక్రమాలకు చేసిన కృషికిగాను అలియాకు ఈ గౌరవం దక్కింది. ప్రఖ్యాత ఫ్యాషన్‌ వేదిక ‘మెట్‌ గాలా’లో ఫ్లోరల్‌ శారీలో ఎర్రతివాచీపై నడిచి సోషల్‌ మీడియాతో పాటు ప్రపంచదృష్టిని ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలో భారతీయత ఉట్టిపడేలా చీర కట్టుతో కనువిందు చేసింది. ఈ చీరను రూపొందించడానికి 163 మంది చేయి తిరిగిన కళాకారులు, 1,965 గంటలపాటు పని చేయడం విశేషం. ఈ ఏడాది ‘మెట్‌ గాలా’ థీమ్‌ ‘గార్డెన్‌ ఆఫ్‌ టైమ్‌’కు అనుగుణంగా అలియా తన చీర కొంగుపై ప్రత్యేకంగా పూలు, చెట్ల కొమ్మలను డిజైన్‌ చేయించింది.


‘సామి’రంగా...

‘పుష్ప’, ‘యానిమల్‌’ సినిమాలతో గ్లోబల్‌ ఫేవరెట్‌గా మారింది రష్మిక మందన్న. ఈ ఏడాది ‘ఫోర్బ్స్‌’ మ్యాగజైన్‌ ప్రకటించిన ‘ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30’ జాబితాలో స్థానం సంపాదించింది. అంతేకాదు... ఇన్‌స్టాగ్రామ్‌లో 40 మిలియన్‌ ఫాలోవర్స్‌ మైలురాయిని దాటిన మొదటి దక్షిణాది హీరోయిన్‌ కూడా ఆమే. ఈ ఏడాది టోక్యోలో జరిగిన ‘క్రంచీ రోల్‌ అనిమే’ అవార్డుల వేడుకకు భారత్‌ తరపున హాజరైంది. ఈ గౌరవం దక్కిన ఏకైక నటి రష్మిక. ఇటలీలోని మిలాన్‌లో జరిగిన ఫ్యాషన్‌ వీక్‌లోనూ ర్యాంప్‌పై నడిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందీ నేషనల్‌ క్రష్‌.


అందరి కళ్లు ఆమెపైనే

‘యానిమల్‌’తో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది త్రిప్తి డిమ్రీ. ఈమె ఈ ఏడాది వరుసగా... ‘బ్యాడ్‌న్యూజ్‌’, ‘భూల్‌ భులయ్యా’, ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ సినిమాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘బ్యాడ్‌ న్యూజ్‌’లోని ‘తౌబా తౌబా’ మోస్ట్‌ ట్రెండింగ్‌ సాంగ్‌గా నిలిచింది. దీంతో 2024లో మోస్ట్‌ సెర్చింగ్‌ హీరోయిన్‌ అయ్యింది. ‘ఐఎండీబీ’ విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ నటీనటుల జాబితాలో టాప్‌ వన్‌లో నిలిచి సత్తా చాటింది త్రిప్తి. ఈ లిస్టులో రెండో స్థానంలో దీపికా పదుకొణె నిలవగా, నాలుగో స్థానంలో షారుక్‌ ఖాన్‌, ఎనిమిదో స్థానంలో సమంత, పదో స్థానంలో ప్రభాస్‌ ఉన్నారు.


డాక్యుమెంటరీ సూపర్‌స్టార్‌

దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ఈ ఏడాది వార్తల్లో వ్యక్తిగా మారింది. ఆమె జీవితం ఆధారంగా ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. ఈ సందర్భంగా నయనతార, కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ మధ్య వార్‌ ఓ రేంజ్‌లో నడిచింది. డాక్యుమెంటరీలో ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్‌ను ఉపయోగించడంతో.. తాను నిర్మించిన సినిమాలోని క్లిప్‌ను అనుమతి లేకుండా వినిమోగించారంటూ రూ. 10 కోట్లు దావా వేశాడు ధనుష్‌. దాంతో నయన్‌ బహిరంగ లేఖ రాయడంతో వీరిరువురి మధ్య వివాదం మరింత ముదిరింది. కాగా గంట ఇరవై రెండు నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీలో తన బాల్యం, సినీ కెరీర్‌, తొలినాళ్లలో తనపై వచ్చిన విమర్శలు, వాటన్నింటిని దాటుకొని లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదగడం, విఘ్నేష్‌తో ప్రేమాయణం, వివాహ జీవితం గురించి చూపించారు. ఇదేగాక ‘అన్నపూరణి’ చిత్రంలో నటనకు గానూ సైమా 2024 ఉత్తమ నటిగా నిలిచింది నయన్‌.

Updated Date - Dec 29 , 2024 | 09:46 AM