Yearender 2024: టాలీవుడ్‌కి 2024లో వచ్చిన భారీ హిట్లు ఇవే..
ABN, Publish Date - Dec 29 , 2024 | 01:32 PM
ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే.. టాలీవుడ్‌కు 2024 బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ‘కల్కి 2898 AD’, ‘పుష్ప 2’ సినిమాలు టాలీవుడ్ స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటాయి. మొత్తంగా చూస్తే.. ఈ సంవత్సరం టాలీవుడ్ బిగ్ హిట్స్ ఏవంటే..
2024 సంవత్సరం టాలీవుడ్‌లో కనకవర్షాన్ని కురిపించింది. చిన్న సినిమాలు కూడా రూ.100 కోట్లు కొల్లగొట్టి టాలీవుడ్ సత్తా చాటాయి. ఇక పెద్ద సినిమాలు అయితే.. మన టార్గెట్ రూ. 2000 కోట్లు అన్నట్లుగా ఇండియన్ బాక్సాఫీస్‌ని ఆశ్చర్యపరిచాయి. సంక్రాంతి హిట్లతో జోరుగా మొదలైన ఈ ప్రయాణం మధ్య కాస్త నిరాశ పరిచినా.. ఇయర్ ఎండింగ్‌కు వచ్చే సరికి మళ్లీ అదే ఊపును కనబరిచింది. ఈ క్రమంలో టాలీవుడ్‌కి 2024లో వచ్చిన భారీ హిట్ సినిమాలను ఒక్కసారి పరిశీలిస్తే..
మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, నాగార్జున ‘నా సామిరంగ’ చిత్రాలతో ఈ ఏడాది సంక్రాంతి విజయాలను అందుకున్నారు. ఇక చిన్నసినిమాగా బరిలోకి దిగిన ‘హను-మాన్’ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని నమోదు చేసింది. రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ. 300 కోట్లకు పైబడి వసూళ్లను సాధించి అబ్బురపరిచింది. ‘టిల్లూ స్క్వేర్’ చిత్రంతో యువహీరో సిద్ధు జొన్నలగడ్డ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మార్చిలో విడుదలైన ఈ చిత్రం రూ. 130 కోట్ల వసూళ్లతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’ యూనిట్‌కు రామ్ చరణ్ ఫ్యాన్ వార్నింగ్
ఇక ద్వితీయార్థంలో ప్రభాస్ తన పవర్ చూపించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడి’ చిత్రం రూ. వెయ్యి కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా శివ కొరటాల దర్శకత్వం వహించిన ‘దేవర 1’ సినిమా టాలీవుడ్‌తో పాటు హిందీ బెల్ట్‌లోనూ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమాతో నాని మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
కిరణ్ అబ్బవరం ఎదురుచూపులు ఫలించి, ఆయన హీరోగా నటించిన ‘క’ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. గ్రామీణ నేపథ్యంలో మర్డర్ మిస్టరీ కథతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. బ్యాంకింగ్ రంగంలో మోసాలు, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రూ. వందకోట్ల వసూళ్లను అధిగమించింది. జాతీయ స్థాయిలో ‘పుష్ప 2’ ప్రభంజనం కొనసాగుతోంది. దాదాపు 12 వేలకు పైబడి స్ర్కీన్లలో విడుదలైన ఈ చిత్రం ఉత్తరాది బెల్ట్‌లో వీరవిహారం చేస్తోంది. రూ. 2 వేల కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది.