Year Ender 2024: 2024 బిగ్గెస్ట్ డిజాస్టర్స్..
ABN, Publish Date - Dec 19 , 2024 | 05:26 PM
Rewind 2024: 2024 సంవత్సరంలో 'కల్కి', 'పుష్ప 2' టాలీవుడ్‌కి బిగ్ బూస్ట్‌ని ఇస్తే.. చాలా సినిమాలు మాత్రం నిరాశ పరిచాయి. ముఖ్యంగా అగ్ర హీరోలతో పాటు యంగ్ సెన్సేషనల్ హీరోల సినిమాలు కూడా ఎన్నో అంచనాల మధ్య రిలీజై బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే..
ఆలస్యం చేయకుండా ఆ సినిమాలేంటో చూసేద్దాం
సైంధవ్
సీనియర్ నటుడు వెంకటేష్ తన 75వ సినిమాగా 'సైంధవ్' సినిమాతో సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శైలేష్ కొలను దీనికి దర్శకుడు, వెంకట్ బోయినపల్లి నిర్మాత. ఈ పండగ లిస్ట్‌లో ఉన్న నాలుగు సినిమాలలో ఇది మూడో సినిమా. ఇందులో చాలామంది ఇతర భాషా నటులు వున్నారు. హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తెలుగులో ఈ సినిమాతో అరంగేట్రం చేశారు. సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చారు. సంక్రాంతి అంటే వెంకటేష్ కి ఎంతో స్పెషల్. ఆయన సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి విజేతగానే నిలిచారు. కానీ.. ఈ సారి గురితప్పి అవుట్ ఆఫ్ ది స్టేడియం వెళ్ళిపోయింది. భారతదేశం మొత్తం గర్వించే నవాజుద్దీన్ సిద్దిఖీ నటనే చిరాకు తెప్పించిందంటే.. మేకింగ్ లో ఎంత పెద్ద లోపాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక ఇతర నటీనటుల విషయానికి వస్తే వెంకటేష్ తన పాత్రకి తగిన న్యాయం చేశారు. ఎక్కువ పోరాట సన్నివేశాలే కాబట్టి, అలా నరుక్కుంటూ, పొడుచుకుంటూ అతని పాత్ర చివరి వరకు వెళుతూ ఉంటుంది. శ్రద్ధ శ్రీనాథ్ బాగుంది, పరవాలేదు. ఆండ్రియా విలన్ గా చేసింది, ఎప్పుడూ బబుల్ గమ్ నములుతూ ఉంటుంది. తమిళ నటుడు ఆర్యని ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. రుహాని శర్మ పాత్ర పరిమితం. ముఖేష్ రుషి, జిషుషేన్ గుప్త, జయప్రకాశ్ అందరివీ మామూలు పాత్రలే.
చివరగా, 'సైంధవ్' ఒక అర్థం పర్థంలేని యాక్షన్ సినిమా, పండగనాడు చూసే సినిమా కాదు, ముఖ్యంగా కుటుంబంతో, పిల్లలు చూడాల్సిన సినిమా కూడా కాదు. వెంకటేష్ 75వ సినిమా ఒక గుర్తిండిపోయే సినిమాగా ఉంటుందని అనుకుంటారు, కానీ ఈ సినిమాతో నిరాశ పరిచారు అనే చెప్పాలి. ఎందుకంటే వెంకటేష్ కు మహిళా అభిమానులు, కుటుంబంతో చూసే అభిమానులు ఎక్కువ, అందుకని అతని నుండి పండగనాడు అలాంటి సినిమా కోసం ఎదురుచూస్తారు, కానీ ఇలా ఈ 'సైంధవ్' తో తీవ్రంగా నిరాశ పరిచారు.
ఈగల్, మిస్టర్ బచ్చన్
ఇక మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది కూడా తన డిజాస్టర్ స్ట్రీక్ ని కొనసాగించారు. ఫిబ్రవరిలో రిలీజైన ఈగల్ తీవ్రంగా నిరాశపరిచింది. ప్రశాంత్ నీల్ ఎఫెక్ట్ ఏమో కానీ ఇప్పుడొస్తున్న యువ దర్శకులు అందరూ తమ సినిమాలని 'కేజీఎఫ్' సినిమాలా తీయాలని అనుకుంటూ భారీ బడ్జెట్ పెట్టి.. పెద్ద పెద్ద గన్స్, విచిత్రమైన మారణాయుధాలు చూపించి, నేపధ్యం కొండలు, మాఫియా పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమాలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తీసిన ఈ 'ఈగల్' కూడా అదే కోవలోకి వస్తుంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కేవలం ఒక్కో సన్నివేశం బాగా రావాలని దృష్టి పెట్టి చేసినట్టుగా ఈ 'ఈగల్' సినిమా కనిపిస్తుంది. కథమీద దృష్టి పెట్టి, కథని ఫ్లాష్ బ్యాక్ లతో కాకుండా, నేరుగా వెండితెర పైన అర్థం అయేటట్టు చూపిస్తే బాగుందేమో అనిపిస్తుంది. భారీ బడ్జెట్ పెట్టి తీసిన ఒక యాక్షన్ సినిమాని, దర్శకుడు సరైన విధంగా చూపించడంలో పూర్తిగా విఫలం అయ్యాడు అనిపిస్తుంది.
మిస్టర్ బచ్చన్
ఈగల్ నిరాశపరిస్తే, మిస్టర్ బచ్చన్ నీరసపరిచింది. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా బెటర్. ఒక సినిమాని ఎలా రీమేక్ చేయకూడదో ఈ సినిమాని చూసి నేర్చుకోవచ్చు. రీమేక్ చేసే క్రమంలో, మంచి ఫేస్ వేల్యూ ఉన్న నటులని పెట్టుకుని క్రింజ్ కామెడీ సీన్లతో హిట్ కొట్టేయొచ్చు అనే ఓవర్ కాంఫిడెన్సుతో తీసిన సినిమాలా ఉంది. సింపుల్ కథని ఆకట్టుకునే కథనం లేకపోతే జనాలు తీసి అవతల పడేస్తారు. ఈ సినిమాకి అదే జరిగింది.
ఇప్పటికే వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న రామ్ పొతినేనికి ఈ ఏడాది భారీ షాక్ తగింది. పూరీ జగన్నాథ్ తో కలిసి చేసిన డబుల్ ఇస్మార్ట్ డబుల్ షాక్ ఇచ్చింది..
మెగా హీరో వరుణ్ తేజ్ పరిస్థితి మరి దారుణం. ఈ ఏడాది ఆపరేషన్ వాలెంటైన్, మట్కా రెండు సినిమాలతో పలకరించినప్పటికి... సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయాడు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో ఢీలా పడిపోయాడు.
మిగిలిన యంగ్ హీరోల పరిస్థితి కూడా అలాగే తయారైంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ కలెక్షన్ల వర్షం కురిపించలేకపోయింది.
శర్వానంద్ నటించిన మనమే కూడా డిజాస్టర్ గా మిగిలింది. అశ్విన్ బాబు శివంభజే, అల్లు శిరీష్ బడ్డీ, రాజ్ తరుణ్ తిరగబడరా సామీ పాటు కొన్ని చిన్న సినిమాలు రిలీజైన థియేటర్లలో మాత్రం సందడి చేయలేకపోయాయి. అలా ఏడాది అయినా హిట్ కొడతారని సక్సెస్ ట్రాక్ ఎక్కుతారని భావిస్తే.. వారికి మళ్లీ షాక్ తగిలింది.. మరి కొత్త సంవత్సరం అయినా వీరి ఆశలు తీరుతాయోమో చూడాలి.