Radisson Hotel Drugs Case: టాలీవుడ్ నటులతో వున్న ఫోటోలు వైరల్
ABN, Publish Date - Feb 26 , 2024 | 05:06 PM
నగరంలో ఇప్పుడు రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు ముగ్గురు ప్రముఖ వ్యాపారవేత్తల మీద కేసులు ఫైల్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వ్యాపారవేత్తలతో టాలీవుడ్ నటులు వున్న పాత ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు బయటకి వస్తున్నాయి. బీజేపీ నాయకుని కుమారుడు వివేకానంద, ప్రముఖ వ్యాపారవేత్త కేదార్నాథ్, ఇంకొక వ్యక్తి నిర్భయ్ ఈ ముగ్గురిమీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే పట్టుబడిన వ్యక్తులతో కొంతమంది టాలీవుడ్ నటులు సన్నిహిత సంబంధాలు కలిగి వున్నారని, ఇప్పుడు ఆ వ్యక్తులతో ఈ నటులు వున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉండటం ఆసక్తికరం.
డ్రగ్స్ కేసులు ఎప్పుడు బయటకి వచ్చినా, టాలీవుడ్ నటుల పేర్లు కూడా బయటకి రావటం ఆసక్తికరం. 2017లో ఒక స్పెషల్ పోలీసు అధికారి కొంతమంది తెలుగు నటీనటుల్ని విచారించిన సంగతి తెలిసిందే. అప్పట్లో చాలామంది తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన వారి పేర్లు బయటకి వచ్చినా, ఎవరిమీద చర్య మాత్రం తీసుకోలేదు. అప్పట్లో ఆ పోలీసు అధికారి టాలీవుడ్ పరిశ్రమకి చెందిన నటీనటులను విచారించినప్పుడు అది పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఇప్పుడు బీజేపీ నాయకుడి కుమారుడు వివేకానంద పేరు ప్రముఖంగా వినపడుతోంది. అయితే ఇతనికి చాలామంది టాలీవుడ్ నటీనటులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అతను ఇచ్చే పార్టీలకి పరిశ్రమనుండి కొంతమంది వెళుతూ ఉండేవారని కూడా తెలిసింది. అయితే ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు బయటపడతంతో వివేకనంద, వ్యాపారవేత్త కేదార్నాథ్ పాత ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉండటం ఆసక్తికరం. రాడిసన్ డ్రగ్స్ కేసులో బయటపడ్డ ప్రాధమిక ఆధారాలతో చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తులతో ఎటువంటి సంబంధం లేదని పోలీసులు చెప్పారు.
ఇప్పుడు దొరికిన వ్యాపారవేత్త కేదార్నాథ్ నగరంలో వున్న హై లైఫ్, జూబ్లీ 800 పబ్ లకు యజమానిగా వ్యవహరిస్తున్నారు, అలాగే ఈ రెండింటితోపాటు బఫెలో వైల్డ్ వింగ్స్ అనే పబ్ లో కూడా అతను ఒక బిజినెస్ పార్టనర్ అని తెలిసింది. ఇక బీజేపీ నాయకుడు కుమారుడు అయిన వివేకాననంద రాడిసన్ హోటల్ డైరెక్టర్ అని తెలిసింది.