Mohan Babu: అన్నదమ్ముళ్లులా కలిసి బ్రతకాలని కోరుకుంటే.. మోహన్ బాబు ట్వీట్ వైరల్
ABN, Publish Date - Dec 09 , 2024 | 07:23 PM
ప్రస్తుతం మంచు ఫ్యామిలీ ఎలా వార్తలలో నిలుస్తుందో తెలిసిందే. రెండు రోజులుగా వారి ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తన తండ్రి మోహన్ బాబు తనపై దాడి చేయించాడని మంచు మనోజ్ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు చేసిన ఓ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌లో ఏముందంటే..
ఒకవైపు మంచు మోహన్ బాబు ఇంటిలో మంటలు అంటూ మీడియాలో ఒకటే వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబు చిన్న కుమారుడైన మంచు మనోజ్ తనపై తన తండ్రి దాడి చేయించారని పబ్లిగ్గా మీడియాకు చెబుతున్నారు. తనను కొట్టినట్లుగా డాక్టర్ రిపోర్ట్ కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పరువుపోయేలా మంచు మనోజ్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నా.. మోహన్ బాబు మాత్రం ఇంత వరకు ఎక్కడా రియాక్ట్ కాలేదు. పైగా తనకేం పట్టనట్లుగా తను నటించిన సినిమాలలోని కొన్ని వీడియోలను షేర్ చేసి.. ఆ సినిమా తన కెరీర్‌కి ఎలా ప్లస్ అయిందో చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Also Read- Manchu Family Controversy: మంచు మోహన్ బాబు నివాసం వద్ద ఏం జరుగుతోంది..
అయితే, ఈ ట్వీట్స్ ద్వారా మోహన్ బాబు ఏదో చెప్పదలచుకున్నట్లుగా అయితే అర్థమవుతోంది. ఆదివారం ఆయన నటించిన ‘కోరికలే గుర్రాలైతే’ అనే సినిమాలోని వీడియో షేర్ చేసిన మోహన్ బాబు, అందులో యమధర్మరాజు పాత్రలో చెబుతున్న డైలాగ్స్ వీడియోను షేర్ చేశారు. ఇక తాజాగా ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం మంచు ఫ్యామిలీ విషయంలో వినిపిస్తున్న వివాదానికి చాలా దగ్గరగా ఉంది. ఆయన డైరెక్ట్‌గా ఏం చెప్పలేక ఇలా వీడియోలను షేర్ చేసి తన బాధను వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది. తాజాగా ఆయన ‘శ్రీరాములయ్య’ అనే సినిమాలోని ఓ సన్నివేశాన్ని ట్విట్టర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ఇందులో తను పెంచి పోషించిన శ్రీహరి పాత్ర.. తనని కాల్చి చంపుతుంది. శ్రీహరి అలా చేసేటప్పుడు మోహన్ బాబు భార్యగా నటించిన సౌందర్య ఈ చేతులతో నీకు అన్నం పెట్టాను.. ఇప్పుడు నీకు దండం పెడుతున్నాను అని చెబుతుంది. ఆ తర్వాత మోహన్ బాబు.. ‘అందరూ అన్నదమ్ముళ్లుగా కలిసి బతకాలని కోరుకున్న రాములయ్యని రా? నువ్వు చంపుతుంది’ అంటూ ప్రస్తుత మంచు ఫ్యామిలీ సిచ్యుయేషన్‌కి దగ్గట్టుగా, మంచు మనోజ్‌ని టార్గెట్ చేస్తూ చెబుతున్నట్టుగా ఉన్న డైలాగ్ వీడియోను షేర్ చేశారు. ఇంకా ఈ సినిమా నేపథ్యాన్ని తన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు మోహన్ బాబు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలు పెట్టే బదులు.. ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాన్ని బయటకు రాకుండా పరిష్కరించుకోవచ్చుగా అంటూ కొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.