ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని వాళ్ళు.. మీకేం హెల్ప్ చేస్తారు: ఏపీ ఎన్నికలపై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Mar 20 , 2024 | 04:18 PM
మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న మంచు మనోజ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఆయన ఇచ్చిన సందేశపు వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సీనియర్ నటుడు, విలక్షణ నటుడు అయిన మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు నిన్న ఘనంగా తిరుపతిలోని మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ లో జరిగాయి. ఈ సందర్భంగా మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. ఈ వేడుకకి మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆ వీడియో కూడా వైరల్ అయింది.
ఇంతకీ మనోజ్ పలానా వ్యక్తికి ఓటు వెయ్యండి, వేయొద్దు అని చెప్పకుండా, రాజకీయాలపై తనదైన రీతిలో మాట్లాడారు మనోజ్. ఎన్నికలలో పది మందిని కలుపుకుని వెళ్లే నాయకుడిని వెతుక్కోండి, అలాగే అవగాహనతో కరెక్ట్ లీడర్ ను ఎన్నుకోండి అని చెప్పారు మనోజ్. కొందరు నాయకులు వాళ్ల కుటుంబంకి గానీ, చుట్టుపక్కల వాళ్ళకి గానీ సహాయం చేయలేని వాళ్లు ఇంకా ప్రజలకు ఏమి సహాయం చేస్తారు. ఓటు వేసేటప్పుడు ఈ అంశాలను గుర్తు పెట్టుకుని ఏ నాయకుడుకి ఓటేస్తే, పేదలకు న్యాయం జరుగుతుందో వారికి ఓటు వేయండి అంటూ అయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం మీకు నచ్చిన వాళ్లకు మాత్రమే వెయ్యండి అని అన్నారు. ఈ మాటలు అన్న మనోజ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
అందరూ కలిసి ఉంటేనే దేశం బలంగా ఉంటుందని, అయితే ఈ మధ్య మనుషుల మధ్య ప్రేమ కనిపించడం లేదని దూరం పెరుగుతోంది అని చెప్పారు. మనుషులను ఎప్పుడూ విభజించి పాలించకూడదు అంటూ, ఒంటరిగా కూడా విజయం సాధించవచ్చు, కానీ ఆలా విజయం సాధించే క్రమంలో మీకు అండగా ఉన్న వారిని మాత్రం మర్చిపోకండి అంటూ తెలిపారు మనోజ్. మనకి కొత్త పరిచయాలు వచ్చాయని పాత పరిచయాలను వదిలేస్తే, మనకి మృగాలకి తేడాలేదు అనే అర్థం వచ్చేట్టు చెపుతూ, అందుకే గతాన్ని మర్చిపోకూడదు, అలాగే పాత స్నేహాన్ని ఎప్పటికి మర్చిపోకూడదు అని చెప్పారు మనోజ్.
అందరిని కలుపుకుని వెళ్లే వాడే అసలైన నాయకుడని, ఎటువంటి మనిషకైనా ఈర్ష్య, ద్వేషాలు, స్వార్థం అనేవి వస్తే అవి అతని పతనానికి దారితీస్తాయని, అంతా నాది అనుకునేవాడికి, 'పీస్ ఆఫ్ మైండ్' ఇక ఉండదు అని చెప్పారు. ఓటును డబ్బుకు అమ్ముకోకండి, కాకపోతే, అతను మంచి నాయకుడా, కాదా పరిశీలించి ఓటు వెయ్యండి అని తన మనసులో మాటలను పంచుకున్నారు మనోజ్.
ఆళ్లగడ్డ నుండి తెలుగు దేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమా అఖిలప్రియ చెల్లెలు, భూమా మౌనిక మంచు మనోజ్ భార్య. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవటం ఆసక్తికరం.