Tamannaah Bhatia: 7వ తరగతి పుస్తకాల్లో తమన్నాపై పాఠం.. తల్లిదండ్రులు ఆగ్రహం
ABN, Publish Date - Jun 28 , 2024 | 12:03 PM
తమన్నా భాటియా మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఇటీవల మితిమీరిన అందాల ప్రదర్శణలతో ట్రోలింగ్‌కు గురవుతున్న ఈ ముద్దుగుమ్మ ఈ సారి తన ప్రమేయం లేకుండానే ఓ తీవ్ర వివాదానికి కేంద్ర బిందువు అయింది.
కథానాయిక తమన్నా భాటియా (Tamannaah Bhatia) మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఇటీవల మితిమీరిన అందాల ప్రదర్శణలతో వార్తల్లోకెక్కి బాగా ట్రోలింగ్‌కు గురవుతున్న ఈ ముద్దుగుమ్మ ఈ సారి తన ప్రమేయం లేకుండానే ఈ మారు దేశ వ్యాప్తంగా ఓ తీవ్ర వివాదానికి కేంద్ర బిందువు అయింది. ఇందుకు ప్రధాన కారణం ఓ పాఠశాల పుస్తకంలో తమన్నా మీద ప్రత్యేక పాఠ్యాంశం ఉండడమే.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు (Bengaluru) సమీపంలోని హెబ్బల్ (Hebbal)లోని సింధీ హైస్కూల్ (Sindhi High School)లో 7వ తరగతి పాఠ్యాంశాల్లో సినిమా నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia) జీవిత విశేషాలతో ఓ ప్రత్యేక పాఠాన్ని పొందు పరిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సదరు విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక బాలల హక్కుల రక్షణ సంఘంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు ఈ వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమన్నా పాఠ్యాంశం విషయంలో పాఠశాల యాజమాన్యాన్ని కలిసి మాట్లాడామని వారు సహేతుకమైన జవాబు ఇవ్వడం లేదని అన్నారు.
సినిమాల్లో అర్థనగ్నంగా నటించే తారలు పిల్లలకు ఎలా ఆదర్శవంతులవుతారని, వారిని చూసి విద్యార్థులు నేర్చుకునేది ఏమంటుందని పేరెంట్స్ మండిపడ్డారు. ఒకవేళ చెప్పాలనుకుంటే సింధీకి సంబంధించి చాలా మంది గౌరవంగా ఉండే కళాకారులు, ఉన్నత స్థానాల్లో ఉన్న వారు చాలామందే ఉన్నారని వారిని గురించి పాఠ్యాంశాలు పెట్టి బావుండేదని హితవు పలికారు. ఇంటర్నెట్‌లో వారి గురించి సమాచారం చాలా లభిస్తుందని అన్నారు. అది కాదని మేం తమన్నా పాఠ్యాంశాన్ని వ్యతిరేకించినందుకు పిల్లలకు టీసీ ఇచ్చి పంపేస్తామంటూ మమ్మల్ని బయాందోళనలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే.. స్వాతంత్య్రానికి పూర్వం, ఇప్పుడు సింధు ప్రాంతంలో జీవన స్థితిగతులను, వారు రెండు వర్గాలుగా విడిపోయాక వారి లైఫ్ స్టైల్స్ ప్రస్తుతం ఎలా ఉన్నారో, సింధూ ప్రజలు మన దేశంలో ఎలా మమేకమయ్యారో తెలిపేందుకే ఆ పని చేశామంటూ సదరు పాఠశాల యాజమాన్యం సమర్థించుకుంటుందని పేరెంట్స్ తెలిపారు. సింధు వర్గానికి చెందిన తమన్నా (Tamannaah Bhatia), రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) తమ రంగాల్లో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం దేశంలో ఉన్నత స్థానాల్లో పేరు సంపాదించినందున వళ్ల వారు ఎదిగిన క్రమాన్ని, జీవితంలోని ముఖ్యాంశాలను ఆ లెసన్‌లో పెట్టడం జరిగిందంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చ చెబుతెన్నట్లు నెట్టింట వార్తలు షికారు చేస్తున్నాయి.
ఇదిలాఉండగా కర్ణాటకలోని అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ (KAMS) తల్లిదంగ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తోంది. ఈక్రమంలో పాఠశాల మరియు CBSE బోర్డు రెండింటినీ సంప్రదించింది కానీ సంబంధిత పాఠశాల అధికారులు ఈ సమస్యపై మట్లాడడానికి నిరాకరించడం గమనార్హం.