Controversies on heroine: హీరోయిన్లను లక్ష్యంగా చేసుకొని వివాదాలు

ABN, Publish Date - Jul 28 , 2024 | 03:15 PM

ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు రాజకీయ నాయకులు... చీప్‌ పబ్లిసిటీ కోసం కొంతమంది సినిమావాళ్లు... కథానాయికలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో హీరోయిన్లపై బజారు భాషను ఉపయోగిస్తూ వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు రాజకీయ నాయకులు... చీప్‌ పబ్లిసిటీ కోసం కొంతమంది సినిమావాళ్లు... కథానాయికలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో హీరోయిన్లపై బజారు భాషను ఉపయోగిస్తూ వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కథానాయికలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, వారిని దుర్భాషలాడే సంస్కృతి అక్కడ క్రమంగా పెరుగుతోంది.

కొన్నేళ్లుగా ఏదో ఒక సందర్భంలో హీరోయిన్లను లక్ష్యంగా చేసుకోని వివాదాలు రాజేసే ప్రయత్నం తమిళ పరిశ్రమలో నిరాటంకంగా కొనసాగుతోంది. కొంతమంది స్వార్థపరులకు తమిళ నాయిక ఈజీ టార్గెట్‌గా మారుతోంది. ఈ తరహా ధోరణి అటు బాలీవుడ్‌లో కానీ ఇటు సౌతిండియాలోని మరో చిత్ర పరిశ్రమలోగానీ కనిపించదు.

తమన్నా పేరును వాడుకొని...

తమన్నా పాట ఉంటే చాలు సినిమా హిట్‌ అవుతుందంటూ తమిళ నటుడు, దర్శకడు పార్తీబన్‌ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌ పరిశ్రమలో దుమారం రేపాయి. అలా అనడంలో ఆయన అసలు లక్ష్యం మాత్రం రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌’, ఖుష్బూ భర్త సుందర్‌ తెరకెక్కించిన ‘బాక్‌’ చిత్రాలు.

వాటి విజయాన్ని తక్కువ చేసి చూపించే క్రమంలో ఆయన అలా మాట్లాడారు. కానీ అందుకు తమన్నా పేరును అస్త్రంగా వాడుకోవడాన్ని పరిశ్రమ తప్పు పట్టింది. కేవలం ఆమె కురుచ దుస్తుల్లో అందాల ప్రదర్శనే ఆ సినిమాలను ఒడ్డున పడేసిందని అర్థం వచ్చేలా మాట్లాడడంపై పరిశ్రమ వర్గాలు అభ్యంతరం చెప్పడంతో చివరకు పార్తీబన్‌ అందరికీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

నయనతార లక్ష్యంగా...

సినీ రంగ ంలోని దిగ్గజాలే కాదు... వర్ధమాన నటీనటులు, దర్శకులు సైతం హీరోయిన్లపై నోరు పారేసుకుంటున్నారు. కథానాయికల వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చే పని పెట్టుకుంటున్నారు. తమిళ సినీ, రాజకీయ వర్గాలకు లక్ష్యంగా మారారు నయనతార. ఆమెపై పలు సందర్భాల్లో అక్కడి సినీ రాజకీయ ప్రముఖులుగా భావించే కురుచబుద్ది నాయకులు కించపరిచే వ్యాఖ్యలు చేశారు.

సీనియర్‌ నటుడు, బీజేపీ నాయకుడు రాధారవి నయనతారకూ, సీఎం స్టాలిన్‌ కుమారుడు, హీరో ఉదయనిధికి అక్రమ సంబంధం అంటగట్టారు. నయనతారతో ఉదయనిధి సహజీవనం చేస్తున్నారని 2021లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. వాళ్ల ఎఫైర్‌ గురించి నిలదీయడం వల్లే డీఎంకే నుంచి తనను బహిష్కరించారని చెప్పారు. ఆ ఎన్నికల్లోనే ఆయన కమల్‌హాసన్‌పైనా తన వ్యాఖ్యలతో పేట్రేగారు. ప్రధాని మోదీకి, కమల్‌హాసన్‌కు పోలిక లేదన్నారు. మోదీ దేశాన్ని కాపాడితే, కమల్‌ కట్టుకున్న భార్యలను కాపాడుకోలేకపోయాన్నారు. ముగ్గురు మహిళల జీవితాలను రోడ్డుపాలు చేశాడని విమర్శించారు.

హన్సికపై ఆరోపణలు...

హన్సిక నటించిన ‘పార్టనర్‌’ చిత్రంలో రోబో శంకర్‌ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం ప్రెస్‌మీట్‌లో హీరోయిన్‌ హన్సికపై ఆమె ఎదురుగానే మీడియా సమక్షంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు రోబో శంకర్‌.

‘షూటింగ్‌లో దర్శకడు ఎంత బతిమాలినా ఆమె నా కాలు తాకేందుకు ఇష్టపడలేదు. నన్ను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఆమె ప్రవర్తనకు యూనిట్‌ అంతా విస్తుపోయింది’ అని చెప్పాడు. అలాంటిదేం జరగలేదని ఆ తర్వాత అతడు క్షమాపణలు చెప్పాడు.


డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌తో...

త్రిషను బెడ్‌రూమ్‌కు తీసుకెళ్దామనుకున్నాను అంటూ డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో ఆ మధ్య వార్తల్లో నిలిచారు సీనియర్‌ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌. ‘నా కెరీర్‌లో ఎన్నో రేప్‌ సీన్లు చేశాను. ‘లియో’లో త్రిషను బెడ్‌రూమ్‌కి తీసుకెళ్దామనుకున్నాను.

కానీ రేప్‌ సీన్‌ లేకపోవడం నన్ను బాధించింది’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు విలన్‌గా ఓ వెలుగు వెలిగిన మన్సూర్‌ ప్రభ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆ నేపథ్యంలో ‘లియో’ సినిమాలో అప్రాధాన్యమైన పాత్ర పోషించాల్సి వస్తుందనే ఆక్రోశం, హీరోను, దర్శకుణ్ణి ఏమీ అన లేని పరిస్థితిలో ఆయన త్రిషపై చిల్లర వ్యాఖ్యలుకు దిగాడనేది కోలీవుడ్‌ టాక్‌.

తద్వారా జనాల దృష్టిని ఆకర్షించాలనే అతని ప్రయత్నం నెరవేరింది. కానీ ఒక మహిళ వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు అతను ప్రయత్నించడాన్ని జనాలు ఛీ కొట్టారు. చిత్రపరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, కోర్టు మొట్టికాయలు వేయడంతో మన్సూర్‌ మొక్కుబడిగా క్షమాపణలు చెప్పి వివాదాన్ని ముగించాడు.

ధనుష్‌తో మీనా పెళ్లి?

2022లో మీనా భర్త విద్యాసాగర్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. మీనాకు యావత్‌ చిత్రపరిశ్రమ అండగా నిలిచింది. నాలుగు ఓదార్పు మాటలు చెప్పింది. తర్వాత క్రమంగా ఆ బాధ నుంచి బయటపడి మీనా సినిమాలు చేస్తున్నారు.

‘కూతురే నా లోకం. మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేద’ని మీనా పలు సందర్భాల్లో చెప్పారు. కానీ అక్కడి మీడియా మాత్రం మీనాతో ఎవరెవరినో ముడిపెడుతూ వార్తలు వడ్డిస్తోంది.

దానిక్కావలసిన ముడి సరకును అక్కడి సినిమావాళ్లే అందిస్తున్నారు. మీనా జూలైలో ధను్‌షను పెళ్లాడబోతోందంటూ బీ రంగనాథన్‌ అనే నటుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ఇద్దరూ వయసులో ఉన్నారు, పైగా తోడు లేదు, పెళ్లి చేసుకుంటే తప్పేంటి? చేసుకోకుండా కలిసి ఉన్నా తప్పులేదు’ అన్నాడు. అతని వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారడంతో అలాంటిదేం లేదని మీనా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Updated Date - Jul 28 , 2024 | 03:15 PM