కాంతారాను మైమరిపించిన.. న్యూజిలాండ్ ఎంపీ! గూస్‌బంప్సే
ABN, Publish Date - Jan 05 , 2024 | 06:48 PM
వాక్‌చాతుర్యం అందరికీ నప్పేది కాదు.. చాలామంది ఏండ్ల తరబడి, దశాబ్దాలుగా ప్రజా ప్రతినిధులుగా గెలిచినప్పటికీ చాలా మందికి మాట్లాడం, ప్రసంగాలు చేయడం చాతకాదు. తాజాగా ఓ ఎంపీ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వాక్‌చాతుర్యం అందరికీ నప్పేది కాదు.. చాలామంది ఏండ్ల తరబడి, దశాబ్దాలుగా ప్రజా ప్రతినిధులుగా గెలిచినప్పటికీ చాలా మందికి మాట్లాడం, ప్రసంగాలు చేయడం చాతకాదు. కొందరు అనర్గళంగా మాట్లాడగలిగితే.. మరికొందరు తడబడుతూ పొంతన లేని ప్రసంగాలు చేస్తుంటారు. తాజాగా ఓ ఎంపీ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
21 ఏళ్ల హనా-రౌహితీ మైపి-క్లార్క్(Hana-Rawhiti Maipi-Clarke) అనే మావోరీ అని అంతరించిపోతున్న తెగకు చెందిన యువతి 170 ఏళ్ల న్యూజిలాండ్ (New Zealand) చరిత్రలో అత్యంత పిన్న వయసులో ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె పార్లమెంట్‌లో తొలిసారిగా ప్రసంగిస్తూ అక్కడి వారిలో గూస్‌బంప్స్ తెప్పించింది. "నేను మీ కోసం చనిపోవడానికి రెడీగా ఉన్నాను.. మీ కోసం జీవించేందుకు సిద్ధంగా ఉన్నానని".. ఉద్వేగ భరితంగా ప్రసంగించింది.
ఆక్లాండ్, హామిల్టన్ మధ్య ఉన్న చిన్న పట్టణమైన హంట్లీ మైపి-క్లార్క్ స్వస్థలం. అక్కడ ఆమె ఒక కమ్యూనిటీ గార్డెన్‌ను నడుపుతూ పిల్లలకు తోట పని గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఆమె మాట్లాడుతూ నన్ను నేను రాజకీయ నాయకురాలిగా చూడడం లేదని, మావోరీ భాష సంరక్షకురాలిగా చూసుకుంటున్నానన్నారు. రాబోయే తరానికి భాషా సంపదను అందించాల్సిన అవసరం తనపై ఉందని అన్నారు మైపి.
పార్లమెంట్‌లోకి వెళ్లే ముందు కొంతమంది నాకు సలహాలు ఇచ్చారని, అక్కడ జరిగే వ్యవహరాలను ఏవీ వ్యక్తిగతంగా తీసుకోకూడదని చెప్పారన్నారు. కానీ నేను పర్సనల్ గా తీసుకోకుండా ఉండలేకపోతున్నానని,నేను విజయం సాధించిన రెండు వారాల్లోనే ఈ ప్రభుత్వం నాపై దాడి చేసిందన్నారు.
ఇప్పుడు.. నా ప్రసంగం చూస్తున్న ప్రతి ఒక్కరికీ నేనేంటో, ఎవరి కోసం పోరాడుతున్నానో అర్థమవుతుందని ఆమె తన ప్రసంగాన్ని ముగించారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లంతా మరో కాంటారా చూసినట్టుగా అనిపిస్తున్నదని ఆ స్థాయిలో మాట్లాడిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాక కాంతార సినిమాలోని వారాహ రూపం పాటను గుర్తు చేసుకుంటున్నారు.