Guntur Kaaram: జనవరి 6న పెద్ద ఎత్తున జరగనున్న ప్రీ రిలీజ్ వేడుక
ABN, Publish Date - Jan 03 , 2024 | 06:22 PM
ఎప్పటినుంచో మహేష్ బాబు అభిమానులు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు, అది ఇప్పుడు 'గుంటూరు కారం' రూపంలో వచ్చింది. అందుకే ఇక అభిమానులు కూడా చాలా దూకుడుతూ ఈ సినిమా ప్రచారం చేస్తున్నారు. పండగ సినిమా 'గుంటూరు కారం' అని అంటున్నారు. ప్రీ రిలీజ్ వేడుకలలో విడుదలయ్యే ట్రైలర్ తో ఈ సినిమా ప్రచారాలు ఆకాశాన్ని అంటుతాయని అంటున్నారు.
రానున్న సంక్రాంతి పండగ మహేష్ బాబు అభిమానులకి పెద్ద పండగ అవబోతోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేతులు కలిపి తీసిన చిత్రం 'గుంటూరు కారం' జనవరి 12 న విడుదలవుతూ ఉండటమే అందుకు కారణం. చాలా కాలం తరువాత ఈ ఇద్దరూ ఈ చిత్రంతో కలుసుకోవటం, దీనికోసమే అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ వున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ప్రకాష్ రాజ్, జయరాం, రావు రమేష్, మురళి శర్మ, రమ్య కృష్ణ ఇంకా ఎంతోమంది నటీనటులు ఈ సినిమాలో వున్నారు. (Mahesh Babu's Guntur Kaaram pre-release event on January 6 at Yousufguda Police Grounds)
ఇప్పటికే ఈ సినిమాలో పాటలు ముఖ్యంగా 'కుర్చీ మడతపెట్టి' అనే మాస్ మాట బాగా ప్రాచుర్యం పొందింది. కొత్త సంవత్సరం వేడుకల్లో ఎక్కడ చూసిన ఈ పాటనే అందరూ వేసుకున్నారని తెలుస్తోంది. అలాగే ఇందులో మహేష్ బాబుని ఒక మాస్ అవతారంలో త్రివిక్రమ్ చూపించనున్నారని కూడా అంటున్నారు. నిర్మాత నాగవంశి ఈ సినిమా చివరి 45 నిముషాలు చాలా బాగుంటుందని, భావోద్వేగంతో కూడి ఉంటుందని చెపుతున్నారు. అందుకని ఈ సినిమా గురించి అభిమానులు ఎదురు చూస్తున్నారు.
సంక్రాంతి పండగ పోటీలో సుమారు ఐదు సినిమాలు వున్నా 'గుంటూరు కారం' సినిమా పండగ సినిమా అని అంటున్నారు. ఎందుకంటే ఇది కుటుంబం అంతా చూసి బాగా ఆనందిస్తారని, అందులోకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మాటల మాంత్రికుడుగా పేరు వుంది, ఈ సినిమాలో మాటలు కూడా చాలా బాగా వచ్చాయని కూడా అంటున్నారు.
ఇక మహేష్ బాబు కొత్త సంవత్సర వేడుకల కోసం కుటుంబంతో దుబాయ్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అతను తిరిగి హైదరాబాదు జనవరి 5న వచ్చేస్తారని, జనవరి 6న ప్రీ రిలీజ్ వేడుక ఉంటుందని, అది కూడా అభిమానుల కోసమే యూసఫ్ గూడ లోని 'పోలీసు గ్రౌండ్స్' లో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. అదే రోజు ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదలవుతుందని కూడా అంటున్నారు. జనవరి 12న వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో 'గుంటూరు కారం' ప్రదర్శించబోతున్నారని పరిశ్రమలో టాక్. అలాగే ఈ సినిమాకి విదేశాల్లో కూడా అప్పుడే బుకింగ్స్ మొదలైపోవటం, వాటికి డిమాండ్ పెరగటం చూస్తుంటే ఈ సినిమా కి ఎంత హైప్ వచ్చిందో అర్థం అవుతోంది అని కూడా పరిశ్రమలో మాట్లాడుకుంటున్నారు.