Pawan Kalyan: ముందు బాధ్యతలు.. ఆ తర్వాతే సినిమా..

ABN, Publish Date - Oct 14 , 2024 | 01:53 PM

సినిమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు.

సినిమాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా కంకిపాడులో నిర్వహించిన  ‘పల్లెపండగ’ (Palle pandaga) కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్థిశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు.  పవన్‌కల్యాణ్‌ సభలో అభిమానులు 'ఓజీ' (OG) అంటూ నినాదాలు చేయగా ఆయన స్పందించారు.

‘‘మీరు ‘ఓజీ.. ఓజీ..’ అంటుంటే నాకు ‘మోదీ.. మోదీ’ అని వినిపించేది. వినోదం అందరికీ కావాల్సిందే. ఈ పల్లె పండగ ఎందుకు చేస్తున్నామో మీకు చెబుతా. రేపు మీరంతా మీ అభిమాన కథానాయకుల సినిమాలకు వెళ్లాలి. టికెట్ల కోసం డబ్బులు పెట్టాలి అంటే మీ చేతిలో డబ్బులు ఉండాలి. వినోదం కన్నా ముందు ప్రతీ ఒక్కరి కడుపు నిండాలి. అందుకే ముందు కడుపు నింపే పని చేద్దాం. మన రోడ్లు, స్కూల్స్‌ను బాగు చేసుకుందాం. ఆ తర్వాతే విందులు.. వినోదాలు.. ఓజీలు. మీరు సినిమాకు వెళ్లాలన్నా గోతులు లేని రోడ్లు ఉండాలి కదా! నన్ను మీరెలా అభిమానిస్తారో, నాకు కూడా వేరే హీరోలు అంటే ఇష్టమే. ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోలతోనూ ఇబ్బంది లేదు. నేను ఎవరితోనూ పోటీపడను. ఒక్కొక్కరూ ఒక్కో దాంట్లో నిష్ణాతులు. అందరూ బాగుండాలని కోరుకుంటా. బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్‌బాబు, తారక్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, నాని అందరూ బాగుండాలని కోరుకుంటా. మీ అభిమాన హీరోలకు జై కొట్టేలా ఉండాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండాలి. ముందు దానిపై దృష్టిపెడదాం’’ అని అన్నారు.

ప్రస్తుతం ఆయన చేతిలో 'హరిహర వీరమల్లు’, ఓజీ, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్రాలు ఉన్నాయి. ఇటీవల విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో 'హరిహర వీరమల్లు' షూటింగ్‌ మొదలైంది. అక్కడి పవన్‌తోపాటు కీలక పాత్రధారులపై సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రానికి తొలుత క్రిష్‌ దర్శకత్వం వహించగా ఇప్పుడు నిర్మాత ఏ.ఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - Oct 14 , 2024 | 02:16 PM