Film Celebs: సురేఖ వ్యాఖ్యలు విలువలకు విరుద్ధం.. సినీతారలు ఫైర్ 

ABN, Publish Date - Oct 03 , 2024 | 10:30 AM

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజీ మంత్రి కేటీఆర్‌పై సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని స్పందించారు

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజీ మంత్రి కేటీఆర్‌పై సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ క్రమంలో అక్కినేని ఫ్యామిలీతో సహా హీరోయిన్‌ సమంతను వివాదంలోకి లాగారు. సురేఖ వ్యాఖల్లో నాగచైతన్య, సమంత, నాగార్జున పేర్లను ప్రస్తావించడం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు స్పందించారు. సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు అల్లు అర్జుర్‌, ఎన్టీఆర్‌, నాని, సుధీర్‌బాబు, మంచు లక్ష్మీ, రామ్‌గోపాల్‌ వర్మతోపాటు పలవురు స్పందించారు. ుూవ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని ఎన్టీఆర్‌ మండిపడ్డారు. ఆధారాల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని నాని హెచ్చరించారు.

విలువలకు విరుద్ధంగా ఉంది: అల్లు అర్జున్ 

‘‘సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా  అంగీకరించకూడదు. ఇతరుల వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నా. మనందరం కలిసి సమాజంలో గౌరవం, మర్యాద పెంపొందించాలి’’ - అల్లు అర్జున్‌ అన్నారు.    



దిగజారుడు రాజకీయాలు: ఎన్టీఆర్‌

‘‘కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారహిత్యంగా  చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. మాపై ఇలాంటి ఆరోపణలు చేేస్త చూస్తూ కూర్చొనేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధి దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు’’ అని ఎన్టీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.  

ఛీ.. ఇంత నీచమా: అబ్బూరి రవి
‘‘శుద్థి చెయ్యాల్సింది నదిని కాదు. వాళ్ళ బుద్థిని. ఛీ.. ఇంత నీచమా...’’
మీకు బాధ్యత ఉందా?: నాని
‘‘రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది.  బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూేస్త, మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా? అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను అంతా ఖండించాలి’’ అని నాని అన్నారు.

ఇదెలా  ఎలా న్యాయం: మంచు లక్ష్మి 

‘ఇది చాలా నిరుత్సాహకరం. ప్రతిసారీ రాజకీయ నాయకులు సినీ పరిశ్రమకు చెందినవారిపై ఇలాంటి నిందలు వేయడం కోపం తెప్పిస్తోంది. రాష్ట్రంలో ఏదైనా భయంకరమైన సంఘటన జరిగినప్పుడు రాజకీయ నాయకులు వారి అజెండాల కోసం సినీ ప్రముఖుల నుంచి మద్దతు కోరతారు. ఇది ఎలా న్యాయం అవుతుంది? ఇప్పుడు మేం ఎందుకు మౌనంగా ఉండాలి? ఓ మహిళ నుంచి ఇలాంటి ఆరోపణలు మరింత ఎక్కువ బాధ కలిగిస్తున్నాయి. ప్రజలకు వినోదాన్ని అందించేందుకు తమ జీవితాలను అంకితం చేసే వారిని గౌరవించండి. అంతేగానీ, ఇలా రాజకీయాల్లోకి లాగొద్దు. ఇది చాలా అన్యాయం’’ - మంచు లక్ష్మి 



మీ బుద్ధిని తెలియజేస్తోంది:    సుధీర్‌ బాబు
‘‘మంత్రి కొండా సురేఖ గారు.. మీ అమర్యాదకర, స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు భయంకరంగా ఉన్నాయి. సినీ ప్రముఖులను రాజకీయ పావులుగా వాడుకోవడం మీ బుద్ధిని తెలియజేస్తోంది. ఇలాంటి వ్యూహాలకు మా మధ్య సోదరభావం బెదిరిపోదు.. బెదిరింపులకు గురికాదు. మీరు కేవలం మహిళలను అవమానించడమే కాదు.. తెలంగాణకు గర్వకారణమైన మొత్తం సినీ పరిశ్రమను అగౌరపర్చారు. ఇలాంటి విషయాల నుంచి ప్రజలను పాలించడం వైపు దృష్టి మరల్చండి. మీ గౌరవం ఇప్పటికే తగ్గిపోయింది. దానిని మరింత దిగజార్చద్దు’’ 

- హీరో సుధీర్‌ బాబు

మహిళలందరూ ఖండించాలి: శ్రీకాంత్‌ ఓదెల
‘‘రంగస్థలం సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశా. 365 డేస్‌ ప్రతిరోజు సమంతని  దగ్గరగా చూసిన ఒక అభిమానిగా చెప్తున్నా. ఆమె సినిమా ఇండస్ర్టీకి దొరికిన వరం. ఒక ఆర్టిస్ట్‌గానే కాదు, ఒక వ్యక్తిగా కూడా తను మా ఇంట్లో అక్కలా అనిపించేవారు. నాకు సురేఖ గారి గురించి కానీ, సమంత మేడం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. కానీ సురేఖ  మాట్లాడింది మాత్రం కరెక్ట్‌ కాదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం నిజంగా బాధగా ఉంది. పదవి, అధికారం ఉన్నా గౌరవాన్ని కొనలేరు. సినిమా ఇండస్ర్టీలో ఒక మహిళ తన కలలను సాకారం చేసుకుంటూ ఎదగాలంటే చాలానే అవరోధాలు ఉంటాయి. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు ఆ భయాలను మరింత పెంచుతాయి. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమే కాదు, ప్రతి చోటా లింగ అసమానత్వం ఉంది. మహిళలందరూ దీనిని ఖండించాలి. బతుకమ్మ అంటేనే ఆడది అంటారు. అలాంటి బతుకమ్మ జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి ఇష్యూ రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది’’

-దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల

మీ విలువలు ఎక్కడికి పోయాయి సురేఖ: ఖుష్బూ
‘‘రెండు నిమిషాల ఫేం కోసం కనీస విలువలే లేనివారు ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ, ఇక్కడ ఒక మహిళకు జరిగిన అవమానాన్ని చూస్తున్నాను. కొండా సురేఖ గారు.. మీలో కొన్ని విలువలు ఉన్నాయని నేను అనుకుంటున్నా. అవన్నీ ఎక్కడికి పోయాయి? బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి చిత్ర పరిశ్రమలోని వారి గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం, భయంకరమైన కించపరిచే మాటలు మాట్లాడం చేయకూడదు. ఇలాంటి ఆరోపణలు చేసినందుకు మీరు క్షమాపణలు చెప్పాలి. దేశంలో ప్రజాస్వామ్యం వన్‌ వే ట్రాఫిక్‌ కాదు.. మేం మీ  స్థాయిలో దిగజారి మాట్లాడలేము’’ అని నటి ఖుష్బూ అన్నారు.

Updated Date - Oct 03 , 2024 | 10:42 AM