Movie Ticket Mafia: అభిమానుల జేబులు గుల్ల చేస్తున్న బెనిఫిట్‌ షోలు

ABN, Publish Date - Sep 26 , 2024 | 02:31 PM

ఫ్యాన్స్‌ షో, బెనిఫిట్‌ షోల (Benefit show)పేరుతో మేకర్స్‌, ఆయా నిర్వాహకులు అభిమానుల క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంటున్నారా

ఫ్యాన్స్‌ షో, బెనిఫిట్‌ షోల (Benefit show)పేరుతో మేకర్స్‌, ఆయా నిర్వాహకులు అభిమానుల క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంటున్నారా? (Ticket Movie Mafia)

ప్రీమియర్స్‌తో జేబులు నింపుకుంటున్నారా? అంటే అవుననే మాట వినిపిస్తుంది. 

అగ్ర హీరోల సినిమాలంటే మిడ్‌నైట్‌ ఫ్యాన్స్‌ షో, బెనిఫిట్‌ షోలు వేయడం అనేది చాలాకాలంగా ఉన్న పద్దతి. తమ అభిమాన హీరో సినిమాను ముందుగా చూడాలని ఫ్యాన్స్‌ ఉత్సాహం చూపిస్తుంటారు. దాని కోసం ఎంత వెచ్చించడానికైనా అభిమానులు వెనకాడరు. దానిని ఆయుధంగా చేసుకుని క్యాష్‌ చేసుకుంటున్నారు బెనిఫిట్‌ షో నిర్వాహకులు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన 'దేవర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ సోలోగా తెరపై కనిపిస్తున్న సినిమా కావడంతో అభిమానులు విపరీతమైన ఎగ్జైట్‌మెంట్‌తో సినిమా చూడటానికి సిద్ధమవుతున్నారు.

ఫ్యాన్స్‌ క్రేజే ఆయుధం..

ఫ్యాన్స్‌ క్రేజ్‌ను బట్టి మెయిన్‌ సిటీల్లో అభిమానుల కోసం బెనిఫిట్‌ షోలు ఏర్పాటు చేయడం అనవాయితీ. అయితే ఒకప్పుడు వీటికి రిజనబుల్‌ రేటు ఉండేది. ఇప్పుడు ఆ రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ఇప్పుడు అగ్ర తారలు, భారీ బడ్జెట్‌ చిత్రాలకు ప్రభుత్వం కూడా అదనపు షోలు, టికెట్‌ రేట్‌ పెంచడం లాంటి వెసులుబాటు కల్పిస్తోంది. అయితే ఇది పరిమిత రోజుల వరకే. ప్రభుత్వం జీవో ప్రకారం టికెట్‌ రేటుపై వంద రూపాయలు పెంపునకు అనుమతి ఉంటుంది. అయితే ఫ్యాన్స్‌ పేరుతో ఏర్పాటు చేసే బెనిఫిట్‌ షోల రేట్లకు రెక్కలు వచ్చినట్లుగా వ్యవహారం ఉంది. (Devara benefit show)

ఆ వ్యక్తులే కీలకం
గురువారం అర్ధరాత్రి దేవర బెనిఫిట్‌ (High Tickets rates) షోలను ఏర్పాటు చేశారు మేకర్స్‌. మిడ్‌ నైట్‌ షో ఒంటి గంటకు ప్రదర్శన జరగనుంది. హైదరాబాద్‌లో మొత్తంమీద 20కి పైగా ధియేటర్స్‌లో మిడ్‌ నైట్‌ షోలు ప్లాన్‌ చేశారు. అయితే వీటిని ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ పెట్టకుండానే డైరెక్ట్‌గా టికెట్లను అమ్ముతున్నారు. దీని వెనుక చిత్ర పరిశ్రమకు చెందిన కీలక వ్యకులతోపాటు ఓ ఛానల్‌లో పని చేసే ఎంటర్‌టైన్‌మెంట్‌ హెడ్‌, మరి కొందరు పీఆర్‌ఓలు గ్రూప్‌గా కలిసి సెలెక్టివ్‌ థియేటర్స్‌లో బెనిఫిట్‌ షోలు ప్రదర్శిస్తున్నారు. క్రేజీ సినిమాలు, స్టార్‌ హీరోల సినిమాలు విడుదల సమయంలో ఫ్యాన్స్‌ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకుంటున్నారీ మూవీ టికెట్‌ మాఫియా ముఠాలు.

సగానికి పైగా మిగులే..

దేవర సినిమా బెనిఫిట్‌ షో చూడాలంటే అక్షరాల రెండువేలు చెల్లించాల్సిందే!  మామూలుగా మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌లో సినిమా టికెట్‌ ధర హై క్లాస్‌ అయితే రూ.500 ఉంటుంది. కానీ బెనిఫిట్‌  షో ధర ఆకాశాన్ని అందుకున్నట్లు రూ.2000 పలుకుతోంది. ఏఎంబీలో ఒక్కో స్క్రీన్  సీటింగ్‌ కెపాసిటీ 300 వరకూ ఉంటుంది. అంటే ఒక్క షో కి వసూలు చేసే మొత్తం ఆరు లక్షల రూపాయలు. బెనిఫిట్‌ షోకి ప్రత్యేకంగా కట్టాల్సిన టాక్స్‌ ఏమీ ఉండదు. షో నిర్వాహకులు హోల్‌ థియేటర్‌ బుక్‌ చేసుకుంటారు. అది కూడా టాక్స్‌తో కలిపే. ఇందులో ఖర్చులు పోగా దాదాపు సగానికి సగం తమ జేబులో వేసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది. ఇప్పుడు ఇదొక దందాగా  మారింది.  అభిమానులు ఆ సమయంలో ఇవేమీ పట్టించుకోరు. సినిమా చూసొచ్చాక టికెట్‌ రూపంలో మన జేబుకు ఇంత చిల్లు పడిందా అని వాపోతుంటారు.


నిబంధనలకు విరుద్ధంగా టిక్కెట్లు..

నిబంధనలకు విరుద్ధంగా దేవర సినిమా టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలతో  స్వర్ణ, వెంకటేశ్వర థియేటర్లలో తనిఖీలు చేపట్టారు  ఇబ్రహీంపట్నం (AP) తహసీల్దార్ వెంకటేశ్వర్లు. మండల మేజిస్ట్రేట్ వచ్చి గంటసేపైనా థియేటర్ యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవిన్యూ అధికారులు టిక్కెట్ల విక్రయిస్తున్న ధరలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 

Updated Date - Sep 26 , 2024 | 04:46 PM