Chiranjeevi - Rajendra Prasad: ఎప్పుడూ నవ్వించే అతన్ని ఎలా ఓదార్చాలి..
ABN, Publish Date - Oct 05 , 2024 | 04:37 PM
తన కుమార్తె వియోగాన్ని తట్టుకొనే శక్తిని రాజేంద్రప్రసాద్‌కి (Rajendra Prasad) ఆ భగవంతుణ్ణి ఇవ్వాలని కోరుకుంటున్నానని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)అన్నారు.
తన కుమార్తె వియోగాన్ని తట్టుకొనే శక్తిని రాజేంద్రప్రసాద్‌కి (Rajendra Prasad) ఆ భగవంతుణ్ణి ఇవ్వాలని కోరుకుంటున్నానని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)అన్నారు. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (Rajendra Prasad's daughter Gayatri died) హఠాన్మరణం దిగ్ర్బాంతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు చిరంజీవి ఆయన్ను పరామర్శించారు. "నా మిత్రుడు రాజేంద్రప్రసాద్ బిడ్డ కాలం చెందటం మనస్తాపానికి గురిచేసింది. ఉదయాన్నే వినకూడని మాట విన్నాను. చిన్న వయస్సులోనే బిడ్డ చనిపోవడం బాధాకరం. నా మిత్రుడు ఈ బాధను ఎలా దిగమింగుకుంటాడు.. ఎప్పుడూ నవ్వించే అతన్ని ఎలా ఓదార్చాలి అంటూ బయలుదేరాను. తనకున్న బాధను దిగమింగుకొని తన వ్యక్తిత్వంతో 'భగవంతుడు చాలా పరీక్షలు పెడుతుంటాడు.. అన్నింటిని తీసుకోగలగాలి’ అని వేదాంతిలా మాట్లాడుతుంటే నాకు మరింత బాధ అనిపించింది. వయసు పెరుగుతున్న కొద్దీ పెద్దవాళ్లు ఏమైపోతారో అని చిన్నవాళ్లు ఆలోచిస్తుంటారు. కానీ సగం జీవితం కూడా చూడకుండా చిన్నవాళ్లు ఇలా కనుమరుగైతే పెద్దలకు తట్టుకోలేని బాధగా ఉంటుంది. నా మిత్రుడు ఈ విషాదం నుంచి కోలుకుని త్వరలో మళ్లీ అందరినీ నవ్వించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నా’’ అని అన్నారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే! ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో చనిపోయారు. శుక్రవారం రాత్రి కార్డియాక్ అరెస్టుతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో గాయత్రి కన్నుమూశారు. ఆమెకు తీవ్ర గ్యాస్ర్టిక్ సమస్య రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే ఆమె హార్ట్ ఎటాక్‌కు గురై కన్నుమూశారు. గాయత్రి మరణవార్త తెలిసిన ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. రాజేంద్రప్రసాద్‌కు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు.