ANR- Annapurna: ఏయన్నార్‌నే పెళ్లాడతానని భీష్మించి మరీ..

ABN, Publish Date - Sep 20 , 2024 | 02:56 PM

సినిమా వాళ్లకు పెళ్లి సంబంధాలంటే భయపడేవాళ్లు ఎక్కువే. అయినప్పటికీ ‘బాలరాజు’గా అప్పటికే ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టిన అక్కినేని నాగేశ్వరరావునే పెళ్లాడతానని భీష్మించి మరీ పెళ్లాడింది అన్నపూర్ణ.

చలనచిత్ర పరిశ్రమ అంటే ఒక మాయా ప్రపంచం. మాయల మరాఠీలు, రంగు రంగుల సీతాకోక చిలుకలు తిరుగాడే ప్రపంచం. ఎంత ఆకర్షణీయమైన లోకమో, అంత వంచనా ప్రపంచం కూడా. ఏ రంగమైనా మంచి, చెడు మిశ్రమం. అయితే సినిమాల్లో ‘చెడు’ హైలైట్‌ అయినట్లు ‘మంచి’ హైలైట్‌ కాదు. అందుకే సినిమా వాళ్లకు పెళ్లి సంబంధాలంటే భయపడేవాళ్లు ఎక్కువే. అయినప్పటికీ ‘బాలరాజు’గా అప్పటికే ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టిన అక్కినేని నాగేశ్వరరావునే పెళ్లాడతానని భీష్మించి మరీ పెళ్లాడింది అన్నపూర్ణ. 1949 ఫిబ్రవరిలో ఆమెను పెళ్లాడింది మొదలు 2011 డిసెంబర్‌లో ఆమె మరణించేంత వరకూ తన హృదయంలో ఆమెను దాచుకున్నారు అక్కినేని. దాదాపు డెబ్భై మంది నాయికల సరసన ఆయన నటించారు. వాళ్లలో కొంతమందితో సంబంధాలు అంటగట్టి అన్నపూర్ణ మనసులో ఆయనపై విష బీజాలు నటడానికి ప్రయత్నించి విఫలమయ్యారు కొందరు. ఎవర్ని ఏ విధంగా చూడాలో, ఎవరినెక్కడ ఉంచాలో నాగేశ్వరరావుకు తెలుసు. ఎంతటి అగ్ర నటుడైనా ఆయన బాధ్యత కలిగిన గృహస్థుడు. ప్రేమానురాగాలు పంచే ఆదర్శవంతుడైన భర్త. షూటింగ్‌ నుంచి వచ్చాక సాధారణ గృహస్థుగా మారిపోయే ఆయన అన్నపూర్ణతో ఎన్నో విషయాలు చర్చించేవారు. ఆమె చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించేవారు. ‘‘మేం ఒకరి అభిరుచుల్ని మరొకరం గౌరవించుకుంటాం. ఆత్మీయులుగా, స్నేహితులుగా కలిసిపోతాం’’ అని ఒక సందర్భంలో అన్నపూర్ణ చెప్పారు. ఆమె కోసం, పిల్లల కోసం, వారితో ఆనందంగా గడపడం కోసం విధిగా ఏడాదికి ఒక నెల రోజులు పూర్తిగా కేటాయించేవారు అక్కినేని. ఆమె పేరిట అన్నపూర్ణ స్టూడియోస్‌ స్థాపించి అక్కడ షూటింగ్‌లు చేసుకోవడానికి ఫ్లోర్‌లు నిర్మించడమే కాకుండా, డబ్బింగ్‌, రికార్డింగ్‌ థియేటర్లనూ నెలకొల్పారు. అదే పేరుతో బేనర్‌ను ఏర్పాటుచేసి ఎన్నో చిత్రాలు నిర్మించారు అక్కినేని.

వీటి ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించి, భోజనం పెట్టారు. వృద్ధాప్యం కారణంగా అన్నపూర్ణ ఆరోగ్యం దెబ్బతిన్నాక నాగేశ్వరరావు సినిమాలు తగ్గించుకున్నారు. అన్నపూర్ణతో గడిపేందుకు ఎక్కువ కాలం వెచ్చించేవారు. ‘సకుటుంబ సపరివార సమేతం’ (2000) సినిమా తర్వాత ఆమెను చూసుకోవడం కోసం ఆయన ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చినా ఒకట్రెండు గంటల కంటే ఎక్కువ సేపు వెచ్చించేవారు కాదు. ఒకవేళ ఎప్పుడైనా కాస్తంత ఎక్కువ సేపు బయట గడపాల్సి వస్తే ఇంటికి వెళ్లేదాకా ఆయన మనసు మనసులో ఉండేది కాదు. అందుకే ఒకసారి ‘‘ఎంతో అరుదైన అదృష్టాన్ని వారి అర్ధాంగిగా పొందగలిగాను. మానసికంగా ఎంతో ఎదగగలిగాను. ఆదర్శ గృహస్థు ధర్మాల గురించి ఆయన్నుంచే ఎవరైనా నేర్చుకోవచ్చంటాను. ఎన్ని సార్లయినా చెబుతాను నాకు స్నేహితుడు, గురువు, దైవం అన్నీ ఆయనే’’ అని సగర్వంగా చెప్పారు అన్నపూర్ణ. ఆవిడ  పోయిన రెండేళ్లకే  ‘మనసున మనసై బతుకున బతుకై’ అంటూ ఆమెను వెతుక్కుంటూ తనూ వెళ్లిపోయారు నాగేశ్వరరావు.

Updated Date - Sep 20 , 2024 | 03:27 PM