Nagarjuna: నాంపల్లి కోర్టుకు నాగార్జున.. కొండా సురేఖపై పరువునష్టం దావా
ABN, Publish Date - Oct 03 , 2024 | 05:36 PM
తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. ఈ విషయంలో నాగార్జున నాంపల్లి కోర్టు మెట్లు ఎక్కారు.
తాజాగా తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ (Konda Surekha) బుధవారం నాగార్జున (Nagarjuna), నాగ చైతన్య, సమంతలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే టాలీవుడ్ ప్రధాన తారలంతా తమ సోషల్ మీడియాల ద్వారా మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సొంత రాజకీయాల కోసం సినిమా సెలబ్రిటీల పేరును వాడుకోవడం తగదంటూ హితవు పలికారు.
ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, అమల, నాగ చైతన్య, అఖిల్ లు కూడా ఈ అంశంపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. అ వ్యాక్యలను వెనక్కు తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే సురేఖకు లీగల్ నోటీసులు పంపారు.
తాజాగా నాగార్జున ఈ ఇష్యూ విషయంలో కోర్టు మెట్లు ఎక్కారు. కొండా సురేఖ తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ కేసుపై రేపు (శుక్రవారం) వాదనలు జరిగే అవకాశం ఉంది.