Ayodhya: టాలీవుడ్, బాలీవుడ్ తారలతో కిక్కిరిసిన అయోధ్య, వైరలవుతోన్న ఫోటోస్
ABN, Publish Date - Jan 22 , 2024 | 12:22 PM
శ్రీరామ తారక మంత్రంతో అయోధ్య నగరం మారుమోగుతోంది. కొన్ని శతాబ్దాల తరువాత రాముడు పుట్టిన అయోధ్యలో రామ ప్రతిష్టాపన ఈరోజు జరుగుతోంది, ఈ ఏర్పాట్లు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని చూడటానికి సినిమా రంగ ప్రముఖులు అయోధ్య నగరాన్ని చేరుకున్నారు. వారి ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సోమవారం మధ్యాహ్నం రాముడు పుట్టిన అయోధ్యలో రాముడి ప్రతిష్ట జరగబోతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం రామనామ స్మరణతో భక్తితో పులకరించిపోతోంది. భారతదేశంలో ప్రతి దేవాలయాల్లోనూ రామనామ జపాలు, హోమాలు, ప్రత్యేకంగా చేయబడుతున్నాయి. ఈ సంబరాలను ప్రత్యక్షంగా తిలకించడానికి కొన్ని వేలమంది భక్తులు ఇప్పటికే అయోధ్య నగరాన్ని చేరుకున్నారు. రామ నామాంకిత ధ్యానంతో అయోధ్య నగరం పరవశించి పోతోంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రామ జన్మభూమి ట్రస్ట్ వారు అనేకమంది ముఖ్యమైన వ్యక్తులను వ్యక్తిగతంగా కలిసి వారిని అయోధ్యకి రమ్మని ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని పురస్కరించుకొని బాలీవుడ్, టాలీవుడ్, తమిళనాడు, మలయాళం నుండు అనేకమంది నటీనటులు ఇప్పటికే అయోధ్య నగరాన్ని చేరుకున్నారు.
రాముడు పుట్టిన అయోధ్యలో రామ ప్రతిష్ట జరుగుతోంది, ఆ సంబరాన్ని చూడటానికి ఎంతోమంది ఇప్పటికే చేరుకున్నారు. హైదరాబాదు నుండి మెగా స్టార్ చిరంజీవి, భార్య సురేఖతో పాటుగా తనయుడు రామ్ చరణ్ కూడా అయోధ్యకు చేరుకున్నారు.
మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ తో మాట్లాడుతూ కనిపించారు. వారు ముగ్గురూ చాలాసేపు మాట్లాడుకోవటం, నవ్వుకోవటం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక తలైవాగా పేరుపొందిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా అయోధ్యకి చేరుకున్నారు. అక్కడ అతను తన ప్రియ మిత్రుడు అనుపమ్ ఖేర్ ని కలవటంతో చాలా సంతోషంగా కనిపించారు.
ఇక బాలీవుడ్ నుండి రణబీర్ కపూర్, అతని భార్య అలియా భట్ కూడా ప్రత్యేక ఆహ్వానాన్ని పురస్కరించుకొని అయోధ్య నగరం చేరుకున్నారు. వారితో పాటు దర్శకుడు రోహిత్ శెట్టి కూడా వున్నారు.
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, తనయుడు అభిషేక్ బచ్చన్ మిగతా కుటుంబ సభ్యులతో అయోధ్య నగరం చేరుకున్నారు. రామ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించడానికి బచ్చన్ కుటుంబం అంతా అయోధ్య చేరుకున్నారు. అనిల్ అంబానీ ఈ కుటుంబంతో కూడా సన్నిహితంగా ఉంటూ మాట్లాడుతూ కనిపించారు.
బాలీవుడ్ ని సుమారు రెండు దశాబ్దాలపాటు తన నటన, ప్రతిభ, అందంతో ఉర్రుతలూగించిన నటి మాధురి దీక్షిత్ తన భరతో అయోధ్య నగరం చేరుకొని ఈ ఉత్సవం వీక్షించడానికి వచ్చారు.
కత్రినా కైఫ్, భర్త విక్కీ కౌశల్ తో భారతీయ సంప్రదాయమైన చీరలో కనిపించి, అయోధ్య నగరం చేరుకున్నారు. మిగతా బాలీవుడ్ ప్రముఖులతో పాటుగా వీరు కూడా రాముడు పుట్టిన అయోధ్యలో రాముడి ప్రతిష్టని కన్నులార వీక్షించడానికి చేరుకున్నారు.
ప్రముఖ నటి కంగనా రనౌత్ ఒకరోజు ముందుగానే అయోధ్య నగరానికి చేరుకున్నారు. అక్కడ మందిరాలని శుభ్రం చేస్తూ, హోమం కూడా చేశారు. నిన్నటి నుండి అక్కడే ఉంటూ రామ ప్రతిష్ఠాపన సంబరాన్ని తిలకించడానికి వేయికళ్లతో ఎదురుచూస్తూ కనపడ్డారు.
వీరే కాక అనేకమంది ఇంకా అయోధ్యకి తరలి వస్తున్నారు. కొన్ని శతాబ్దాల తరువాత రాముడు జన్మస్థలం అయిన అయోధ్యలో రాముడు ప్రతిష్ఠాపన జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఉత్సవానికి ముందుండి ఎంతో వైభవంగా చరిత్రలో నిలిచిపోయేట్టుగా చేయిస్తున్నారు.