PVCU3 ‘మహాకాళి’.. ప్రశాంత్ వర్మ ఏం ఫ్లాన్ చేశావ్ పో!
ABN, Publish Date - Oct 10 , 2024 | 01:07 PM
'హనుమాన్' తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌లో మూడో చిత్రంగా (PVCU3) ఫస్ట్ ఇండియన్ ఉమెన్ సూపర్ హీరో చిత్రం మహాకాళి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి గ్లిమ్స్ విడుదల చేశారు.
'హనుమాన్' (HanuMan)తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తన సినిమాటిక్ యూనివర్స్‌లో వరుస చిత్రాలు వస్తాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ క్రమంలో జై హనుమాన్ రూపొందుతున్నట్లు ప్రకటించి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచారు. ఈ నేపథ్యంలో ఈ యూనివర్స్‌లో తానోక్కడినే కాకుండా ఇతరుల దర్శకుకత్వం లోనూ సినిమాలు వస్తాయని తెలిపిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా ఈ యూనివర్స్‌లో మూడో చిత్రంగా (PVCU3) ఫస్ట్ ఇండియన్ ఉమెన్ సూపర్ హీరో చిత్రం మహాకాళి రాబోతున్నట్లు తాజాగా ఈ రోజు(గురువారం) అధికారికంగా ప్రకటించి సినిమా ఎనౌన్స్‌మెంట్ గ్లిమ్స్ విడుదల చేశారు. ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీకి పూజ అపర్ణ కొల్లూరు (Puja Aparnaa Kolluru) దర్శకత్వం వహిస్తుండగా RK దుగ్గల్ సమర్ఫణలో RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ (Riwaz Ramesh Duggal) నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాను పాన్ ఇండియాగా ఐమాక్స్ 3డీలో విడుదల చేయనున్నారు.
బెంగాల్ నేపథ్యంలో ఆధ్యాత్మిక మరియు పౌరాణిక అంశాలను మిళితం చేస్తూ అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ గ్రిప్పింగ్ కథనంతో ఈ ‘మహాకాళి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఇది భారతదేశం నుంచి వస్తున్న మొదటి మహిళా సూపర్ హీరో చిత్రం, విశ్వంలోనే అత్యంత క్రూరమైన సూపర్ హీరో చిత్రంగా మేకర్స్ అభివర్ణించారు. తజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ఒక అమ్మాయి తన తలను పులికి తాకించి ఉండడం బ్యాగ్రౌండ్‌లో విలేజ్ సెటప్ ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.