Lucky Bhaskar: తడిసిన కళ్ళతో.. నవ్వుతున్న పెదాలతో..

ABN, Publish Date - Oct 28 , 2024 | 08:57 AM

దుల్కర్‌ సల్మాన్‌ వేరే లెవెల్‌ లో యాక్ట్‌ చేశాడు. అంటే ఎఫర్ట్‌ లెస్‌గా చేశాడు.  మనల్ని కూడా చేయి పట్టుకొని తనతో పాటు బ్యాంక్‌లోకి తీసుకెళ్లిపోయాడు. దుల్కర్‌ మామూలు నటుడు కాదు. అతను చేసిన ప్రయత్నం మనకి కనపడకుండా ఉండటానికి అతను చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్‌.

"దుల్కర్‌ సల్మాన్‌ మమ్మూట్టి లాంటి మర్రిచెట్టుకి పుట్టాడు. మర్రిచెట్టు కింద మొక్కలు బ్రతకవని చెబుతుంటారు. కానీ దాని నుంచి బయటకు వచ్చి తన ప్రయాణాన్ని తను మొదలుపెట్టడం, తన దారి తను వేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. మమ్మూట్టి గొప్ప నటుడు.  దుల్కర్‌ కెరీర్‌ చూసి తండ్రిగా ఆయన గర్వపడతారు’’ అని త్రివిక్రమ్‌ అన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం 'లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా త్రివిక్రమ్‌, విజయ్‌ దేవరకొండ ఈ వేడుకకు హాజరయ్యారు.


పాత్రలోకి వెళ్ళిపోతాం.. 

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ తరం గొప్ప నటులు దుల్కర్‌ సల్మాన్‌,  విజయ్‌ దేవరకొండ. వాళ్ళిద్దరినీ ఒకే వేదికపై చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ సినిమా అయినా మనం చూసేటప్పుడు మనకి అందులో ఉన్న కథానాయకుడు నెగ్గుతూ ఉండాలని కోరుకుంటాం. ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, భాస్కర్‌ పాత్ర లక్కీ అవ్వాలని. సినిమా మొత్తం కోరుకుంటాం.  ఫైనల్‌గా అతను లక్కీగానే బయటకు వస్తాడు. టైటిల్‌ సినిమాకు యాప్ట్‌. చిన్న చిన్న పాత్రలను కూడా వెంకీ తీర్చిదిద్దిన విధానం బావుంది. బ్యాంక్‌లో బయట నిలబడే సెక్యూరిటీతో సహా ప్రతి ఒక్కరూ మనకొక ఎమోషన్‌ క్రియేట్‌ చేసి వెళ్తారు. దుల్కర్‌ సల్మాన్‌ వేరే లెవెల్‌ లో యాక్ట్‌ చేశాడు. అంటే ఎఫర్ట్‌ లెస్‌గా చేశాడు.  మనల్ని కూడా చేయి పట్టుకొని తనతో పాటు బ్యాంక్‌లోకి తీసుకెళ్లిపోయాడు. దుల్కర్‌ మామూలు నటుడు కాదు. అతను చేసిన ప్రయత్నం మనకి కనపడకుండా ఉండటానికి అతను చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్‌. ప్రతి పాత్రకు కనెక్ట్‌ అయ్యాను. అయితే ఎక్కువ కనెక్ట్‌ అయింది రాంకీగారి పాత్రకు. మిడిల్‌ క్లాస్‌ వాడు ఒక అడ్వెంచర్‌ చేస్తే నెగ్గాలని మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనలో చాలామంది అక్కడి నుండే వచ్చాము కాబట్టి. అడ్వెంచర్‌ చేసి, దాని నుంచి సక్సెస్‌ ఫుల్‌ గా బయటపడటం అనేది హోప్‌. ఆ హోప్‌ సినిమా చూసిన తర్వాత ఫైనల్‌గా కంప్లీట్‌ అవుతుంది. తడిసిన కళ్ళతో, నవ్వుతున్న పెదాలతో థియేటర్‌ లోనుంచి మీ అందరూ బయటకు వస్తారు. వెంకీ అట్లూరి పెద్ద సక్సెస్‌ ఇస్తుందని బలంగా నమ్ముతున్నా’’ అని అన్నారు.

 
కామన్‌ మ్యాన్‌ స్టోరీ.. 

దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ ‘‘లక్కీ భాస్కర్‌ ఒక కామన్‌ మ్యాన్‌ స్టోరీ.ఇదొక కొత్త జానర్‌ సినిమా. నాకు కొత్త ప్రయత్నం. ఇలాంటి సినిమా నిర్మించడానికి ముందుకు రావాలంటే ఎంతో ధైౖర్యం ఉండాలి. వెంకీ గారు చూడటానికి కాలేజ్‌ స్టూడెంట్‌ లా ఉంటారు. కానీ ఆయన రాసే సన్నివేశాలు, మాటలు గొప్పగా ఉంటాయి. ఆయన దర్శకత్వంలో నటించడం నటీనటులకు చాలా తేలికగా ఉంటుంది. తేలికగా ఆ పాత్ర, ఆ సన్నివేశాల్లోకి వెళ్లి పోతాము.  మీనాక్షి అందంగా ఉండటమే కాదు, అంతే అందంగా నటించింది. ఈ సినిమాకి నేను మూడు భాషల్లో డబ్బింగ్‌ చెప్పాను. త్రివికమ్‌గారికి అభిమానిని. ఆయన తీసిను'అల వైకుంఠపురములో’ చాలా ఇష్టం. ఒక కమర్షియల్‌ సినిమాలో కూడా లోతైన మాటలు రాయడం ఆయనకే చెల్లుతుంది. రాంకీ గారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. విజయ్‌ దేవరకొండ నా తమ్ముడు. మహానటి, సీతారామం సినిమాలకు విజయ్‌ వచ్చాడు. ఆ రెండు సినిమాలు విజయం సాధించాయి. ఇప్పుడు దీనికీ వచ్చాడు. తప్పకుండా విజయం సాధిస్తుంది.  ఇది మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

సుమతి పాత్ర నచ్చుతుంది..

మీనాక్షి చౌదరి మాట్లాడుతూ "సుమతి అనేది ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో నాకు ఇష్టమైన పాత్ర. ఇలాంటి పాత్రను ఇచ్చిన వెంకీకి థ్యాంక్స్‌. ద్కులర్‌ లాంటి మంచి మనిషి, మంచి నటుడితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మంచి కథలు, పాత్రలతో మిమ్మల్ని ఇలాగే అలరిస్తానని తెలుగు ప్రేక్షకులకు మాటిస్తున్నా. సుమతి పాత్ర అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

ఆశ కలిగించే సినిమా..

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ "సార్‌ సినిమా విజయం తర్వాత ఒక విభిన్న సినిమా చేయాలనుకున్నాను. వెండితెర మీద ఇప్పటివరకు బ్యాంకింగ్‌ నేపథ్యంలో ఇలాంటి సినిమా రాలేదు. అందుకే ఈ కథ ఎంచుకున్నాను. ఈ సినిమా చేయడానికి అంగీకరించిన దుల్కర్‌కి మనస్ఫూర్తిగా  కృత్ఞతలు. మనందరికీ డబ్బంటే ఇష్టం. డబ్బంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. అది నేను గ్యారెంటీగా చెబుతున్నాను. సినిమా అనేది వినోదాన్ని పంచాలి, ఆశని కలిగించాలి. ఈ సినిమా అలాంటి ఆశని కలిగిస్తుంది. దుల్కర్‌ అభిమానులు కాలర్‌ ఎగరేసుకుని తిరుగుతారు’’ అన్నారు.

Updated Date - Oct 28 , 2024 | 08:59 AM