Tollywood: ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ లో గొడవేంటి ...
ABN, Publish Date - Sep 10 , 2024 | 11:14 AM
గత కొంతకాలంగా తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ లో సభ్యుల మధ్య భూమి కొనుగోలు, ఆర్దిక లావాదేవీలకు సంబంధించిన వివాదం నెలకొంది.
గత కొంతకాలంగా తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ లో (Telugu Cine Production Executives Union) సభ్యుల మధ్య భూమి కొనుగోలు, ఆర్దిక లావాదేవీలకు (Land issues) సంబంధించిన వివాదం నెలకొంది. తాజాగా వీరు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో సభ్యుల మధ్య మాటా మాటా పెరిగి తోపులాటకు దారితీసిన పరిస్థితి నెలకొంది. విషయానికి వస్తే..గతేడాది బ్యాంకు అధికారులతో కలసి తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అకౌంట్స్లో ఉన్న కోట్లాది రూపాయలు గుట్టుచప్పుడు కాకుండా అప్పటి కార్యవర్గ సభ్యులు కొట్టేశారని. ఈ విషయాన్ని ప్రశ్నించగా వారిపై కార్యవర్గ సభ్యులు ఎదురుదాడికి దిగారన్న ఆరోపణలు వినిపించాయి.. అప్పట్లో ఈ వివాదం సీసీఎస్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా నమోదయింది .తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ ఎన్నో సంవత్సరాలుగా ఉంది. దీనిలో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్, ఉపాధ్యక్షులు కలిపి దాదాపు 700 మంది సభ్యులు ఉన్నారు. వీరికి జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. దీనిలో మొత్తం కోట్ల రూపాయల ఫండ్స్ ఉన్నాయి. యూనియన్ బైలా ప్రకారం యూనియన్లో ఉన్న వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ప్రతిపాదన ఎంతో కాలం నుంచి ఉంది.
అయితే గతేడాది మే నెలలో ప్రెసిడెంట్ సత్యనారాయణ దొరై, ప్రధాన కార్యదర్శి కాట్రగడ్డ సుధాకర్, ట్రెజరర్ రాజేష్ ఇళ్ల స్థలాల కోసం ల్యాండ్ కొన్నామని,
ఓనర్ నుంచి అగ్రిమెంట్ చేసుకున్నట్లు చెప్పారు. అయితే దానిని మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు, యూనియన్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులను పలు దఫాలుగా రూ. 6 కోట్ల 50 లక్షలు ల వరకు యూనియన్ అనుమతి లేకుండా అనధికారికంగా బ్యాంకు అధికారుల ప్రమేయంతో కాజేశారనే ఆధారాలతో అప్పటి అధ్యక్షుడు సెక్రటరీ ట్రెజరర్ పై కేసు నమోదు చేయగా, దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆగస్ట్ లో జరిగిన తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ ఎన్నికల్లో దొరై ప్యానల్ మీద అమ్మిరాజు ప్యానెల్ ఘన విజయం సాధించింది. యూనియన్ అధ్యక్షుడిగా అమ్మిరాజు కానుమిల్లి ఎంపికయ్యారు. గత కార్యవర్గంలో జరిగిన ల్యాండ్ కొనుగోలు మరియు క్యాష్ బదలాయింపు లపై, పాత కార్యవర్గం సభ్యులను పిలిచి కొత్త కార్యవర్గం వివరణ కోరగా, మరోమారు సభ్యుల మధ్య మాటా మాటా పెరిగి దాడి చేసుకునెంత వరకు పరిస్దితి దారితీసినట్లు యూనియన్ లోని సీనియర్ సభ్యులపై పాత కార్యవర్గ సభ్యులు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.