Gaddar Awards: ‘గద్దర్ అవార్డ్స్’పై తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్పందన ఇదే..

ABN , Publish Date - Jul 31 , 2024 | 06:46 PM

కళాకారులకు ప్రభుత్వం తరపున లభించే పురస్కారమైన నంది అవార్డ్స్‌ను కొంతకాలంగా ప్రభుత్వాలు పక్కన పెట్టేయగా.. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అదే పురస్కారాన్ని పేరు మార్చి ‘గద్దర్ అవార్డ్స్’ పేరిట ఇకపై కళాకారులకు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై ఇండస్ట్రీ నుంచి సరైన స్పందన రాలేదని సీఎం ఓ ఈవెంట్‌లో తెలపగా.. వెంటనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రియాక్ట్ అయింది.

CM Revanth Reddy and Gaddar

కళాకారులకు ప్రభుత్వం తరపున లభించే పురస్కారమైన నంది అవార్డ్స్‌ (Nandi Awards)ను కొంతకాలంగా ప్రభుత్వాలు పక్కన పెట్టేయగా.. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అదే పురస్కారాన్ని పేరు మార్చి ‘గద్దర్ అవార్డ్స్’ (Gaddar Awards) పేరిట ఇకపై కళాకారులకు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటన వచ్చిన తర్వాత టాలీవుడ్ నుంచి సరైన స్పందన రాలేదు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో పాటు ఒకరిద్దరు తప్ప ఎవరూ స్పందించలేదు. దీంతో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. టాలీవుడ్ ఎందుకు ఈ విషయంలో మిన్నకుండిపోయిందో అన్నట్లుగా రియాక్ట్ అయ్యారు. ప్రముఖ తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి ‘విశ్వంభర డాక్టర్‌ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం’ ప్రదానం సందర్భంగా రేవంత రెడ్డి ఈ కామెంట్స్‌ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్లపై వెంటనే మెగాస్టార్ చిరంజీవి ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. టాలీవుడ్ తరపున ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఈ విషయమై దృష్టి సారించాలని కోరారు. చిరంజీవి కోరిక మేరకు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కామెంట్స్‌ని దృష్టిలో పెట్టుకుని.. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఈ విషయంపై స్పందిస్తూ.. అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో..

Also Read- Raj Tarun: ఆరోపణలు మాత్రమే, ఆధారాలు చూపించలేదు.. లావణ్య వివాదంపై రాజ్ తరుణ్



TFPC.jpg

‘‘తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (Telugu Film Producers Council) తరుపున తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కొరకు సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy) చేస్తున్న కృషికి ధన్యవాధాలు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన సంస్థల ప్రతినిధులకు వారి సమయం ఇచ్చి ఆ మీటింగులో పరిశ్రమ గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. మన తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు సంతోషం వ్యక్తపరుస్తూ.. తెలంగాణలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అన్నిరకాల అభివృద్ధికి కృషి జేస్తానని తెలియజేసారు. ఇకపై సినిమా పరిశ్రమకు చెందిన వారికి ‘గద్దర్ అవార్డులు’ ప్రదానం చేస్తామని దానికి సంబందించిన విధివిధానాలు తయారు చేయాలని కోరారు. ఈ విషయంలో, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ‘గద్దర్’ అవార్డ్స్ గైడ్‌లైన్స్‌ను తెలంగాణ FDC వారికి తెలియజేయడం జరిగింది. ఆవిధంగా త్వరలో ‘గద్దర్ అవార్డు’ కొరకు మార్గదర్శకాలు తెలంగాణ FDC వారి సంప్రదింపులతో తయారుజేసి ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ మంత్రికి ఇవ్వడం జరుగుతుంది. గద్దర్ గారిని చూసి మేము గర్విస్తున్నాము. ఆయన నటునిగా, కళాకారునిగా, జానపద పాటలందు మరియు పేదలకు చేసిన సేవలకు సేవా రంగంలో ఆయన చేసిన విలువైన కృషికి లెజెండ్‌గా ఆయన పట్ల మాకు చాలా గౌరవం ఉందని తెలియజేస్తున్నాము..’’ అని తెలిపారు.


TFCC.jpg

ఇదే విషయంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber of Commerce) కూడా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇందులో.. ‘‘తెలంగాణ రాష్ట్రంలో ఫిలిం ఇండస్ట్రీ మరింత అభివృద్ధికి తోడ్పడుచున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు. ముఖ్యమంత్రిగారిని కలిసి ఫిలిం ఇండస్ట్రీకి చెందిన విషయముల గురించి వివరముగా చర్చించిన మీదట ఎన్నో సంవత్సరముల నుండి పెండింగ్‌లో వున్న అవార్డ్స్‌పై ముఖ్యమంత్రి ‘‘గద్దర్ అవార్డ్స్’’ పేరు మీద ఇక నుండి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వగలమని తెలియచేయగా ఫిలిం ఇండస్ట్రీ వారు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్‌కు సంబంధించిన కమిటీ గురించి చర్చించడం జరిగిందని, దీని మీద తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి మరియు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వారు ఒక కమిటీని నియమించి సదరు విధివిధానాలను తయారు చేసి, ఆ విధి విధానాలను తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌కి అతి త్వరలో అందజేయడం జరుగుతుందని తెలియచేయుచున్నాము..’’ అని పేర్కొన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 31 , 2024 | 06:46 PM