ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీలో తీవ్ర విషాదం.. సూప‌ర్‌స్టార్‌ కృష్ణ బావమరిది క‌న్నుమూత‌!

ABN, Publish Date - Jul 29 , 2024 | 09:57 AM

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ నిర్మాత, సూప‌ర్‌స్టార్‌ కృష్ణ బావమరిది ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు (74) క‌న్నుమూశారు.

Uppalapati Suryanarayana Babu

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ నిర్మాత, సూప‌ర్‌స్టార్‌ కృష్ణ (Krishna) బావమరిది ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు (74) (Uppalapati Suryanarayana Babu) ఆదివారం సాయంత్రం అపోలోలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు.

ఉప్పలపాటి గారు గ‌తంలో పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ పై తెలుగు, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 24 సినిమాలు నిర్మించారు. వీటిలో మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడీ, సంధ్యా, బజారు రౌడి, అల్లుడు దిద్దిన కాపురం, శంఖారావం వంటి విజ‌య‌వంత‌మైన సినిమాలు నిర్మించారు.

ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు (Uppalapati Suryanarayana Babu) కృష్ణా జిల్లా , పామర్రు మండలం రిమ్మనపూడి గ్రామంలో జన్మించారు. సూపర్ స్టార్ కృష్ణ రెండవ సోదరి లక్ష్మీ తులసిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు రాజ‌కీయాల‌లోనూ కీల‌క‌ పాత్ర పోషించారు.


రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన తొలి ప్ర‌య‌త్నంలోనే 1985లో కృష్ణా జిల్లా గుడివాడ నుంచి టీడీపీ అధినేత ఎన్టీఆర్‌పై పోటీ చేసి ఓటమి చెందారు. ఆపై నారా చంద్రబాబు నాయుడు, వడ్డే శోభనాద్రీశ్వర రావు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరి నాటి నుంచి పార్టీ ప‌టిస్ఠ‌త‌కు కృషి చేశారు. ఇటీవల గుంటూరు టీడీపీ లోక్ సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విజయం కోసం ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు (Uppalapati Suryanarayana Babu) ప‌ని చేశారు.

Updated Date - Jul 29 , 2024 | 09:58 AM