Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే

ABN, Publish Date - Dec 24 , 2024 | 06:21 PM

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ చరిత్ర సృష్టించుకున్న వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్ గా, స్టూడియో అధినేతగా ఇలా ఎన్నో అవతారాలు ఎత్తి, తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఎంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఒక్క కృష్ణ గారికే చెందుతుంది.

సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల గుండెల్లో దర్శకనిర్మాత మధుసూదన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు 'ప్రేమ చరిత్ర - కృష్ణ విజయం' రిలీజ్ డేట్ ప్రకటన ప్రెస్ మీట్ లోపాల్గొన్న అతిధులు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం 'ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం'. అంబుజా మూవీస్ – రామ్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై హెచ్.మధుసూదన్ దర్శకనిర్మాతగా రూపొందిన ఈ చిత్రంలో యశ్వంత్–సుహాసిని జంటగా నటించగా.. నాగబాబు, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.


ఈ చిత్రం జనవరి 3న, సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సందర్భంగా పత్రికా సమావేశం నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ పర్సనల్ మేకప్ మేన్ మాధవరావు, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రత్నమయ్య, ప్రముఖ సాహితీవేత్త - గీత రచయిత బిక్కి కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాదర్ గోరి, ప్రముఖ చిత్రకారిణి శ్రీమతి వాసిరెడ్డి స్పందన, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ, దర్శకనిర్మాత హెచ్.మధుసూదన్, సహనిర్మాత ఎం. శంకర్ ఈ వేడుకలో పాల్గొన్నారు.


'ప్రేమచరిత్ర – కృష్ణ విజయం' కృష్ణ నటించిన చివరి చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుందని, కృష్ణను అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలని అతిధులు ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణకు సంక్రాంతితో గల అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. దర్శకనిర్మాత మధుసూదన్ పేరు సైతం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అభినందించారు.

దర్శకనిర్మాత మధుసూదన్ మాట్లాడుతూ… 'సూపర్ స్టార్ కృష్ణతో సినిమా రూపొందించడం తన అదృష్టంగా భావించానని, ఆయన నటించిన ఆఖరి చిత్రం విడుదల కాని చిత్రాల జాబితాలో ఉండకూడదనే పట్టుదలతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతిక హంగులన్నీ అద్దుకున్న ఈ చిత్రం కృష్ణ అభిమానులతోపాటు అందరినీ అమితంగా అలరిస్తుందని' మధుసూదన్ ఆకాంక్షించారు

Updated Date - Dec 24 , 2024 | 06:26 PM