Kalki: అశ్వత్థామగా చేసింది అమితాబ్ కాదా
ABN, Publish Date - Aug 31 , 2024 | 02:35 PM
'కల్కి 2898 ఎడి’ (Kalki) చిత్రంలో ఏడడుగుల అశ్వత్థామ(Ashwatthama) పాత్ర ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. అమితాబ్ బచ్చన్ (Amitabh bachchan) ఆ పాత్రలో ఎంతగా ఒదిగిపోయారు.
'కల్కి 2898 ఎడి’ (Kalki) చిత్రంలో ఏడడుగుల అశ్వత్థామ(Ashwatthama) పాత్ర ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. అమితాబ్ బచ్చన్ (Amitabh bachchan) ఆ పాత్రలో ఎంతగా ఒదిగిపోయారు. ద్వాపర యుగం నాటి పాత్ర కాబట్టి సినిమాలో మిగిలిన అన్ని పాత్రలు ఇప్పటి ఎత్తులో ఉన్నా అమితాబ్ 7 అడుగుల ఎత్తులో కనిపిస్తారు.ఆ పాత్ర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకర్షించింది. ఇదంతా గ్రాఫిక్ మాయాజాలం అనుకున్నారంతా. కానీ నిజంగానే అంత ఎత్తున్న ఆర్టిస్ట్ ఆ పాత్రను పోషించారు. అంటే అమితాబ్ బచ్చన్‌కు డూప్‌గా చేశారు. ఇందులో అమితాబచ్చన్‌కి డూప్‌గా చేసింది జమ్మూ కశ్మీర్‌కు చెందిన సునీల్ కుమార్(Sunil kumar). ఎత్తు ఏడు అడుగులు ఏడు అంగుళాలు. జమ్మూలోని పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నారాయన. సినిమాలపై ఉన్న ఆసక్తితో ప్రయత్నాలు చేశారు. కల్కి సినిమాతోపాటు పలు హిందీ సినిమాల్లో అవకాశం అందుకున్నారు. తాజాగా విడుదలై బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంచలన చిత్రం 'స్త్రీ 2’ లో కూడా సునీల్ కుమార్ నటించాడు. ఇందులో సర్కట అనే దెయ్యం వేషంలో అలరించారు. తాజాగా శ్రద్దా కపూర్ తీసుకున్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారాయన. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం వరుసగా చిత్రాల్లో నటిస్తున్న సునీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'కల్కి’ చిత్రీకరణ అనుభవాలను పంచుకున్నాడు. ''చిన్నప్పటి నుంచి నేను అమితాబ్ సర్ ఫ్యాన్. నేను మాత్రమే కాకుండా నా కుటుంబ సభ్యులు మొత్తం అమితాబ్ జీ ఫాన్సే. అలాంటి అమిత్జీ కి డూప్‌గా నటించాలి అన్నప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. కల్కి సినిమా సెట్స్‌లో మొదటి రోజు అడుగు పెట్టిన విషయం ఎప్పటికి మరచి పోలేను. ప్రభాస్, అమితాబ్ గారు కలిసి కూర్చుని ఉన్నారు.
నన్ను చూడగానే నా వద్దకు వచ్చి మాట్లాడారు. ఆ రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. కల్కి సినిమా కోసం పలు యాక్షన్ సన్నివేశాల్లో నేను నటించాను. చాలా రోజుల పాటు షూటింగ్లో పాల్గొనే అవకాశం దక్కింది’’ అని చెప్పారు. షూటింగ్ కోసం సెలవు పెట్టి ముంబై, హైదరాబాద్ తిరగాలంటే సెలవులు కొంచెం కష్టమైనా సినిమాల్లో నటించడం బాగానే ఉంది అని సంతోషపడుతున్నారు సునీల్‌కుమార్.