SSMB29: మహేష్‌తో సినిమా.. క్లాసులకు రాజమౌళి

ABN, Publish Date - Oct 22 , 2024 | 04:20 PM

మహేశ్‌బాబు హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి 'ఎస్‌ఎస్‌ఎంబీ29’ వర్కింగ్‌ టైటిల్‌లో ఈ చిత్రం రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నాడట. ప్రస్తుతం దానికి సంబంధించిన విషయాలను అధ్యయనం చేయడానికి పలు క్లాసులకు హాజరవుతున్నారు.

మహేశ్‌బాబు (Mahesh babu) హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) 'ఎస్‌ఎస్‌ఎంబీ29’ వర్కింగ్‌ టైటిల్‌లో ఈ చిత్రం రూపొందించనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌, పాన్‌ వరల్డ్‌ స్థాయిలో పాపులర్‌ అయిన ఆర్టిస్ట్‌లతో యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తాజాగా రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ అంతర్జాతీయ కార్యక్రమానికి హాజరైన ఆయన.. మహేశ్‌తో తీస్తున్న సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో  ఆర్‌ఆర్‌ఆర్‌(RRR)లో ఉన్న జంతువుల కంటే ఎక్కువ జంతువులు ఉంటాయని చెప్పారు.  ‘నాకు జంతువులంటే ఇష్టం. 'ఆర్‌ఆర్‌ఆర్‌’తో సహా గతంలో నేను తీసిన సినిమాల్లో జంతువు?ను ఉపయోగించాను. ఒక విషయం అయితే కచ్చితంగా చెప్పగలను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కంటే ఎక్కువ జంతువులు నా నెక్ట్స్‌ మూవీస్‌లో ఉంటాయి’ అని అన్నారు.




కొత్త టెక్నాలజీతో కనులు చెదిరే గ్రాఫిక్స్‌తో వెండితెరను కలర్‌ఫుల్‌ చేసే జక్కన్న ఈ చిత్రం కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నాడట. ప్రస్తుతం దానికి సంబంధించిన విషయాలను అధ్యయనం చేయడానికి పలు క్లాసులకు హాజరవుతున్నారు. సినిమాలకు అద్భుతమైన విజువల్స్‌ అందించే హాలీవుడ్‌ సంస్థ ‘ఏ స్టూడియో’తో కలిసి ఆయన పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తారని టాక్‌ ఉంది. కథకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఒక పార్ట్‌లో చెబితే పనికాదని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్‌ కథ ఇదని ప్రచారంలో ఉంది. ఈ సినిమా షూటింగ్‌ జనవరిలో ప్రారంభం కానుందని ఇటీవల కథా రచయిత   విజయేంద్రప్రసాద్‌ చెప్పారు. కథ రాయడానికి దాదాపు రెండేళ్లు టైమ్‌ పట్టిందన్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక మహేశ్‌ కూడా పొడవాటి జుట్టు, గడ్డంతో పాత్రకు తగ్గట్టు మేకోవర్‌ అవుతున్నారు.      

Updated Date - Oct 22 , 2024 | 04:20 PM