SS Rajamouli: డాక్యుమెంటరీలో ఏం చెప్పారంటే..

ABN, Publish Date - Dec 28 , 2024 | 01:25 PM

తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రాల్లో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒకటి. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం తెలుగు సినిమాకు ఆస్కార్‌ను తెచ్చింది.

తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రాల్లో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒకటి. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం తెలుగు సినిమాకు ఆస్కార్‌ను తెచ్చింది.మూడేళ్లు.. వందలమంది ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు పని చేసిన ఈ సినిమాకు తెర వెనుక సంగతులు తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపారు. ఈక్రమంలోనే చిత్ర బృందం ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ (RRR Behind and Beyond)  పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. ఎంపిక చేసిన పలు థియేటర్లలో ఇటీవల విడుదలైన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో (NetFlix OTt) స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత విజయేంద్ర ప్రసాద్‌, నిర్మాత డీవీవీ దానయ్య తదితరులు ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఒకచోట తారసపడితే... అన్న ఆలోచనే మూలం...
‘‘కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు దాదాపు ఒకే సమయంలో పుట్టారు. ఒకే సమయంలో ఇద్దరూ కనిపించకుండా వెళ్లిపోయారు. వారిద్దరూ ఒకచోట తారసపడితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన నుంచి పుట్టిందే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ. బుక్స్‌, కామిక్స్‌, మూవీస్‌.. ఇలా ఏదైనా అందులో యాక్షన్‌ ఉంటే ఇష్టపడతా. అందులో సాధ్యమైనంతవరకూ ఎమోషన్‌ను జోడించాలనుకుంటా. హీరోల ఇంట్రడక్షన్స్‌ సీన్స్‌ను యాక్షన్‌ ఓరియెంటెడ్‌గానే కాకుండా ఆయా పాత్రల గురించి ప్రేక్షకుడికి లోతుగా తెలియానుకుంటా.  అలా చేేసందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మరింత స్కోప్‌ దక్కింది’’ అని రాజమౌళి ( SS Rajamouli) చెప్పారు.


ఫైర్‌ మేకింగ్‌ ఎలా అంటే..
‘‘రామ్‌చరణ్‌ ఎంట్రీ సీన్‌ విషయంలో ఆలోచించినంతగా మరే చిత్రానికి ఆలోచించలేదు. ఆ సీన్‌లో లుక్స్‌ పరంగా ఆ క్యారెక్టర్‌ హీరోగా కనిపించినా యాక్షన్‌ పరంగా విలన్‌గా కనిపిస్తుంది. ఫైట్‌ ఎలా ఉండాలో యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌కు వివరించా. నా విజన్‌ ఏంటో సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌కూ చెప్పా. పోరాటం చేస్తున్నవారు చరణ్‌ కంటిలో స్పష్టంగా కనిపించాలనుకున్నా. ఆ మేరకు లైవ్‌షాట్‌లో తీశాం. అది సీజీ కాదు’’
- రాజమౌళి

‘‘వందల మంది ఆ సీన్‌లో కనిపిస్తారు. డైరెక్టర్‌ కట్‌ చెప్పినా నేను ఎక్కడున్నది ఎవరికీ తెలియలేదు. అందులో ఓ వ్యక్తి జెండా ఊపుతూ ‘హీరో ఇక్కడ ఉన్నాడు’ అని టీమ్‌కి చెప్పాడు. అలా బయటకొచ్చా’’ - రామ్‌ చరణ్‌ (Ram Charan)



మేకింగ్‌ ఆఫ్‌ వాటర్‌..

‘‘టైగర్‌ సీక్వెన్స్‌ చేయాలని ఎప్పటినుంచో అనుకునేవాడిని. భీమ్‌ పాత్రతో అది కుదిరింది. తారక్‌ ఎంతో వేగంగా పరిగెత్తాడు. ఓచోట జంప్‌ చేేస క్రమంలో నేను ఊహించిన షాట్‌ దొరికిందనిపించింది. జంతువుల వేగాన్ని అందుకోవడం కష్టం. దానికి తగ్గట్టు తొలుత యానిమేషన్‌ చేశాం. యానిమల్‌ ఉందని ఊహించుకొని ఎన్టీఆర్‌ యాక్ట్‌ చేయడం ఒకెత్తు అయితే, ఎంత వేగంగా పరిగెత్తాలన్నది మరో ఎత్తు. భీమ్‌ క్యారెక్టర్‌ ఫిజికల్‌గా స్ర్టాంగ్‌ అయినా ఎమోషన్‌ ఎక్కువ. భీమ్‌- టైగర్‌ ఫేస్‌ టు ఫేస్‌ షాట్‌ ఐకానిక్‌. ఎన్టీఆర్‌ అరుపుతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఒక్క పులి కాదు రెండు పులలతో షూటింగ్‌ చేశా’’

- రాజమౌళి

‘‘భీమ్‌ పాత్రకు సిక్స్‌ ప్యాక్‌ లాంటివి కాకుండా స్ర్టాంగ్‌ బుల్‌లా కనిపించాలని జక్కన్న చెప్పాడు. తాడును లాగే విషయంలోనూ సినిమాటిక్‌ లిబర్టీ తీసుకోకుండా సహజత్వం ఉట్టిపడేలా చేశాడు’’
- ఎన్టీఆర్‌(NTR)


‘‘నా డ్రీమ్‌ ప్రాజెక్టు ‘మహాభారతం’ సాధ్యమయ్యేందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓ అడుగు దగ్గరపడేలా చేసింది. స్టోరీ టెల్లర్‌గా రామాయణం, మహాభారతం నుంచి స్ఫూర్తి పొందా. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అలా వచ్చిన ప్రొడక్టే’’ అని రాజమౌళి తెలిపారు.

‘‘నాతో సినిమా చేస్తానని రాజమౌళి 2006లో చెప్పారు. అలా 12 ఏళ్ల తర్వాత నాకు అవకాశం దక్కింది. నా బ్యానర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓ లాండ్‌మార్క్‌’’ అని డీవీవీ దానయ్య అన్నారు. 


‘‘చరణ్‌ది పర్‌ఫెక్ట్‌ బాడీ. అందుకే ఆయన యూనిఫామ్‌ వేసుకోగానే పోలీసును చూసినట్టు అనిపించింది. హెయిర్‌ విషయంలో కాస్త సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నాం’’ - రమా రాజమౌళి (Rama Rajamouli)

‘‘కురుక్షేత్ర యుద్థంలో అభిమన్యుడు ఎలా పోరాటం చేస్తాడో ఇందులో రామ్‌ ఫైట్‌ అలా ఉండాలన్నారు. పలుమార్లు రిహార్సల్స్‌ చేసిన అనంతరం దర్శకుడిని కలిశా. వావ్‌ అన్నారు’’ - సాల్మన్‌

Updated Date - Dec 28 , 2024 | 01:26 PM