Sridevi Movies : నాటి 'చిన్నోడు - పెద్దోడు', 'ఆదిత్య 369' నుంచి నేటి 'యశోద' వరకు.. 37వ వసంతంలోకి శ్రీదేవి మూవీస్
ABN, Publish Date - Apr 01 , 2024 | 03:21 PM
తెలుగు చిత్ర పరిశ్రమకు గౌరవం తీసుకొచ్చి సినిమాలు నిర్మించిన జాబితాలో నిలిచే నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్.
తెలుగు చిత్ర పరిశ్రమకు గౌరవం తీసుకొచ్చిన సినిమాలు నిర్మించిన నిర్మాణ సంస్థల జాబితాలో శ్రీదేవి మూవీస్ (Sridevi Movies) బ్యానర్ పేరు తప్పకుండా ఉంటుంది. నట సింహం నందమూరి బాలకృష్ణతో 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు', నానితో 'జెంటిల్‌మన్', సుధీర్ బాబుతో 'సమ్మోహనం', సమంతతో 'యశోద' వంటి ట్రెండ్ సెట్టింగ్ ఫిలిమ్స్ ప్రేక్షకులకు అందించారు ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (Krishna Prasad). ఆయన శ్రీదేవి మూవీస్ సంస్థను స్థాపించి నేటికి 36 వసంతాలు. #36YearsOfSrideviMovies
చంద్ర మోహన్(Chandra Mohan), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) హీరోలుగా శ్రీదేవి మూవీస్ (Sridevi Movies) పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన 'చిన్నోడు - పెద్దోడు'. ఏప్రిల్ 1, 1988లో విడుదలైంది. ఆ సినిమాతో స్ట్రెయిట్ నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్ ప్రయాణం ప్రారంభమైంది. #36YrsOfChinnoduPeddodu అంతకు ముందు కంటెంట్ రిచ్ తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. నిర్మాతగా ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు, ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇచ్చామా? లేదా? అన్నది ముఖ్యమని ఆలోచించే నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. అందుకే, ఆయన సంస్థ నుంచి మంచి కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ వచ్చాయి... వస్తున్నాయి.
సత్యరాజ్, ప్రభు, నదియా నటించిన తమిళ హిట్ 'చిన్న తంబి - పెరియ తంబి' చిత్రానికి 'చిన్నోడు - పెద్దోడు' రీమేక్. తమిళం సినిమా నచ్చడంతో రూ. 70 వేలు పెట్టి రీమేక్ రైట్స్ కొన్నారు శివలెంక కృష్ణ ప్రసాద్. శ్రీదేవి మూవీస్ (Sridevi Movies) సంస్థను స్థాపించి 1987లో గాంధీ జయంతి నాడు, అక్టోబర్ 2న పాటల రికార్డింగ్ ప్రారంభించారు. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) ఈ చిత్రానికి సంగీతం అందించగా.. జంధ్యాల మాటలు, వేటూరి & వెన్నెలకంటి పాటలు రాశారు.
రేలంగి నరసింహారావు (Relangi Narasimha Rao) దర్శకత్వంలో స్నేహితుడు ఎంవీ రావు నిర్మాణ నిర్వహణలో శ్రీమతి అనితా కృష్ణ నిర్మాతగా శివలెంక కృష్ణ ప్రసాద్ (Krishna Prasad) 'చిన్నోడు - పెద్దోడు' సినిమా చేశారు. విజయవంతంగా 12 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీదేవి మూవీస్ సంస్థ ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతోంది.
శ్రీదేవి మూవీస్ (Sridevi Movies) సంస్థ పుట్టినరోజు సందర్భంగా శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ''మా సంస్థ పేరు చెబితే ప్రేక్షకులు అందరికీ ముందుగా బాలయ్య బాబు గారితో నేను నిర్మించిన 'ఆదిత్య 369' గుర్తుకు వస్తుంది. అది నా తొలి సినిమా అనుకుంటారు. నిర్మాతగా నా ప్రయాణం మొదలైంది 'చిన్నోడు - పెద్దోడు' సినిమాతో!
జీవితంలో ఎంత దూరం వెళ్లినా తొలి అడుగు అనేది ఎప్పటికీ మర్చిపోకూడదు. నిర్మాతగా నా తొలి అడుగు బెస్ట్ స్టెప్ అయ్యింది. నిర్మాతగా నా ప్రయాణానికి వెన్నుదన్నుగా నిలిచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) అంకుల్, చంద్ర మోహన్ మావయ్యకు జీవితాంతం రుణపడి ఉంటాను. నిర్మాతగా 36 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు, ఒడిదుడుకులు చూశా. ఎన్ని చూసినా 'చిన్నోడు - పెద్దోడు' ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు కొనసాగాను'' అని చెప్పారు.
'చిన్నోడు - పెద్దోడు' చిత్రీకరణ జనవరి 7, 1988లో రావులపాలేనికి రెండు కిలోమీటర్ల దూరంలోని వేదిలేశ్వరం గ్రామంలోని రాజు గారింట్లో ఎక్కువ శాతం చిత్రీకరణ చేశారు. సినిమాను 27 రోజుల్లో 21 లక్షల బడ్జెట్‌తో తీశారు. అప్పట్లో 40 లక్షలకు పైగా వసూలు చేసి నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చి పెట్టింది.
ఇదిలాఉండగా.. తాజాగా ఇప్పుడు ప్రియదర్శి హీరోగా శ్రీదేవి మూవీస్ (Sridevi Movies) సంస్థలో శివలెంక కృష్ణ ప్రసాద్ (Krishna Prasad) ఇటీవల ఓ సినిమా ప్రారంభించారు. 'నాని జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.