నెగిటివ్ ప్రచారంపై ‘గుంటూరు కారం’ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 19 , 2024 | 02:19 PM
కొంతమంది కావాలనే తన సినిమా 'గుంటూరు కారం' మీద తప్పుడు ప్రచారం చేసారని, అయినా సినిమా పెద్ద విజయం సాధించి, ఈ సినిమా కొనుకున్న వాళ్ళకి లాభాలు తెచ్చి పెట్టిందని చెప్పారు నిర్మాత నాగవంశి.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' సినిమా నిర్మాత నాగ వంశి ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి సినిమా ఎంతటి విజయం సాధించిందో వివరించారు. "ఈ సినిమా మీద కొంతమంది కావాలని నెగటివ్ ప్రచారం చేశారు, పనికట్టుకొని మరీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు, అయినా కూడా సినిమా పెద్ద విజయం సాధించి, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చిపెట్టింది," అని చెప్పారు నాగవంశీ.
ఈ సినిమాని రాత్రి 1 గంటకి షోస్ వెయ్యడం తప్పు చేసానేమో అని నాగవంశీ అన్నారు. ఎందుకంటే ఆ సమయంలోనే ఈ సినిమాకి కావాలని సామాజిక మాధ్యమాల్లో, కొంతమంది మీడియా తప్పుడు ప్రచారం చేశారని, ఆ ప్రభావం మొదటి రోజు వుండింది అని, కానీ తరువాత కుటుంబ ప్రేక్షకులు చూసి, సినిమా బాగుంది అని చెప్పడంతో ప్రేక్షకులు ఆదరించారని చెప్పారు వంశీ. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అనే విషయాన్ని మేము ముందుగా ఇంకా బాగా ప్రచారం చేసి ఉంటే బాగుండేది అని, ప్రేక్షకుడిని ఈ సినిమాకి తగిన విధంగా తయారు చెయ్యలేకపోయాయేమో అని అనిపిస్తూ ఉంటుంది అని చెప్పారు. (Some section of media, people did negative campaign against our film, says 'Guntur Kaaram' producer)
రివ్యూస్ వలన సినిమా మీద ఎటువంటి ప్రభావం లేదని, ప్రేక్షకులకి సినిమా నచ్చి సినిమాని విజయవంతం చేసారని చెప్పారు నాగవంశీ. ఈ సినిమాని కొనుక్కున్నవాళ్ళు అందరూ సేఫ్ అని, వాళ్ళందరూ హ్యాపీగా వున్నారని వంశీ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా గురించి మొదటి రోజు బాగా నెగటివ్ ప్రచారం చేసారని, అందుకని మొదటి రోజు ప్రేక్షకులు కొంచెం గందరగోళానికి గురయ్యారని, కానీ రెండో రోజు నుండి కలెక్షన్స్ మళ్ళీ అదిరిపోయాయని నిర్మాత నాగవంశీ చెప్పారు.