Anurag - Ramya: గాయనీ గాయకులు వివాహబంధంతో ఒకటయ్యారు

ABN, Publish Date - Nov 16 , 2024 | 05:32 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో గాయనీగాయకులుగా అనురాగ్‌ కులకర్ణి (Anurag Kulakarni), రమ్య బెహర (Ramya Behara) మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు

తెలుగు చిత్ర పరిశ్రమలో గాయనీగాయకులుగా అనురాగ్‌ కులకర్ణి (Anurag Kulakarni), రమ్య బెహర (Ramya Behara) మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు గాయనీ గాయకులు, సంగీత దర్శకులు సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కామారెడ్డికి చెందిన అనురాగ్‌ కులకర్ణి సూపర్‌ సింగర్‌ (Singers) కార్యక్రమంతో సింగర్‌గా పరిచయమయ్యారు. అందులో విజేతగా నిలిచి.. సినిమాల్లోకి అడుగు పెట్టారు.

‘శతమానం భవతి’లో ‘మెల్లగా తెల్లారిందో’, ‘కాటమరాయుడు’లో ‘మిరా మిరా మీసం’, ‘పైసా వసూల్‌’లో టైటిల్‌ సాంగ్‌’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో ‘ఉండిపో ఉండిపో’ వంటి ఎన్నో పాటలు పాడారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’లో ‘పిల్లా రా’, ‘కేరాఫ్‌ కంచరపాలెం’లో ‘ఆశాపాశం’ పాటలు బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. నరసరావుపేటకు చెందిన రమ్య బెహర సంగీత పోటీల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఆమెను సినిమాల్లోకి తీసుకువచ్చారు. ‘బాహుబలి ది బిగినింగ్‌’లోని ‘ధీవరా’ పాట ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. రీసెంట్‌గా వీళ్లిద్దరూ కలిసి పాడిన పాట ‘హే రంగులే’. ఇది ఎంతలా హిట్‌ అయ్యిందో తెలిసిందే!

Updated Date - Nov 16 , 2024 | 06:17 PM