Shyam Benegal : తెలంగాణ ఆత్మను వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు
ABN, Publish Date - Dec 24 , 2024 | 05:18 AM
‘నాకు ఇప్పుడు 90 ఏళ్లు వచ్చాయి. ఆరోగ్యంగానే ఉన్నా. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులకు వర్క్ చేస్తున్నా. శరీరం, మనసు సహకరించినంత కాలం సినిమాలు తీయాలన్నది నా కోరిక’ అని కొద్ది రోజుల క్రితమే తన పుట్టినరోజు (డిసెంబర్ 14) సందర్భంగా...
‘నాకు ఇప్పుడు 90 ఏళ్లు వచ్చాయి. ఆరోగ్యంగానే ఉన్నా. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులకు వర్క్ చేస్తున్నా. శరీరం, మనసు సహకరించినంత కాలం సినిమాలు తీయాలన్నది నా కోరిక’ అని కొద్ది రోజుల క్రితమే తన పుట్టినరోజు (డిసెంబర్ 14) సందర్భంగా తనని కలసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన శ్యామ్ బెనెగల్ ఇక లేరు. తెలంగాణ ఆత్మను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు ఆయన. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా సామాజిక సమస్యలు, ఆర్ధిక అసమానతలను చర్చిస్తూ శ్యామ్ తీసిన చిత్రాలు ఓ వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. ఆయన రూపొందించిన ‘అంకుర్’, ‘నిషాంత్’, ‘సుస్మన్, ‘మండి’, ‘వెల్ డన్ అబ్బా’ చిత్రాల నేపథ్యం తెలంగాణ కావడం విశేషం. పేరున్న నటీనటుల జోలికి పోకుండా కొత్త తారలకు అవకాశాలు ఇస్తూ సినిమాలు రూపొందించారు శ్యామ్ బెనగల్. స్మితా పాటిల్, షబానా అజ్మీ, నసీరుద్దిన్ షా, ఓం పురి వంటి తారలు శ్యామ్ బెనగల్ చిత్రాలతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అవార్డులు పొందారు.
పన్నెండేళ్ల వయసులోనే ..
శ్యామ్ పూర్తి పేరు బెనగళ్ల శ్యామసుందర్‌రావు. ఆయన తండ్రి శ్రీధర్ బెనగల్ కర్నాటకకు చెందిన వారు. కొంకణి మాట్లాడే చిత్రాపూర్ సారస్వత బ్రాహణ కుటుంబం వారిది. చిన్నతనం నుంచి శ్యామ్‌కు సినిమాల మీద ఆసక్తి. అది గమనించి ఆయన తండ్రి ఓ కెమెరా కొనిచ్చారు. ఆ కెమెరాతోనే పన్నెండేళ్ల వయసులో ఓ లఘు చిత్రం తీశారు. సికిందరాబాద్ తిరుమలగిరిలో ఒక స్టూడియో కూడా ఉంది. ఓల్డ్ ఆల్వాల్‌లో ఉన్న ఇంట్లో కొన్ని రోజులు గడిపారు శ్యామ్. ప్రస్తుతం ఆ ఇల్లు శిధిలావస్థలో ఉంది. శ్యామ్ సోదరుడి కుమారుడు శ్రీధర్ ఇప్పుడు ఆల్వాల్‌లోనే ఉంటున్నారు. శ్యామ్ బెనెగల్ అల్వాల్ నుంచి రోజూ సైకిల్ మీద బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాలకు వెళ్లేవారు. అలా సైకిల్ తొక్కడం లో అనుభవాన్ని సంపాదించిన ఆయన సైకిల్ పోటీల్లోనూ ఛాంపియన్‌గా నిలిచారు.
కాపీ రైటర్‌గా కెరీర్ ప్రారంభించి..
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్ డిగ్రీ పొందిన శ్యామ్ బెనగల్ మొదట ముంబైలోని ఓ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్‌గా పని చేశారు. ఆ తర్వాత క్రియేటివ్ హెడ్‌గా మారారు. 1962లో తొలిసారిగా ఆయన గుజరాతీలో ‘ఘేర్ బేతాగంగ’ పేరుతో డాక్యుమెంటరీ తీశారు. ఇక అక్కడి నుంచి సినిమాకు దర్శకత్వం వహించడానికి ఆయనకు దశాబ్ద కాలం పట్టింది. ఆ సినిమా ‘అంకుర్’. ఈ సినిమాతోనే షబానా అజ్మీ, అనంత్ నాగ్ పరిచయమయ్యారు. తెలంగాణలో ఆర్ధిక అసమానతలు, లైంగిక వేధింపుల గురించి శ్యామ్ తీసిన చిత్రమిది. ఈ చిత్రం షూటింగ్ చాలా వరకూ ఆల్వాల్, మచ్చ బొల్లారం, తిరుమలగిరి ప్రాంతాల్లో జరగడం విశేషం. జాతీయ ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘అంకుర్’ అవార్డ్ పొందింది. ఇందులో నటించిన షబానా అజ్మీ జాతీయ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.
పారలల్ సినిమాకు ఆద్యుడు
‘అంకుర్’ చిత్ర విజయం అందించిన ప్రోత్సాహంతో 1970-80ల దశకంలో పారలల్ సినిమాకు ఊపిరి పోశారు శ్యామ్. ఆ తర్వాత నిషాంత్ (1975), మంథన్ (1976), భూమిక( 1977) వంటి చిత్రాలను రూపొందించారు. వీటిల్లో ‘మంథన్’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గుజరాత్‌లోని పాడి పరిశ్రమ అభివృద్ది గురించి తీసిన సినిమా ఇది. ఈ చిత్రకథ విన్న ఐదు లక్షల మంది గుజరాత్ రైతులు తలో రెండు రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ చిత్ర నిర్మాతలుగా మారడం విశేషం.శ్యామ్ రూపొందించిన ‘భూమిక’ చిత్రంతో స్మితా పాటిల్ ఉత్తమ నటిగా తొలిసారి జాతీయ అవార్డ్ పొందారు.
సుభాష్‌చంద్రబోస్ పై సినిమా
శ్యామ్ బెనగల్ 2004లో భారత స్వాతంత్య్ర యోధుడు సుభాష్ చంద్ర బోస్ గురించి ‘నేతాజీ సుభా్‌షచంద్రబోస్.. ద ఫర్‌గాటెన్ హీరో’ పేరుతో తీసిన చిత్రం ప్రశంసలు పొందింది. అలాగే బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవిత కథను కూడా సినిమాగా రూపొందించారు. ఇదే ఆయన చివరి చిత్రం.
తీరని లోటు : సీఎం రెవంత్ రెడ్డి
చలన చిత్రం రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన శ్యామ్ బెనెగల్ మరణం సినీ ప్రపంచానికి తీరనిలోటు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భారతీయ వాస్తవిక సినిమా విశ్వరూపాన్ని ప్రదర్శించిన దర్శకుడు, మట్టి మనుషుల జీవితకథలను వెండితెరపై దృశ్యమానం చేసిన దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్ అని తెలంగాణ సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన మరణం పట్ల మంత్రి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శ్యామ్ బెనెగల్ సినిమాలు సామాజిక సమస్యలను, మానవ సంబంధాల లోతును, మట్టిమనుషుల జీవిత కథలను కళ్లకు కట్టినట్టు చూపిస్తాయని ఆయన ప్రశంసించారు.
తెలుగులో ఒకే ఒక్క చిత్రం
శ్యామ్ బెనెగల్ తెలుగు వాడైనా తెలుగులో ఒకే ఒక్క చిత్రం తీయడం గమనార్హం. ఆ సినిమా ‘అనుగ్రహం’(1978). ఆ నాటి అగ్ర కథానాయిక వాణిశ్రీ పారలల్ సినిమాలో తను కూడా నటించాలనే తపనతో మేకప్ లేకుండా ఈ చిత్రం లో నటించారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు శ్యామ్ బెనెగల్. మరాఠీ లో వచ్చిన ‘కొండోరా’ నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనంత్ నాగ్, రావుగోపాల రావు, స్మితా పాటిల్ తదితరులు నటించారు. ఈ చిత్రం షూటింగ్ లో ఒక తమాషా సంఘటన జరిగింది. వాణిశ్రీకి కొన్ని హిందీ డైలాగులు ఇచ్చి, నేను చెప్పినట్లు హిందీలో వీటిని చెబితే నీకు రూ. ఐదు కోట్లు ఇస్తానని దర్శకుడు శ్యామ్ బెనెగల్ వాణిశ్రీ కి సవాల్ విసిరారు. దాన్ని స్వీకరించి ఐదే ఐదు నిముషాల్లో ఆ డైలాగులను హిందీ లో శ్యామ్ బెనెగల్ చెప్పినట్లే చెప్పారు వాణిశ్రీ. శ్యామ్ బెనెగల్ షాక్ అయ్యారు. వాణిశ్రీ గర్వంగా ఆయన వంక చూసి డబ్బు ఇవ్వండి అన్నట్లు చేతులు చాపారు. శ్యామ్ తన జేబులో చెయ్యి పెట్టారు. యూనిట్ లో అందరూ ఆయన వంకే చూస్తున్నారు. క్షణం లో జేబు లోంచి ఐదు పైసల నాణెం తీసి వాణిశ్రీ చేతిలో పెట్టీ ఇదే ఐదు కోట్లు అనుకో..అని నవ్వేశారు శ్యామ్.