Sai Durga Tej: చిన్నారుల భద్రతపై సంచలన పోస్ట్‌

ABN, Publish Date - Jul 07 , 2024 | 07:22 PM

సోషల్‌ మీడియా (Social Media) ప్రమాదకరంగా మారిందని, పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని హీరో సాయి దుర్గా తేజ్‌ (Sai durga tej) తల్లిదండ్రులకు సూచించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన ఓ పోస్ట్‌ పెట్టారు

సోషల్‌ మీడియా (Social Media) ప్రమాదకరంగా మారిందని, పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని హీరో సాయి దుర్గా తేజ్‌ (Sai durga tej) తల్లిదండ్రులకు సూచించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘కంట్రోల్‌ చేయలేనంతగా సోషల్‌ మీడియా క్రూరంగా, భయానకంగా తయారైంది. కొన్ని మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలని తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి. మీ పిల్లల ఫొటోలు, వీడియోలు నెట్టింట పోస్ట్‌ చేసేటప్పుడు కాస్త ఆలోచించండి. ఎందుకంటే.. సోషల్‌ మీడియా మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కొంతమంది యూట్యూబర్లు పిల్లల ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తూ.. పిల్లలతో కలిసి పేరెంట్స్‌ చేసిన వీడియోలపైనో అవమానకరంగా కామెంట్లు చేస్తున్నారనే విషయంపై తేజ్‌ ఈ పోస్ట్‌ పెట్టారు.  సోషల్‌ మీడియా వినియోగంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసినందుకు ఆయనను అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చిన్నారుల భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు తేజ్‌.




భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను అభ్యర్థించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ ట్విట్టర్‌లో సంబంధిత   కార్యాలయాల ఖాతాలను ట్యాగ్‌ చేశారు. సాయితేజ్‌ ట్వీట్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క  స్పందించారు. పిల్లల భద్రత తమ ప్రభుత్వం లక్ష్యాలలో ఒకటని, ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే విషయంపై మంచు మనోజ్‌ కూడా స్పందించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని మంచు మనోజ్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు ఇండియాలో ఉన్న యుఎస్ ఎంబాసి ని కోరారు. 

Updated Date - Jul 07 , 2024 | 07:49 PM