సున్నితమనస్కులైన సినీనటులను.. రాజకీయాల కోసం బలి చేయొద్దు
ABN, Publish Date - Oct 03 , 2024 | 10:12 PM
మంత్రి మంత్రి కొండా సురేఖ నాగార్జునపై చేసిన వ్యాఖ్యలపై చాలా మంది ప్రముఖులు ముందుకు వచ్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సాయి దుర్గ తేజ్, బన్నీ వాస్ స్పందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.
తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ (Konda Surekha) బుధవారం నాగార్జున (Nagarjuna), నాగ చైతన్య, సమంతలపై చేసిన వ్యాఖ్యలు రెండు రోజులైనా హాట్ టాపిక్‌గానే ఉన్నాయి. ఈక్రమంలో ఇప్పటికే టాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు ముందుకు వచ్చి తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సాయి దుర్గ తేజ్, బన్నీ వాస్ స్పందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.
ఈ సందర్భంగా సుప్రీమ్ స్టార్ సాయి దుర్గ తేజ్ స్పందిస్తూ.. రాజకీయంలో వ్యక్తిగత విమర్శలు సర్వసాధారణమైపోయాయి, ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారు , నిన్నటి రోజున రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ఒక ప్రఖ్యాత కథానాయకి పేరును ఉపయోగించడం , ఓ ప్రఖ్యాత సినిమా కుటుంబ వ్యహారాలను ఉటంకించి, మీడియా ముఖంగా మాట్లాడడం, వారికి రాజకీయంగా ఎంత లబ్ధి చేకూరుతుందో తెలియదు కానీ ఓ మహిళ ఆత్మాభిమానం , ఓ కుటుంబం పరువు, ప్రతుష్టలకు తీరని నష్టం, అన్యాయం జరిగింది. గౌరవనీయులైన మంత్రివర్యులకు, రాజకీయ విమర్శలకు, ఏ మాత్రం సంబంధం లేని, తెరమీద తప్ప జీవితంలో నటించలేని సున్నితమనస్కులైన సినీనటులను బలిచేయవద్దని, జరిగిన తొందరపాటు చర్యను, విజ్ఞులైనమీరు పెద్దమనసుతో సరిదిద్దే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ , భవిషత్తులో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని వినమ్రంగా విన్నవించుకుంటూ అంటూ పోస్టు పెట్టారు.
అదేవిధgగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. ఆవేశంలో మాట జారుతాం. అలాంటి సందర్భంలో కూడా మాట అదుపులో పెట్టుకోవడమే ఉత్తమ వ్యక్తుల అత్యుత్తమ లక్షణం. ఒక ఉన్నత పదవిలో ఉన్నప్పుడు,ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా స్ఫూర్తిదాయకంగా వ్యవహరించే తీరు మన పెద్దల నుంచి మనం నేర్చుకోవాలి. ఇన్ని నిందలు, ఇన్ని ఆరోపణలు సినీ కుటుంబంపై పడుతున్నా కూడా.. మనం గట్టిగా ప్రతిస్పందించక పోవడం..మనం అవతలి వాళ్లకు సాఫ్ట్ టార్గెట్ అయ్యేలా చేస్తుందేమో ఒకసారి ఆలోచించండి.. ఏమన్నా కూడా వీళ్ళు ఏమనరు అని మనమే వాళ్లకు విమర్శించే అవకాశం ఇస్తున్నామేమో అనిపిస్తుంది. కనీసం ఇప్పటినుంచి అయినా సినీ కుటుంబం తరఫు నుంచి గట్టిగా మన వాయిస్ వినిపించే సమయం వచ్చిందేమో అని నా అభిప్రాయం.. మనకు కూడా కుటుంబాలున్నాయి.. మనం కూడా మనుషులమే..మన మనసులు బాధపడతాయి.