Razakar: రజాకార్ సినిమా డైరెక్టర్‌కి అరుదైన గౌరవం దక్కేనా?
ABN, Publish Date - Nov 02 , 2024 | 06:07 PM
'రజాకార్' సినిమా డైరెక్టర్ యాట సత్యనారాయణ అరుదైన పురస్కారం అందుకోవడానికి ఒక మెట్టు దూరంలో ఉన్నాడు ఇంతకీ ఆ గౌరవం ఏంటంటే..
నిజాం పాలనకు, ఖాసిం రజ్వీ తన రజాకార్ సైన్యంతో చేసిన మతోన్మాద మారణ హోమానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎటువంటి సాయుధ పోరాటం చేశారు, ప్రజలు ఎలా తిరగబడ్డారు అనేది చరిత్ర పుటల్లో, పుస్తకాల్లో అందరికీ తెలిసిందే. ఈ కథను 'రజాకార్' పేరుతో సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ యాట సత్యనారాయణ. ప్రస్తుతం ఈ సినిమాకుగాను అరుదైన పురస్కారం అందుకోవడానికి ఒక మెట్టు దూరంలో ఉన్నాడు ఇంతకీ ఆ గౌరవం ఏంటంటే..
ఈ ఏడాది మార్చి 15న బీజేపీ నేత గూడారు నారాయణ రెడ్డి నిర్మాతగా యాట సత్యనారాయణ దర్శకత్వంలో రిలీజైన సినిమా 'రజాకార్'. ఈ సినిమాలో రాజ్ అర్జున్, మకరంద్ దేశ్ పాండే, తేజ సప్రూ, బాబీ సింహ, వేదిక, ఇంద్రజ, అనసూయ, ప్రేమ, జాన్ విజయ్, దేవి ప్రసాద్ కీలకపాత్రల్లో నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. కాగా ఈ సినిమా బాక్సాపీస్ వద్ద సంచలనం విజయం నమోదు చేసుకుంది. అయితే ప్రతి ఏడాది గోవాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఫెస్టివల్ అఫ్ ఇండియాలో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా ఈ సినిమా దర్శకుడు యాట సత్యనారాయణ నామినేట్ అయ్యారు. నవంబర్ చివరి వరకు ఈ అరుదైన గౌరవాన్ని సత్యనారాయణ గెలుపొందుతారో లేదో తెలుస్తుంది.
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ హైదరాబాద్‌కి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. హైదరాబాద్‌తో పాటు మిగతా తెలంగాణ ప్రాంతం నిజాంల పాలనలో వుండింది. ఖాసిం రజ్వీ అనే ఒక మత ఛాందసుడు, నిజాం పాలనలో రజాకార్ సైన్యాన్ని ఏర్పాటు చేసి, హిందూ ప్రజలపై దాడులు చేయడమే కాకుండా.. హైదరాబాద్‌ని భారతదేశంలో విలీనం కాకుండా అడ్డుకున్నాడు. నిజాం పాలనకు, రజాకార్ సైన్యానికి తెలంగాణ ప్రజలు ఎదురొడ్డి చేసిన పోరాటమే ‘తెలంగాణ విముక్తి పోరాటం’. ఖాసిం రజ్వీ స్థాపించిన రజాకార్ సైన్యం ప్రజలపై ఎటువంటి ఘాతుకాలకు పాల్పడింది, దానికి ప్రజలు ఎలా ఎదురుతిరిగారు, అప్పటి భారత ప్రభుత్వం ఎలా స్పందించింది? అనే నేపథ్యంలో తీసిన సినిమా ఇది.