Rashmi Gautam: పిల్లల్ని కనగానే సరిపోదు.. సోషల్ మీడియాలో రష్మీ సైరన్
ABN, Publish Date - May 14 , 2024 | 05:23 PM
పిల్లలను కన్న తర్వాత బాధ్యతగా వ్యవహరించాలంటూ హితవు పలికారు యాంకర్ రష్మి. పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన తాండూరులో చోటుచేసుకుంది.
పిల్లలను కన్న తర్వాత బాధ్యతగా వ్యవహరించాలంటూ హితవు పలికారు యాంకర్ రష్మి. పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన తాండూరులో చోటుచేసుకుంది. దీనిపై సోషల్ మీడియా వేదిక వరుస పోస్టులు పెట్టారామె. దీంతో ఆ కుక్కను చిన్నారి తల్లిదండ్రులు కొట్టి చంపారు. దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ, ‘ఇప్పుడు ఆ కుక్కను చంపినందుకు చిన్నారి తల్లిదండ్రులపై కేసు పెట్టాలని రష్మి అంటుంది’ అని కామెంట్ చేయగా, దీనిపై రష్మి స్పందించారు. ‘చిన్నారిని ఎందుకలా అజాగ్రత్తగా వదిలేశారు. కుక్క దాడి చేస్తున్నప్పుడు అతని తల్లిదండ్రులు నిద్ర పోతున్నారా? కనీసం ఏడుపు కూడా వినిపించలేదా? జంతువులపై ఇలాంటి ప్రచారాన్ని ఆపండి. తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రులకు సంబంధించిన వెయ్యి వీడియోలను నేనూ షేర్ చేయగలను. పిల్లల జీవితాలను రిస్క్‌లో పెట్టింది ఎవరు? అదే జంతువుల విషయానికొస్తే ఈ లాజిక్స్ అన్నీ మర్చిపోతారు. ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసి, మీరు మాత్రం ప్రశాంతతను తిరిగి పొందాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు’’ అని రష్మీ కౌంటర్ ఇచ్చింది.
దీనికి మరో నెటిజన్ స్పందిస్తూ, ‘మీకు బుర్ర లేదని అర్థమైంది. ఈ మాట అంటున్నందుకు సారీ’ అని అనగా, ‘మీకు ఉంది కదా! పిల్లలను కనడమే కాదు, ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు పిల్లలను అలా వదిలేయకండి’’ అని రష్మీ సూచించింది.
‘24 గంటలు పిల్లలతోనే ఎవరూ ఉండలేరు. రేపు మీరు కూడా అంతే! ఇలాంటివి కేవలం ఒక క్షణం గ్యాప్‌లో జరిగే అవకాశం కూడా ఉంది. ఇలాంటివి అనుకోకుండా జరుగుతుంటాయి’ అని మరో నెటిజన్ రిప్లై ఇవ్వగా, ‘మీరన్నది నిజమే.. అనుకోకుండా జరుగుతుంటాయి. కానీ, ఏదీ ఒక్క నిమిషంలో జరగదు. తల్లిదండ్రులు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా చూడాలి’ అని రష్మి సమాధానం ఇచ్చారు. బయట వ్యక్తులపై దాడి చేయకుండా పెట్స్‌కి యజమానులే తగిన శిక్షణ ఇవ్వాలని, దాడి జరిగీతే ఆ పెంపుడు జంతువు యజమానిపై కేసు పెట్టాలని రష్మి అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.