Ram Charan - Madame tussauds: రామ్‌చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ ఎప్పుడంటే..
ABN, Publish Date - Oct 22 , 2024 | 04:58 PM
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ లో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram charan) అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహం (wax statue) ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తోపాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహాన్ని కూడా పెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోషూట్, కొలతలు తీసుకోవడం ఇప్పటికే పూర్తయింది. రామ్ చరణ్ విగ్రహాన్ని సింగపూర్‌లోని తమ మ్యూజియంలో వచ్చే ఏడాది వేసవిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. (Madame Tussauds Singapore)
ఈ విషయాన్ని టుస్సాడ్స్ టీమ్ అబుదబి వేదికగా జరిగిన 'ఐఫా' వేడుకలో వెల్లడించారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘టుస్సాడ్స్ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా. చిన్నప్పుడు, దిగ్గజ నటులు పొందిన గుర్తింపు, మేడమ్ టుస్సాడ్స్‌లో వారి విగ్రహాలు చూసి ఆశ్చర్యపోయేవాడిని. నేను కూడా అలాంటి వారి పక్కన స్థానం సంపాదిస్తానని ఊహించలేదు. ఈ గుర్తింపు నా క్రాఫ్ట్ పట్ల నాకు ఉన్న కృషి మరియు అభిరుచికి నిదర్శనం. ఇందుకు నేను చాలా కృతజ్ఞుడిపై ఉంటాను. మేడమ్ టుస్సాడ్స్ నుంచి నాకు దక్కిన అద్భుత అవకాశమిది" అన్నారు.
అయితే ఇక్కడ ఇంకో విశేషం ఉంది. రామ్‌చరణ్‌తోపాటు (RAm Charan) ఆయన పెంపుడు కుక్క రైన్ కూడా ఉంది. క్వీన్ ఎలిజబెత్ తర్వాత పెంపుడు కుక్కతో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రామ్‌చరణ్‌కి మాత్రమే దక్కింది. దీనిపై ఆనందం వ్యక్తం చేసిన రామ్ చరణ్ ‘‘రైమీ నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. అది కూడా ఇందులో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన విషయం తెలిసిందే.
రామ్‌చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ పనుల్లో బిజీగా ఉన్నారు. కార్తిక్ సుబ్బరాజ్ కథ అందించగా శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కుతోంది. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది