Ram Charan: నిండైన మనసుతో పాపకు ప్రాణం పోశాడు

ABN, Publish Date - Oct 17 , 2024 | 01:41 PM

రామ్‌ చరణ్‌ చేసిన ఓ సాయం గురించి ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.  తాజాగా ఆయన ఓ చిన్నారికి ప్రాణదాతగా నిలిచారు రామ్‌చరణ్‌.

Global Star Ram Charan


మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటనలోనే కాదు, సాయం చేయడంలోనూ, సేవా కార్యక్రమాల్లో ముందుండే మంచి మనిషి. అందుకే ఆయన్ను అన్నయ్య అని, ఆపద్బాంధవుడు అని  అభిమానులు పిలుచుకుంటారు. ఆయన దార్లోనే తనయుడు గ్లోబల్‌స్టార్‌ కూడా నడుచుకుంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. గుప్త ధానాలు చేస్తుంటారు. చదువుకోవాలనే తపన ఉండి.. చదువుకోలేని వారికి చదువు చెప్పిస్తుంటారు. అయితే ఇవన్నీ పెద్దగా బయటకు తెలియని విషయాలు. రామ్‌ చరణ్‌ చేసిన ఓ సాయం గురించి ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.  తాజాగా ఆయన ఓ చిన్నారికి (Child with Heart Problem) ప్రాణదాతగా నిలిచారు రామ్‌చరణ్‌ (Ram Charan).

Also Read- TJ Gnanavel: ‘వేట్టయన్ ది హంటర్‌’కి ప్రీక్వెల్‌.. స్టోరీ లైన్ ఏంటంటే..

 
అసలు విషయంలోకి వెళ్తే.. ఆగస్టు 22న మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. మెగా అభిమానులకు ఆ రోజు ఓ పండగ లాంటిది. అదే రోజు ఒక ఫోటో జర్నలిస్టు కుటుంబంలో పాప జన్మించింది. కానీ ఆ పాపకి గుండె సంబంధిత పల్మనరీ హైపర్‌ టెన్షన్‌ అనే సమస్య ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా పాప బతికే అవకాశం చాలా తక్కువ ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో చికిత్స కోసం ఆ పాపని అపోలో ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఈ చికిత్సకి లక్షలు ఖర్చు అవుతుందనే విషయం తెలిసింది. కానీ సదరు జర్నలిస్టుకి అంత భారీ బడ్జెట్‌తో కూతురికి చికిత్స చేసే ఆర్థిక స్థోమత లేదు. ఇదే విషయం  రామ్‌ చరణ్‌ దృష్టికి వెళ్ళింది. పాప ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న చరణ్‌ ఆ చిన్నారికి చికిత్స అందించే బాధ్యతను తీసుకున్నారు. ఆగస్టు 24న ఆ పాపను హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. ఆ రోజు నుంచీ డిశ్చార్జ్‌ అయ్యేదాకా ఎప్పటికప్పుడు ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ కావాల్సిన సాయం అందిస్తూ వచ్చారు. పాపకు అవసరమైన బ్లడ్‌, ప్లేట్లెట్స్‌ వంటివి చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి అందించారు. ఎట్టకేలకు 53 రోజుల తర్వాత అంటే అక్టోబర్‌ 16న ఆ చిన్నారి పూర్తిగా కోలుకుంది.


'ఇక లేదు' అనుకున్న పాప ఆరోగ్యం కుదుటపడటంతో ఆ జర్నలిస్ట్‌ ఇంట ఆనందం అవధులు లేకుండా ఉంది. తాజాగా ఈ వార్త బయటకు రావడంతో రామ్‌చరణ్‌ను ప్రశంసిస్తున్నారు. నటనలోనే కాదు మంచి మనసులోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు చరణ్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.  ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత చరణ్‌ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు.  

Also Read- Salman Khan: సల్మాన్ ఇంటి దగ్గర ఫైర్.. బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ అరెస్ట్


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 17 , 2024 | 06:30 PM