Rakul Preet Singh: ఆ రోజులు పోయాయి.. ఆ సత్తా మాకూ ఉంది 

ABN, Publish Date - Jul 14 , 2024 | 10:38 AM

తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా వెలిగిపోతున్న సమయంలోనే... హఠాత్తుగా వివాహబంధంలోకి అడుగుపెట్టి, అభిమానులను ఆశ్చర్యపరిచింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Singh) .

తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా వెలిగిపోతున్న సమయంలోనే... హఠాత్తుగా వివాహబంధంలోకి అడుగుపెట్టి, అభిమానులను ఆశ్చర్యపరిచింది రకుల్‌ప్రీత్‌ సింగ్‌(Rakul Preet Singh) . అయితే చాలా విరామం తర్వాత కమల్‌హాసన్‌ ‘భారతీయుడు 2’(Indian2)తో పలుకరిస్తోంది. ఈ పంజాబీ భామ పంచుకున్న తాజా ముచ్చట్లివి...

మొదటి పారితోషికం...

చిన్న వయసులోనే వెండితెరపై కనిపించాలని కలలు కనేదాన్ని. ఆ వయసులో నాకు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలీదు. కానీ నమ్మకంతో ప్రయాణించి మోడల్‌గా, హీరోయిన్‌గా ఎదిగాను. ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం, కఠోరశ్రమతో నా లక్ష్యాన్ని చేధించా. నేను అందుకున్న మొదటి పారితోషికం కేవలం రూ. 5 వేలు మాత్రమే.

 
ఆయనో నట విశ్వవిద్యాలయం
కమల్‌ సార్‌తో కలిసి నటించడం నా అదృష్టం. నటనలో ఆయనో విశ్వవిద్యాలయం. వందేళ్ల భారతీయ సినిమాను తీసుకుంటే అందులో 60 ఏళ్లు కమల్‌హాసన్‌ లాంటి మహానటులే కనిపిస్తారు. కష్టపడాలే గానీ,  విజయానికి షార్ట్‌ కట్స్‌ ఉండవని నిరూపించిన వ్యక్తి ఆయన. ‘భారతీయుడు 2’లో 90 ఏళ్ల కురువృద్ధుడిగా కనిపించేందుకు ఉదయం ఐదు గంటలకే షూటింగ్‌ స్పాట్‌కు చేరుకునేవారు. మేకప్‌ కోసం ఓపికగా ఐదు గంటల పాటు కూర్చుని, 10 గంటలకు సెట్‌లో అడుగుపెట్టేవారు. షూటింగ్‌ పూర్తయ్యాక ఆ మేకప్‌ తొలగించడానికి మరో రెండు గంటలు పట్టేది. నటన పట్ల ఆయనకున్న నిబద్ధత చూసి షాకయ్యాను. కమల్‌ సర్‌... హ్యాట్సాఫ్‌.

ఇద్దరూ సమానమే కదా...
పారితోషికం విషయంలో నటీనటుల మధ్య చాలా వ్యత్యాసం చూపిస్తుంటారు. రెండు సన్నివేశాలు, నాలుగు పాటలకు హీరోయిన్లు పరిమితమయ్యే రోజులు పోయాయి. ఇప్పుడు నాయకలు కథాగమనంలో కీలకంగా ఉంటున్నారు. నిజానికి ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించగల సత్తా నటీమణులకూ ఉంది. అందుకే ప్రతిభను బట్టే పారితోషికాన్ని నిర్ణయించాలన్నది నా అభిప్రాయం.



కాలం మారింది...

‘పెళ్లి తర్వాత డ్రెస్సింగ్‌ స్టైల్‌ అలా ఉండాలి, ఇలా ఉండాలి’ అంటూ చాలామంది సూచిస్తుంటారు. నా వరకు డ్రెస్సింగ్‌ అనేది వ్యక్తిగతం. నా ఫ్యామిలీ, జాకీ ఫ్యామిలీకి లేని అభ్యంతరం మిగతావారికెందుకు? సమాజంలో పెళ్లిని పెద్ద విషయంగా చూస్తుంటారు. కానీ ఎవరి జీవితంలోనైనా అది సహజమైన ప్రక్రియే. పెళ్లయ్యాక ఓ అబ్బాయికి ఇలాంటి దుస్తులే ధరించమని చెప్పగలమా? కాలం మారింది. ఎవరికి నచ్చినట్టు వారు జీవించే స్వేచ్ఛ ఉంది.
ఇద్దరి అభిరుచులూ ఒక్కటే...

మావారు జాకీ భగ్నానీకి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎక్కువ. ఎప్పుడూ తను నవ్వుతూ, పక్కనున్న వారందర్నీ నవ్విస్తుంటారు. అందుకే నేను ఆయన్ని ఇష్టపడ్డానేమో. మా ఇద్దరి అభిరుచులూ ఒకేలా ఉంటాయి. మేమిద్దరం ఫిట్‌నెస్‌ను ఎంతగానో ఇష్టపడతాం. ఇద్దరం చిత్ర పరిశ్రమకు చెందినవారిమే కావడం వల్ల ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. ఇంట్లో కేవలం వ్యక్తిగత విషయాలు మాత్రమే మాట్లాడుకుంటాం. అతనిచ్చే ఎమోషనల్‌ సపోర్ట్‌ వల్లే పెళ్లి తర్వాత కూడా కెరీర్‌లో ముందుకు వెళ్తున్నా.

 
కొత్తవి ప్రయత్నిస్తుంటా!

నన్ను అందరూ ఫిట్‌నెస్‌ ఐకాన్‌ అంటుంటారు. ఏరోబిక్స్‌, యోగా, డ్యాన్స్‌, ప్రాణాయామం... ఇలా అన్నింటికీ సమయం కేటాయిస్తుంటా. ఫిట్‌నెస్‌ విషయంలో అస్సలు రాజీపడను. ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్త వర్కవుట్స్‌ ప్రయత్నిస్తుంటా. ఇక నా బ్యూటీ సీక్రెట్‌ అంటే... రోజు విడిచి రోజు స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో ముఖానికి, మెడకు మసాజ్‌ చేసుకుంటా. ఉదయం నిద్ర లేవగానే బుల్లెట్‌ కాఫీ తాగుతా.

Updated Date - Jul 14 , 2024 | 03:59 PM