Rajendra Prasad: అప్పట్లో తన కుమార్తెతో మాటల్లేవని బాధపడ్డ రాజేంద్రప్రసాద్ ఈ శోకాన్ని ఎలా తట్టుకుంటాడో..
ABN, Publish Date - Oct 05 , 2024 | 12:46 PM
నటకిరీటీ రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నటకిరీటీకి ఇలాంటి కష్టం రావడంపై అంతా ఎంతగానో బాధపడుతున్నారు. అయితే ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే రాజేంద్రుడు.. తన తల్లి గురించి, కుమార్తె గురించి ఓ సందర్భంలో చెప్పిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
నటకిరీటీ రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇంట తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నటకిరీటీకి ఇలాంటి కష్టం రావడంపై అంతా ఎంతగానో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా తన కుమార్తె గాయత్రి (Gayathri) ఇంత చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు చేరుకోవడం.. ఆ కుటుంబాన్ని పుట్టెడు దు:ఖంలోకి నెట్టివేసింది. రాజేంద్రప్రసాద్ అంటే నవ్వుల రారాజు. అలాంటి ఆయన.. కుమార్తెను కోల్పోయి విలపిస్తుంటే.. చూసే వారు తట్టుకోలేకపోతున్నారు. ఈ శోకం నుండి ఆయన ఎలా బయటపడతారో అంటూ ఎంతో ఆవేదనకు లోనవుతున్నారు. అయితే తన కుటుంబం గురించి ఎప్పుడూ చెప్పుకోని రాజేంద్రప్రసాద్ తన తల్లి విషయంలోనూ, అలాగే ఇప్పుడు చనిపోయిన తన కుమార్తె విషయంలోనూ రెండు సార్లు స్టేజ్‌పై చెప్పుకొచ్చారు.
Also Read- Rajendra Prasad: నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె మృతి.. విషయం ఏమిటంటే
తన తల్లి గురించి అప్పట్లో ఓ షోలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అప్పుడు అమ్మకోసం ఎదురు చూసి చూసి నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. అమ్మకోసం ఏడ్చి ఏడ్చి నేను కూడా చనిపోయే స్టేజ్‌కి వచ్చాను. అప్పుడు నా పరిస్థితిని చూసిన మా కుటుంబ సభ్యులు కనకదుర్గమ్మ గుడికి తీసుకెళ్లి అమ్మవారిని చూపించారు. ఇకపై కనకదుర్గమ్మే నీకు అమ్మ అని చెప్పారు. అమ్మ దేవతగా మారింది.. ఇప్పుడు బయటకు రాదు. అక్కడే అలానే ఉంటుందని చెప్పారు. అప్పటి నుంచి కనకదుర్గమ్మ అమ్మవారినే అమ్మ అని పిలుచుకుంటూ పెరిగాను..’’ అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఆ తర్వాత ‘బేవర్స్’ అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఎప్పుడూ షేర్ చేసుకోని ఓ విషయాన్ని రాజేంద్రప్రసాద్ పబ్లిగ్గా చెప్పారు. అదేంటంటే.. ఆ సినిమా కోసం ‘తల్లీ తల్లీ నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా.. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా’ అంటూ సుద్ధాల అశోక్ తేజ రాసిన, సునీల్ కశ్యప్ స్వరపరిచిన పాట గురించి ప్రస్తావిస్తూ.. చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన నేను నా కూతురిలోనే అమ్మను చూసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు, నా కూతురికి మాటలు లేవు. తను ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. అప్పటి నుంచి తనతో మాట్లాడటం మానేశాను. కానీ ఈ పాట విన్నాక.. నా కూతురిని ఇంటికి పిలిపించుకుని.. ఈ పాటను నాలుగు సార్లు వినిపించాను. ఆ పాట విన్నాక నా కూతురిపై కోపం పోయింది. అమ్మ చనిపోయినప్పుడు ఎలా అయితే ఏడ్చానో.. అలా ఏడ్చేశా.. అంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read- Nagarjuna: ఆ రోజు ఇండస్ట్రీని పట్టించుకోలేదు.. ఈ రోజు నీ వెంటే ఇండస్ట్రీ.. తేడా తెలిసిందా నాగ్
అప్పుడు అమ్మ, ఇప్పుడు కుమార్తె.. ఇద్దరూ రాజేంద్రప్రసాద్‌ని వదిలి వెళ్లిపోయారు. విచిత్రం ఏమిటంటే.. ఏ అమ్మవారిని అయితే అమ్మగా రాజేంద్రప్రసాద్ భావించారో.. ఆ అమ్మవారికి ఇష్టమైన దసరా రోజులలోనే తన కుమార్తెను కోల్పోవడం నిజంగా బాధాకరం. పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని రాజేంద్రప్రసాద్‌కి ఆ భగవంతుడు కల్పించాలని, ఈ శోకం నుంచి ఆయన, ఆయన కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
Also Read- Rajendra Prasad: పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యం రాజేంద్రుడికి ఆ దేవుడు ఇవ్వాలి
Also Read- Pawan Kalyan: అప్పుడు తిట్టినా కేసు లేదు.. ఇప్పుడు ఒక్కమాటకే పోలీసు కేసు
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి