Sukumar: గాంధీ తాత చెట్టు.. ఉత్తమబాల నటిగా దర్శకుడు సుకుమార్ కుమార్తెకు ప్రతిష్టాత్మక అవార్డ్
ABN, Publish Date - May 01 , 2024 | 04:20 PM
జీనియస్ డైరెక్టర్ సుకుమార్, శ్రీమతి తబితా సుకుమార్ దంపతుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డిని ఉత్తమబాల నటిగా దాదా సాహెబ్ ఫాల్కే ఫెస్టివల్ పురస్కారం వరించింది.
జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), శ్రీమతి తబితా సుకుమార్ దంపతుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి (SukritiVeniBandreddi)ని ఉత్తమబాల నటిగా దాదా సాహెబ్ ఫాల్కే ఫెస్టివల్ (Dadasaheb Phalke Award) పురస్కారం వరించింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు (Gandhi Thatha Chettu) చిత్రంలో ఉత్తమ నటనకు గాను ఈ అవార్డును అందజేశారు. మంగళవారం ఢీల్లిలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు.
ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లో గ్రేడ్ 8 అభ్యసిస్తున్న సుకృతి వేణి బండ్రెడ్డి నటించిన ఈ చిత్రం గతంలో కూడా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి, సుకృతి నటనకు ప్రశంసల జల్లులతో పాటు ఈ చిత్రం పలు అవార్డులను గెలుచుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి సినిమా బాలనటిగా సుకృతి వేణి బండ్రెడ్డిని అవార్డులు వరించాయి.
11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా, న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరి బెస్ట్ ఫిలింగా, ఉత్త ప్రాంతీయ చిత్రంగా అవార్డులు అందుకోగా, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ల్ తో పాటు 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ జ్యూరీ ఫిలింగా గాంధీ తాత చెట్టు అవార్డులు అందుకోవడం విశేషం. ఇవి కాకుండా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నుండి ఈ చిత్రానికి ఆహ్వానాలు అందుతున్నాయి.
పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా తెరకెక్కిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings)తో పాటు గోపీ టాకీస్ (Gopi Talkies) సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, శేష సింధు రావులు నిర్మాతలు. పద్మావతి మల్లాది (PadmavathiMalladi) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.