Puri Musings: అందరి జీవితాలు అలాగే తగలబడ్డాయి..

ABN, Publish Date - Nov 16 , 2024 | 10:27 PM

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, ‘పూరి మ్యూజింగ్స్‌’ పేరుతో వివిధ అంశాలపై  తన అభిప్రాయాలు చెబుతుంటారు. తాజాగా ‘అన్‌హ్యాపీనెస్‌’ అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా కాకి కథ చెప్పారు.


డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌(Puri Jagannadh) , ‘పూరి మ్యూజింగ్స్‌’ (Puri Jagannadh Musings) పేరుతో వివిధ అంశాలపై  తన అభిప్రాయాలు చెబుతుంటారు. తాజాగా ‘అన్‌హ్యాపీనెస్‌’ అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా కాకి కథ చెప్పారు. ‘‘ఒక కాకి, చెట్టు మీద కూర్చొని ఏడుస్తుంది. అదే చెట్టు కింద కూర్చొన్న సాధువులు ‘ఎందుకు ఏడుస్తున్నావు’ అని అడిగారు. అప్పుడు కాకి, ‘నేను నల్లగా ఉంటాను. ఎవరూ నన్ను పెంచుకోరు. ముద్దు చేయరు. నన్ను ప్రేమించే వాళ్లే లేరు. ఏ ఇంటి మీద వాలినా కర్రతో కొడుతున్నారు. నా మీద నాకే చిరాకేస్తోంది స్వామీ. ఈ ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు. నా జీవితమే ఇలా ఏడ్చింది’ అని అన్నది. ‘ఎవరు బాగున్నారు’ అని అడిగాడు సాధువు. ‘అదిగో అక్కడ హంసను చూడు స్వామీ. ఎంత అందంగా పుట్టిందో’ అన్నది. ‘ఒకసారి వెళ్లి ఆ అందమైన హంస ఆనందంగా ఉందో లేదో కనుక్కో’ అన్నాడాయన. ‘‘కాకి వెళ్లి హంసను కలిసింది. అప్పుడు హంస ‘నాదీ ఒక అందమేనా? నా బొంద. తెల్ల సున్నం కొట్టి దేవుడు ఇక్కడ పడేశాడు. ఒంటి మీద ఒక రంగు లేదు. ఎప్పుడూ ఈ కొలనులో తిరుగుతూ బతకాలి. నాదీ బతుకేనా. ఆ మఖావూ (చిలుక)ను చూడు రంగు రంగులతో ఎలా పుట్టిందో ’అని హంస ఏడ్చింది. Unhappyness)

కాకి వెళ్లి మఖావూను కలిసింది. ‘ఇంత అందంగా పుట్టావు  కదా సంతోషంగా ఉన్నావా’ అని అడిగింది. ‘నేను అందంగా పుట్టడమే నాకు శాపమైంది. ఈ దుర్మార్గపు మనుషులు నన్ను పంజరంలో పెడుతున్నారు. అది ఎంత నరకమో నీకేం తెలుసు. నేను ఎగరలేను. ఎక్కడికీ వెళ్లలేను. జీవితాంతం జైలులో బతకాలి. నా కంటే నెమలి జీవితం బెటర్‌’ అనుకుంటూ అదీ ఏడ్చింది. ఆఖరికి కాకి వెళ్లి నెమలి దగ్గరకు వెళ్లింది. అప్పుడు నెమలి... ‘నన్ను ఈ జూలో పడేశారు. రోజూ టూరిస్టులు రావడం నాతో ఫొటోలు దిగడం, పురి విప్పమని ఒకటే టార్చర్‌ పెడుతున్నారు. అందరూ సెల్ఫీలు దిగుతున్నారు. ఏ మూడ్‌ లేకుండా ఎందుకు పురి విప్పాలి. ఒసేయ్  కాకి, నీ జీవితమే బాగుంది. ఎవరూ నిన్ను ప్రేమించరు. పట్టించుకోరు. నీ ఇష్టం వచ్చినట్లు బతుకుతావు. కడుపునిండా తింటావు. ఎగురుతావు. ఇంతకన్నా ఏం కావాలి. నిన్ను చూస్తే అసూయగా ఉంది’ అని అన్నది నెమలి. ఆ మాటలు విని కాకి షాక్‌ తింది. పక్కవాడి జీవితం మనకంటే బాగుందని అనుకుంటాం. డబ్బు ఉన్నవాడు మనకంటే బాగా బతుకుతున్నాడని అనుకుంటాం. ఏమీ కాదు. ఇక్కడ అందరి జీవితాలు అలాగే తగలబడ్డాయి. అందరినీ పుట్టించిన దేవుడు హ్యాపీగా ఉన్నాడో లేదో తెలియదు. ఎవడి కష్టాలు వాడివి. ఆ కాకిలాగా మనల్ని ఎవరూ ప్రేమించకపోతే ఇంకా అదృష్టం. ఇంకా ఆనందంగా బతుకుతాం’’ అంటూ పూరి చెప్పారు.

Updated Date - Nov 16 , 2024 | 10:33 PM